Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆదాయం లేదు న్యాయం దక్కడం లేదు!


ఆలయ భూములు అన్యాక్రాంతం

 దశాబ్దాలుగా కేసులు పెండింగ్‌

విముక్తికి గట్టి ప్రయత్నం చేయని వైనం

 అచేతనావస్థలో దేవదాయ శాఖ

 (శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

దేవదాయ శాఖ భూముల అన్యాక్రాంతం..దశాబ్దాలుగా వినిపిస్తున్న మాట ఇది. కానీ ఆ కష్టం నుంచి దేవాలయాలను ప్రభుత్వాలు కాపాడలేకపోతున్నాయి. న్యాయ చిక్కుల నుంచి గట్టెక్కించలేకపోతున్నాయి. బహుశా దేవుళ్లకు ఓట్లు లేవన్న కారణమో... లేక సాగుదారులు, అక్రమార్కులు, లీజుదారుల ఆగ్రహం చవిచూస్తామన్న భయమో.. వారికి వత్తాసు పలుకుతున్న రాజకీయ నాయకుల సిఫారసులో తెలియదు కానీ..వాటికి కోర్టు కేసుల నుంచి విముక్తి లభించే గట్టి ప్రయత్నం జరగడం లేదన్నది వాస్తవం. ఫలితంగా వేలాది ఎకరాల దేవదాయ శాఖ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. అక్రమార్కుల చెరలోకి వెళ్తున్నాయి. 

ఎక్కడైనా దేవదాయ శాఖ భూముల విషయం ప్రస్తావిస్తే... కోర్టు కేసు పెండింగ్‌లో ఉందన్న మాట వినిపిస్తుంటుంది. దేవుడి భూములు సాగుచేసుకుంటున్న వారు శిస్తు కట్టడం లేదు. లీజుకు తీసుకున్న వారు అద్దెలు చెల్లించడం లేదు. ఆక్రమించుకున్న వారు క్రమబద్ధీకరించుకోవడం లేదు. ఇంత జరుగుతున్నా చర్యలకు ఉపక్రమించే స్థితిలో దేవదాయ శాఖ అధికారులు లేరు. ఆలయ భూములు కాపాడుకునే భాగంలో న్యాయ పోరాటానికి అవసరమైన పెట్టుబడి లేని దీన స్థితిలో ఆ శాఖ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. దీనికితోడు రాజకీయ ఒత్తిళ్లతో ఆ శాఖ సాహసోపేత నిర్ణయాల జోలికి వెళ్లడం లేదు. జిల్లా వ్యాప్తంగా 828 దేవాలయాలు ఉన్నాయి. ఇందులో చాలా వాటికి ఆస్తులు ఉన్నా... ఆదాయం సమకూరడం లేదు. దూప, దీప, నైవేద్యాలకు కూడా ఇబ్బందికరంగా మారింది. జిల్లాలో అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం, శ్రీకూర్మంలోని కూర్మనాథక్షేత్రం,   శ్రీముఖలింగంలో శ్రీముఖలింగేశ్వరుడు, పాలకొండలో కోటదుర్గమ్మ, రావివలస ఎండల మల్లికార్జునస్వామి ఆలయాలకు నిత్యం భక్తుల తాకిడి ఉంటుంది. విరాళాలు, హుండీల రూపంలో ఆదాయం సమకూరుతోంది. స్థానిక దాతల సహకారంతో కొన్ని ఆలయాలకు కొంతవరకూ ఇబ్బందులు ఎదురు కావడం లేదు. కానీ పురాతనమైన ఆలయాలు చాలావరకూ జీర్ణావస్థకు చేరుకున్నాయి. వాటికి సంబంధించి ఆస్తులు సాగులో ఉన్నా.. ఇతరత్రా అవసరాలకు వినియోగిస్తున్నా శిస్తు రూపంలో చెల్లింపులు లేవు. 

 ఆ 5 వేల ఎకరాల పరిస్థితి ఏమిటి?

జిల్లా వ్యాప్తంగా దేవదాయ శాఖకు చెందిన భూములు 14,000 ఎకరాలు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో సగం భూమి సాగులో ఉన్నట్టు తెలుస్తోంది.  8 వేల ఎకరాల వరకూ రైతుల ఆధీనంలో ఉంది. ఈ భూములకు శిస్తు రూపంలో ఏటా రూ.కోటి వరకూ సమకూరుతోంది. ఒక్కో ఆలయానికి వేర్వేరు మండలాల్లో భూములు సైతం ఉన్నాయి. రెవెన్యూ, దేవదాయ శాఖ రికార్డుల్లో ఆ భూములు ఉన్నట్టు తెలుస్తున్నా సంరక్షించలేదని స్థితిలో ప్రభుత్వం ఉంది. జిల్లా వ్యాప్తంగా 5 వేల ఎకరా లు ఆక్రమణల చెరలో ఉన్నట్టు తెలుస్తోంది. కళ్లెదుటే ఆక్రమణలు కనపడుతున్నా చర్యలు తీసుకోవడం లేదు. ముఖ్యంగా రాజాంలోని డోలపేట ఉమారామలింగేశ్వరాలయం, టెక్కలి శ్యామసుందర స్వామి, సోంపేటలోని కోదండరామస్వామి ఆలయానికి సంబంధించి విలువైన భూములు అక్రమార్కుల చెరలో ఉన్నాయి. ఏళ్ల తరబడి అదిగో ఇదిగో అంటూ కాలం వెళ్లదీస్తున్నారే తప్ప చర్యలు శూన్యం. 

 ఖర్చులు భరించలేని స్థితిలో..

ఎక్కడైనా భూములు ఆక్రమణకు గురైతే వెంటనే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. ముందుగా న్యాయవాది ద్వారా నోటీసులు అందిస్తాం. దానికి సమాధానం రాకుంటే కోర్టులో కేసు వేసి న్యాయ సాయం పొందుతాం.  జిల్లాలో కొన్ని ఆలయ భూములకు సంబంధించి కనీసం కోర్టు నోటీసులు ఇచ్చుకోలేని స్థితిలో దేవదాయ శాఖ ఉందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఆక్రమణదారులపై కేసు వేసే సమయంలో వివిధ ఫీజుల రూపంలో రూ.12 వేల వరకూ ఖర్చవుతుందని.. అంత డబ్బు లేకనే కేసుల జోలికి వెళ్లలేదని దేవదాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పడం గమనార్హం. అక్కడితో ఆగకుండా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నంతవరకూ తామేమీ చేయలేమని చెప్పడం విశేషం. అయితే ఆక్రమణదారులకు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారికి ఊతమిచ్చినట్టేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా దేవదాయ శాఖ జిల్లా కార్యాలయానికి వెళ్లి.. జిల్లాలో దేవదాయ భూముల వివరాలు అడిగితే రకరకాల కొర్రీలు పెడుతుంటారు. వివరాలు మాత్రం అందించరు.  ఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌తో పాటు దేవదాయ శాఖ అధికారులు భూముల రక్షణకు నడుంబిగించాల్సిన అవసరముంది. 

భూముల రక్షణకు చర్యలు

జిల్లా వ్యాప్తంగా దేవాలయాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.  సుమారు 14 వేల ఎకరాల భూములు ఉన్నాయి. ఇందులో 5 వేల ఎకరాలు ఆక్రమణలకు గురైనట్టు గుర్తించాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారికి నోటీసులు జారీచేశాం. ఇందుకు సంబంధించి వివరాలు సమగ్రంగా అందుబాటులో లేవు. 

-అన్నపూర్ణ, దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌, శ్రీకాకుళం
Advertisement
Advertisement