దొంగలు దొరికారు!

ABN , First Publish Date - 2020-07-01T09:43:30+05:30 IST

తిన్న ఇంటికి కన్నం వేశాడు ఓ యువకుడు..

దొంగలు దొరికారు!

రూ.56.65 లక్షల బంగారం,

రూ.33.84 లక్షల నగదు స్వాధీనం


విజయవాడ(ఆంధ్రజ్యోతి): తిన్న ఇంటికి కన్నం వేశాడు ఓ యువకుడు. పండగ సీజన్‌లో పక్కాగా రెక్కీ నిర్వహించి ఇంటి తాళాలు పగలుగొట్టేశాడు మరో యువకుడు. వాళ్లిద్దరి నుంచి రూ.56 లక్షల 65 వేల 625 విలువ చేసే ఆభరణాలు, 33 లక్షల 84 లక్షల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను విజయవాడ పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు మంగళవారం వెల్లడించారు. మహరాష్ట్రకు చెందిన ఆనంద్‌ జగన్నాథ్‌ సోలంకి వన్‌టౌన్‌ శివాలయం వీధిలో బంగారం, వెండి ఆభరణాల తయారీ దుకాణం నిర్వహిస్తున్నాడు.


సంగ్లీ జిల్లా అరవాడే గ్రామానికి చెందిన యువకులు అమోల్‌ వసంత్‌ పటేల్‌, సందీప్‌లకు ఇక్కడ ఉపాధి కల్పించాడు. కొద్ది నెలలుగా వాళ్లిద్దరూ జగన్నాథ్‌ షాపులోనే పనిచేస్తున్నారు. కుమార్తె వివాహ సంబంధం నిమిత్తం జగన్నాథ్‌ ఫిబ్రవరి 9న మహరాష్ట్రలోని సొంత గ్రామానికి వెళ్లాడు. ఆ సమయంలో వసంత్‌ పటేల్‌, సందీప్‌లను పిలిచి ఇల్లు, షాపును జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు. ఇంట్లో బంగారం, వెండి ఆభరణాలు ఉన్నాయన్న విషయాన్నీ చెప్పాడు. ఆనంద్‌ జగన్నాథ్‌ మహరాష్ట్రకు వెళ్లిన తర్వాత మార్చి 22వ తేదీ అర్ధరాత్రి సంపూర్ణ లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. ఆయన సొంతూళ్లో ఇరుక్కుపోయాడు. బంగారం, వెండి ఆభరణాలను ఒక కబ్బోర్డులో పెట్టి తాళాలు వేసి ఫ్రిజ్‌పై పెట్టారు.


ఇంటి తాళాలను వసంత్‌కు ఇచ్చాడు. ఈ విషయాన్ని వసంత్‌ గోవాలో పనిచేస్తున్న శైలేష్‌ పాటిల్‌కు చెప్పాడు. వాటిని కాజేస్తే తమ జీవితం స్థిరపడిపోతుందని అతడు సలహా ఇచ్చాడు. గోవా నుంచి కారులో శైలేష్‌ విజయవాడకు వచ్చాడు. సందీప్‌కు తెలియకుండా ఇంట్లో ఉన్న బంగారం, వెండి ఆభరణాలను వేర్వేరు బాక్స్‌ల్లో ఇద్దరూ సర్దేశారు. వాటితో నగరం దాటడానికి మాత్రం భయపడ్డారు. నగరం చుట్టుపక్కల, జిల్లా సరిహద్దుల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించడంతో ప్లాన్‌ మార్చుకున్నారు. ఆభరణాలున్న బాక్సులను కృష్ణవేణి ఘాట్‌ వద్ద ఉన్న పొదల వద్ద గోతుల తవ్వి రహస్యంగా భద్రపరిచారు. ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు కడుపులో నొప్పి వస్తుందని, వైద్యుడి వద్దకు వెళ్లి వస్తానని సందీప్‌కు వసంత్‌ చెప్పాడు. రోజు గడిచినా అతడు రాలేదు. సెల్‌ నంబర్‌ పనిచేయ లేదు.


అనుమానంతో యజమానికి ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చాడు. ఆయన వసంత్‌ గ్రామంలో విచారించినా అక్కడికి వెళ్లలేదని తేలింది. తర్వాత శైలేష్‌ తన స్వగ్రామమైన సంగ్లీ జిల్లా వైపాలేకి వెళ్లిపోగా, వసంత్‌ అరవాడే వెళ్లిపోయాడు. ఈనెల ఏడో తేదీన ఆనంద్‌ మహరాష్ట్ర నుంచి విజయవాడకు వచ్చి ఇంట్లో చూడగా బంగారు, వెండి వస్తువులు కనిపించలేదు. వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కృష్ణవేణి ఘాట్‌ వద్ద భూమి పాతిపెట్టిన వస్తువులను తీసుకోవడానికి వసంత్‌, శైలేష్‌లు నగరానికి మంగళవారం వచ్చారు. పక్కా సమాచారంతో వారిద్దర్ని అరెస్టు చేసిన వన్‌టౌన్‌ పోలీసులు రూ.56లక్షల 65వేల 625 విలువ చేసే 1225 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 


రెక్కీచేసి... పక్కా స్కెచ్‌ వేసి...      

పండగ సీజన్‌లో రెక్కీ నిర్వహించి ఇంటి తాళాలు పగలుగొట్టి చోరీకి పాల్పడి చివరికి పోలీసులకు దొరికాడు మరో యువకుడు. ఉయ్యారుకు చెందిన రత్నం శివ వరప్రసాదరావు అలియాస్‌ బుజ్జి తల్లితో కలిసి గ్రామంలోని టీవీఎస్‌ షోరూమ్‌ పైఅంతస్తులో నివసిస్తున్నాడు. జనవరి 9న వరప్రసాద్‌ మరికొంతమందితో కలిసి శబరిమలకు వెళ్లాడు. ఆయన తల్లి ఇంటికి తాళం వేసి 13వ తేదీన విజయవాడలో ఉంటున్న బంధువుల ఇంటికి వచ్చింది. ఆ మర్నాడు షోరూమ్‌ మేనేజర్‌ షాపు తెరవడానికి వెళ్లగా తాళాలు పగలగొట్టి ఉన్నాయి. అనుమానంతో పైకి వెళ్లగా ఇంటి తాళాలు పగిలిపోయి కనిపించాయి. ఇంట్లో బీరువాను ఇనుపరాడ్‌తో పగలగొట్టి అందులో ఉన్న రూ.50 లక్షలు నగదు రూ.10 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు కనిపించలేదు.


దీనిపై వరప్రసాద్‌ సోదరుడు రత్నం శ్రీధర్‌ ఉయ్యూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తును ప్రారంభించిన సీసీఎస్‌ పోలీసులు చుట్టు పక్కల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి ముదినేపల్లి మండలం పెదగొన్నూరు గ్రామానికి చెందిన గుబిలి సుబ్రహ్మణ్యం ఈ చోరీ చేసినట్టుగా గుర్తించారు. అతడిపై ముదినేపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేడీ షీట్‌ ఉంది. ముదినేపల్లితోపాటు ఉయ్యూరు, పశ్చిమగోదావరి ఏలూరులో సుబ్రహ్మణ్యం పలు నేరాలు చేశాడు. సంక్రాంతి సీజన్‌ కావడంతో జనవరిలో షాపులు రద్దీగా ఉండడంతోపాటు చాలామంది సొంతూళ్లకు వెళ్తారని గ్రహించాడు. 14వ తేదీకి రెండు రోజుల ముందు పెదగొన్నూరు నుంచి ఉయ్యూరుకు వచ్చాడు. వరప్రసాద్‌ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడు. షోరూమ్‌ వద్ద ఎవరూ లేకపోవడంతో అక్కడే ఉన్న వాచ్‌మన్‌ను ఎవరెవరు ఉంటున్నారు, పైన ఎవరైనా నివసిస్తున్నారా అన్న వివరాలు అడిగాడు. వాచ్‌మన్‌ ఎలాంటి వివరాలు చెప్పలేదు. 14వ తేదీన వరప్రసాద్‌ తల్లి కారులో బయటకు వెళ్లడాన్ని గుర్తించాడు.


అదే రోజు రాత్రి షోరూమ్‌ పైన ఉన్న ఇంటికి వెళ్లాడు. ఇనుపరాడ్‌తో తాళాలు పగలుగొట్టి బీరువాలో ఉన్న నగదు, ఆభరణాలను దొంగిలించాడు. సుబ్రహ్మణ్యంను ఉయ్యూరు బైపాస్‌ రోడ్డు వద్ద అరెస్టు చేసి రూ.33లక్షల 84వేల 988 నగదు, ఇనుప రాడ్డు, మోటారు సైకిల్‌ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు జనవరి 10న ఉయ్యూరులోని కాటూరు రోడ్డులోని సుజుకి షోరూంలో రూ.87వేలు దొంగిలించాడు. 

Updated Date - 2020-07-01T09:43:30+05:30 IST