పొంచి ఉన్న బ్లాక్‌ఫంగస్‌ ముప్పు

ABN , First Publish Date - 2021-05-14T06:25:49+05:30 IST

ఇప్పటికే కరోనా మహమ్మారితో అత లాకుతలమవుతున్న జిల్లాను మరో మహమ్మారి వెంటాడుతోంది.

పొంచి ఉన్న బ్లాక్‌ఫంగస్‌ ముప్పు
బ్లాక్‌ఫంగస్‌ సోకిన వారిలో కనిపిస్తున్న లక్షణాలు ఇవే

కరోనా బాధితులను వెంటాడుతున్న మహమ్మారి 

జిల్లాలో ఇప్పటికే ఇద్దరి మృతి , ఆసుపత్రుల్లో మరో ముగ్గురికి చికిత్సలు 

షుగర్‌ వ్యాధిగ్రస్థుల్లోనే బయటపడుతున్న కొత్త రోగం 

మెదడు దెబ్బతినడంతో ముక్కు, కళ్లకు ప్రమాదం 

ఇప్పటికీ ధృవీకరించని వైద్య, ఆరోగ్య శాఖ 

నిర్మల్‌, మే 13 (ఆంధ్రజ్యోతి) : ఇప్పటికే కరోనా మహమ్మారితో అత లాకుతలమవుతున్న జిల్లాను మరో మహమ్మారి వెంటాడుతోంది. అయితే ఈ మహమ్మారి వ్యాధి సాధారణ వ్యక్తులకు కాకుండా కరోనాసోకిన వారినే వెంటాడుతుండడం ఆందోళన రేకేత్తిస్తోంది. కరోనాకు గురైన షుగర్‌ వ్యాధిగ్రస్థుల్లో ప్రస్తుతం ఈ బ్లాక్‌ఫంగస్‌ ఎక్కువగా బయటపడుతున్నట్లు సమాచారం. కరోనా వైద్యచికిత్సల్లో భాగంగా ఎక్కువగా స్టెరాయిడ్స్‌ వాడుతున్న కారణంగా రోగుల్లో ఇమ్యూనిటీ పవర్‌ పూర్తిగా తగ్గిపోతున్న కారణంగానే బ్లాక్‌ఫంగస్‌ సోకుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. గత వారం పదిరోజుల నుంచి బ్లాక్‌ఫంగస్‌ కారణంగా జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించగా మరో ముగ్గురు హైదరాబాద్‌, నిర్మల్‌లోని ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్లాక్‌ఫంగస్‌ విస్తరిస్తుందంటూ సామాజిక మాధ్యమాల్లో విసృతంగా ప్రచారం జరుగుతున్న క్రమంలోనే జిల్లాలో సైతం ఇదే లక్షణాలు బయటపడుతుండడం ఆందోళన రేకేత్తిస్తోంది. బ్లాక్‌ఫంగస్‌ సోకిన వారిలో షుగర్‌ లెవల్స్‌ విఫరీతంగా పెరిగిపోయి వారి మెదడు దెబ్బతింటుందని తద్వారా ముక్కు, కళ్లు, కిడ్నీలు, ఊపిరితిత్తుల లాంటి అవయవాలకు ప్రమాదం ఏర్పడుతోందంటున్నారు. ముఖ్యంగా కళ్లపై బ్లాక్‌ఫంగస్‌ ఎక్కువ ప్రభావం చూపుతోందని ఇది సోకిన వారి కళ్లు పూర్తిగా మూసుకుపోతున్నాయని పేర్కొంటున్నారు. జిల్లాలోని భైంసా మండలం చింతల్‌బోరి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా అనం తరం బ్లాక్‌ఫంగస్‌ సోకడంతో ఆయనను హైదరాబాద్‌కు తరలించారు. ఆయన కళ్లు పూర్తిగా మూసుకుపోవడమే కాకుండా ముక్కులో నుంచి నలుపురంగు స్రావాలు వచ్చినట్లు చెబుతున్నారు. ఇతనికి చికిత్సలు నిర్వహిస్తుండగానే మరణించినట్లు కుటుంబీకులు వెల్లడించారు. అలాగే గురువారం కుభీర్‌ మండలానికి చెందిన మరో వ్యక్తి కూడా బ్లాక్‌ఫంగస్‌ లక్షణాలతో మరణించిన వ్యవహారం దుమా రం రేపుతోంది. వీరితో పాటు భైంసా పట్టణానికి చెందిన మరొకరు ఇదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఒకరితో పాటు నిర్మల్‌ మండలంలోని రత్నాపూర్‌ కాండ్లి గ్రామానికి చెందిన మరో వ్యక్తి బ్లాక్‌ఫంగస్‌తో తీవ్ర అస్వస్థతకు గురై ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. ప్రస్తుతం నిర్మల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బ్లాక్‌ ఫంగస్‌ బాధితుడి పరిస్థితి ప్రమాదకరంగా మారిందంటున్నారు. ఇక్కడి న్యూరో డాక్టర్‌లు అతనికి చికిత్సలు నిర్వహిస్తున్నారు. కాగా బ్లాక్‌ఫంగస్‌తో జరిగిన మరణాలపై గాని ఈ వ్యాధి విస్తరణపై గాని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం స్పష్టత నివ్వడం లేదు. దీనిపై తమకు స్పష్టమైన సమాచారం లేదని బ్లాక్‌ ఫంగస్‌తో బాధపడుతూ ఇప్పటి వరకు ఎవరు కూడా ప్రభుత్వాసుపత్రుల్లో చేరలేదని జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారి ధన్‌రాజ్‌ స్పష్టం చేశారు. కాగా గత వారం రోజుల నుంచి బ్లాక్‌ఫంగస్‌ విస్తరణపై ప్రచారం జరుగుతుండడంతో ఆ లక్షణాలతో భాధపడుతున్న వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కరోనావైరస్‌ సోకిన షుగర్‌ వ్యాధి గ్రస్థులకు చికిత్స సమయంలో రెమిడెసివర్‌తో పాటు ఇతర స్టెరాయిడ్‌లు ఇస్తున్న కారణంగానే ఈ బ్లాక్‌ఫంగస్‌ పెరుగుతున్నట్లు చెబుతున్నారు. స్టెరాయిడ్స్‌ల వాడకం అధికం కావడంతో రోగిలో వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుందని, వారిలో వైరస్‌ ప్రభావం కనిపించకున్నప్పటికీ క్రమం గా బ్లాక్‌ఫంగస్‌ లక్షణాలు వెలుగుచూస్తున్నాయంటున్నా రు. 

షుగర్‌ వ్యాధిగ్రస్థులకు పొంచి ఉన్న ముప్పు

కరోనావైరస్‌కు గురై ఆసుపత్రుల్లో చేరి వైద్యచికిత్సలు పొందుతున్న షుగర్‌వ్యాధి గ్రస్థులకు ఎక్కువగా బ్లాక్‌ ఫంగస్‌ ముప్పు పొంచి ఉందంటున్నారు. కరోనాచికిత్సలో భాగం గా వీరికి ఎక్కువ స్టెరాయిడ్స్‌ వాడుతుండడంతో షుగర్‌ లెవల్స్‌ పెరిగిపోతున్నాయంటున్నారు. కరోనా పాజిటివ్‌ నుంచి నెగెటివ్‌ రిపోర్టులు వచ్చిన వారిలో కొద్ది రోజులకు ఈ బ్లాక్‌ఫంగస్‌ లక్షణాలు బయటపడుతున్నాయంటున్నా రు. ఇప్పటి వరకు బ్లాక్‌ఫంగస్‌కు గురైన వారిలో ఎక్కువ మంది షుగర్‌ వ్యాధిగ్రస్థులే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. చికిత్స సమయం లో షుగర్‌వ్యాధి విషయాన్ని అధికారులు పక్కన పెట్టి ఇష్టానుసారంగా స్టెరాయిడ్స్‌ వాడుతున్న కారణంగా ఇప్పటికే ఇతర దుష్పరిణామాలు కూడా రోగుల్లో బయటపడుతున్నాయి. 

వెలుగుచూస్తున్న కొత్త లక్షణాలు

కరోనాపాజిటివ్‌ రోగుల్లో జ్వరం, దగ్గు, దమ్ము, జలుబు, విరేచనాలు, వాసన కోల్పోవడం, రుచి తెలియకపోవడం లాంటి లక్షణాలు బయటపడుతుండగా బ్లాక్‌ ఫంగస్‌ సోకిన వారిలో మరిన్ని కొత్త లక్షణాలు బయటపడుతున్నాయంటున్నారు. బ్లాక్‌ఫంగస్‌కు గురైన వారిలో ముక్కు నుంచి ద్రవం కారడం, ముక్కులోపల నల్లని చార లు ఏర్పడడం, నోరు, దవడలు, కళ్లు వాచిపోవడం అలాగే కిడ్నీల సంబంధిత వ్యాధులు బయటపడడం లాంటివి కనిపిస్తున్నాయంటున్నారు. భైంసా మండలంలోని చింతల్‌బోరి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి బ్లాక్‌ఫంగస్‌ సోకడంతో ఆయన కన్నుపూర్తిగా దెబ్బతింది. అలాగే నిర్మల్‌ మండలంలోని రత్నాపూర్‌ కాండ్లి గ్రామానికి చెందిన ఓ యువకునికి కూడా బ్లాక్‌ఫంగస్‌ సోకి కన్నుపూర్తిగా మూతపడిపోయింది. అలాగే కుభీర్‌ మండలంలోని ఓ వ్యక్తికి కూడా బ్లాక్‌ఫంగస్‌ కారణంగా కన్ను పూర్తిగా మూసుకుపోయింది. ఇలాఒకే లక్షణాలతో చాలా మంది బ్లాక్‌ఫంగస్‌ కారణంగా ఆసుపత్రుల పాలవుతున్నారు. అయితే ఇప్పటి వరకు కరోనా నుంచి బయటపడగానే ఇక తాము పూర్తిగా కోలుకున్నామని సంబురపడుతున్న వారందరికీ బ్లాక్‌ఫంగస్‌ ముప్పు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా షుగర్‌వ్యాధితో భాధపడుతున్న వారే కాకుండా మరికొన్ని ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారంతా బ్లాక్‌ఫంగస్‌ విస్తరణపై జరుగుతున్న ప్రచారంతో హడలెత్తిపోతున్నారు. 

నిర్మల్‌ ప్రైవేటు ఆసుపత్రిలో యువకుడికి చికిత్స 

జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు న్యూరో ఆసుపత్రిలో బ్లాక్‌ ఫంగస్‌తో బాధపడుతున్న యువకునికి చికిత్సలు అందిస్తు న్నారు. ఈ యువకుడు కొద్ది రోజుల క్రితం కరోనా భారిన పడ్డారు. ఈ యువకుడు కోలుకుంటున్న క్రమంలోనే ఓ వైపు వాచిపోయి కన్ను మూతపడిపోయింది. దీంతో ఆయ న నిర్మల్‌లోని ప్రైవేటున్యూరో ఆసుపత్రిలో చేరగా ఇక్కడి వైద్యులు మాత్రం ప్రాథమికంగా బ్లాక్‌ఫంగస్‌ లక్షణాలున్నాయని చెబుతున్నప్పటికీ అధికారికంగా మాత్రం దీనిని ధృవీకరించడం లేదు. కాగా ఈ యువకుడు బ్లాక్‌ ఫంగస్‌ తో బాధపడుతున్నాడని, ఆయనకు వైద్యసహాయం కోసం సహాయ, సహకారాలు అందించాలంటూ కొన్ని స్వచ్చంద సంస్థలు, ఆయన మిత్రులు సోషల్‌ మీడియాలో విసృతంగా ప్రచారం చేస్తున్నారు. సదరు యువకుడు చికిత్స పొందుతున్న వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. 

ధృవీకరించని వైద్య,ఆరోగ్యశాఖ 

ఇదిలా ఉండగా బ్లాక్‌ఫంగస్‌వ్యాధిపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం స్పష్టతనివ్వడం లేదు. ఇప్పటికే బ్లాక్‌ ఫంగస్‌ కారణంగా ఇద్దరు మరణించినట్లు జరుగుతున్న ప్రచారంపై కూడా వైద్య,ఆరోగ్యశాఖ ధృవీకరించడం లేదు. దీనిపై వివరాలు సేకరించిన తరువాత అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. 

Updated Date - 2021-05-14T06:25:49+05:30 IST