దేశంలో మళ్లీ కేసులు పెరిగే ముప్పు!

ABN , First Publish Date - 2021-06-18T09:13:15+05:30 IST

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగే అవకాశం ఉందని లాన్సెట్‌ మెడికల్‌ జర్నల్‌ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అత్యవసర వైద్య సేవలకు జాతీయ స్థాయిలో పారదర్శకమైన ధరల విధానం ఉండాలని స్పష్టం చేసింది.

దేశంలో మళ్లీ కేసులు పెరిగే ముప్పు!

అత్యవసర చర్యలు చేపట్టాల్సిందే

కేంద్ర ప్రభుత్వానికి లాన్సెట్‌ సూచన


న్యూఢిల్లీ, జూన్‌ 17: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగే అవకాశం ఉందని లాన్సెట్‌ మెడికల్‌ జర్నల్‌ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అత్యవసర వైద్య సేవలకు జాతీయ స్థాయిలో పారదర్శకమైన ధరల విధానం ఉండాలని స్పష్టం చేసింది. బయోకాన్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజుందార్‌, ప్రఖ్యాత సర్జన్‌ డాక్టర్‌ దేవి శెట్టి సహా 21 మంది నిపుణులు కొవిడ్‌పై పోరు కోసం కేంద్ర ప్రభుత్వం అత్యవసరంగా చేపట్టాల్సిన చర్యలను సూచించారు. జిల్లా, జిల్లాకు కొవిడ్‌ కేసులు, ఆరోగ్య సేవలు వేర్వేరుగా ఉంటాయి కాబట్టి అత్యవసర వైద్య సేవల సంస్థ్థను వికేంద్రీకరించాలని తెలిపారు. అంబులెన్సులు, ఆక్సిజన్‌, మందులు, ఆస్పత్రుల్లో సేవలు వంటి అన్ని అత్యవసర సేవలకు పారదర్శకమైన జాతీయ ధరల విధానం ఉండాలని.. అన్ని ధరలకు పరిమితులు విధించాలని పేర్కొన్నారు.


కొవిడ్‌-19 నిర్వహణ సమాచారం పూర్తి స్పష్టతతో, ఆధారాల సహితంగా, స్థానిక భాషల్లో ఉండాలని సూచించారు. ప్రైవేటు రంగం సహా ఆరోగ్య వ్యవస్థకు సంబంధించిన అన్ని రంగాల మానవ వనరులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. రోగులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. రాష్ట్రాలు తప్పనిసరిగా ప్రాధాన్య వర్గాలను గుర్తించి, అందుబాటులో ఉన్న టీకాలను ముందు వారికే ఇవ్వాలన్నారు. వ్యాక్సిన్ల సరఫరా మెరుగయ్యేకొద్దీ వ్యాక్సినేషన్‌ను విస్తరించాలని సూచించారు. కొవిడ్‌పై పోరులో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని, ముంబై తరహాలో చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రజల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. సంఘటిత రంగంలోని సంస్థలు కార్మికులందరినీ పనిలో కొనసాగించాలని, ఆర్థిక వ్యవస్థ గాడినపడ్డ తర్వాత ఆయా కంపెనీలకు ప్రభుత్వం పరిహారం అందించాలని సూచించారు. 

Updated Date - 2021-06-18T09:13:15+05:30 IST