Advertisement
Advertisement
Abn logo
Advertisement

మూడు శాపాలు

ఒక రోజు మహాప్రవక్త మహమ్మద్‌ తన సహచరులందరినీ మసీదులోని ఉపన్యాస పీఠం (మింబర్‌) దగ్గరకు రమ్మని ఆహ్వానించారు. వారందరూ పీఠం దగ్గరకు వెళ్ళి కూర్చున్నారు. మహాప్రవక్త ఉపన్యసించడానికి మింబర్‌ మొదటి మెట్టు మీద తన పాదాన్ని పెట్టి ‘‘ఆమీన్‌’’ అన్నారు. ఆ తరువాత రెండో మెట్టు మీద పాదాన్ని మోపి ‘‘ఆమీన్‌’’ అన్నారు. అదే విధంగా మూడో మెట్టు మీద పాదాన్ని పెట్టి ‘‘ఆమీన్‌’’ అని చెప్పారు. అనంతరం తన సహచరులవైపు తిరిగి, ధర్మోపదేశం చేశారు. ఆ తరువాత మింబర్‌ నుంచి కిందికి దిగి వచ్చారు.


అప్పుడు ఆయన సహచరులు ‘‘మహనీయ ప్రవక్తా! మీరు మింబర్‌ పైకి ఎక్కుతున్నప్పుడు ‘ఆమీన్‌’ అని మూడుసార్లు అన్నారు. ఇంతకుముందు ఎప్పుడూ ఇలా జరగలేదు. దీనికి కారణం దయచేసి వివరిస్తారా?’’ అని అడిగారు.

మహాప్రవక్త సమాధానం ఇస్తూ, ‘‘నా పాదం మొదటి మెట్టు మీద ఉన్నప్పుడు దేవదూతల నాయకుడైన హజ్రత్‌ జిబ్రయీల్‌ నా దగ్గరకు వచ్చారు. అల్లాహ్‌ను తలచుకొని, ఒక శాపం ఇస్తూ.... ‘‘ఓ అల్లాహ్‌! రమజాన్‌ పవిత్రమాసాన్ని పొంది కూడా క్షమాపణ పొందని మానవుణ్ణి నీవు నాశనం చెయ్యి’’ అని అన్నారు. ఆ వాక్యాలు విన్న నేను ‘ఆమీన్‌’ అన్నాను. 

రెండవ మెట్టు మీద పాదాన్ని మోపుతూ ఉంటే... హజ్రత్‌ జిబ్రయీల్‌ ఇలా శపించారు... ‘‘హజ్రత్‌ మహమ్మద్‌ నామాన్ని తన ఎదుట ఎవరైనా పలుకుతున్నప్పుడు, ఆ పేరు వినగానే ‘దురూదె షరీఫ్‌’ను పఠించనివాడు నాశనమగుగాక!’’ అని. ఈ వాక్యాలు విన్న నేను ‘ఆమీన్‌’ అన్నాను. 

మూడో మెట్టు మీద పాదం పెడుతూ ఉండగా... ‘‘తన తల్లితండ్రులు జీవించి ఉన్న కాలంలో వారికి సేవలు చేయకపోవడం వల్లా, వారి దీవెనలు పొందక పోవడం వల్లా స్వర్గ ప్రవేశానికి అర్హత సంపాదించుకోనివాడు నశించుగాక!’’ అని జిబ్రయీల్‌ మరోసారి శపించారు. నేను ‘ఆమీన్‌’ అన్నాను’’ అని చెప్పారు.

ఈ హదీసులో జిబ్రయీల్‌ ఇచ్చిన మూడు శాపాలు ఉన్నాయి. వీటన్నిటికీ మహాప్రవక్త మహమ్మద్‌ ‘ఆమీన్‌’ (అలాగే జరుగుగాక!) అంటూ స్పందించారు.

జిబ్రాయిల్‌ దేవదూతల నాయకుడు. అల్లాహ్‌ నుంచి మహాప్రవక్తకు దైవ గ్రంథాన్ని వహీ (ఆజ్ఞ) ద్వారా అందించిన ప్రముఖుడు. ఆయన శాపం సామాన్యమైనది కాదు. అలాగే ప్రవక్తల నాయకుడైన మహమ్మద్‌ ‘అమీన్‌’ అనే మాట సాధారణమైనది కాదు. ఇలాంటి శాపాలకు గురికాకుండా మంచి నడవడిని ప్రసాదించాలనీ, రక్షించాలనీ అల్లాహ్‌ను అందరూ వేడుకోవాలి.

- మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Advertisement
Advertisement