మూడు హిందీ కవితలు

ABN , First Publish Date - 2021-06-07T05:40:25+05:30 IST

ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు సరిగ్గా నా ముందు ఆమె ఏమీ చెప్పడం లేదు....

మూడు హిందీ కవితలు

ఆమె


ఇన్నాళ్ల తర్వాత

ఇప్పుడు సరిగ్గా

నా ముందు ఆమె

ఏమీ చెప్పడం లేదు

వినడం లేదు

పొందడం లేదు

పోగొట్టుకోవడం లేదు

కేవలం కళ్లముందు

ఒక పరిచితముఖం-

అంతే చాలు


ఈ మాత్రంతోనే 

అనేక ప్రశ్నలు

సమాధానం పొందాయి

అనేక శబ్దాలు

అర్థంతో నిండాయి

ఎందుకంటే ఆమె ఉంది


ఆమె ఉంది

ఉంది

నాకు ఆశ్చర్యంగా ఉంది


ఇన్నేళ్ల తర్వాత

ఈ కష్టకాలంలో కూడా

ఆమె సరిగ్గా అలాగే

నవ్వుతోంది


చాలు 

అంతే చాలు


కేథార్‌ నాథ్‌ సింగ్‌ (1934-2018)




ప్రేమ


ఆయన ఎవరో చాలా గొప్ప మీర్‌

ప్రేమ బరువైన రాయి

నీలాంటి బలహీనుడు ఎలా ఎత్తగలడన్నాడు


నేను ఆలోచించాను

దీన్ని ముక్కలు ముక్కలు చేసి ఎత్తవచ్చనుకున్నాను


అయితే అప్పుడు అది ప్రేమ ఎలా అవుతుంది

హత్యాకాండ అవుతుంది


మంగలేశ్‌ దబ్రాల్‌ (1948-2020)





ఆశ్రయం


జీవితమంతా తలదాచుకునే చోటు కోసం వెతికాను

చివరికి నా అరచేతుల కంటె

మంచిచోటు మరొకటి లభించలేదు


సర్వేశ్వర్‌ దయాళ్‌ సక్సేనా (1927-1983)




అనువాదం: గాలి నాసరరెడ్డి

Updated Date - 2021-06-07T05:40:25+05:30 IST