ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవం

ABN , First Publish Date - 2021-11-26T08:56:57+05:30 IST

వరంగల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో శాసనమండలి స్థానిక సంస్థల నియోజకవర్గాల ఎన్నికలు గురువారం ఏకగ్రీవమయ్యాయి.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవం

వరంగల్‌లో పోచంపల్లి, మహబూబ్‌నగర్‌లో  కూచకుళ్ల, కసిరెడ్డి

వరంగల్‌/మహబూబ్‌నగర్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో శాసనమండలి స్థానిక సంస్థల నియోజకవర్గాల ఎన్నికలు గురువారం ఏకగ్రీవమయ్యాయి. మూడు స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే ఎన్నికయ్యారు. వరంగల్‌ నుంచి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మహబూబ్‌నగర్‌ ద్విసభ్య నియోజకవర్గం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచకుళ్ల దామోదర్‌రెడ్డి ఎన్నికయ్యారు. మహబూబ్‌నగర్‌లో స్వతంత్ర అభ్యర్థి శ్రీశైలం తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. అయితే అధికారికంగా శుక్రవారం సాయంత్రం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ధ్రువపత్రాలు అందజేస్తారు. 8 మంది స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లలో ఆరుగురి నామినేషన్లను వేర్వేరు కారణాలతో అధికారులు తిరస్కరించారు. మిగిలిన ఇద్దరిలో ఒకరు బుధవారం, మరొకరు గురువారం ఉపసంహరించుకున్నారు. కాగా, వరంగల్‌లో 14 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఓటర్ల అంగీకారం లేకుండా స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్‌ పత్రాల్లో వారి పేర్లను చేర్చడంతో వారు రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశారు. పరిశీలనలో 9 మంది నామినేషన్లు తిరస్కరించారు. అనంతరం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాసరెడ్డితో పాటుగా ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎన్నికల అధికారి గురువారం ఉదయం ప్రకటించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వేగంగా పావులు కదిపి నామినేషన్లు వేసిన అభ్యర్థులతోపాటు వారిని బలపరిచిన వారితో కూడా మాట్లాడి దారిలోకి తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. వారికి భారీగానే ముట్టజెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. 

Updated Date - 2021-11-26T08:56:57+05:30 IST