తరంతో స్వరం మారుతోంది..

ABN , First Publish Date - 2020-09-13T05:30:00+05:30 IST

సినీ సంగీతం ప్రవాహంలాంటిది. ఎప్పటికప్పుడు కొత్త నీరు వస్తూనే ఉంటుంది. కాలంతో మారే పరిణామాలకు తగ్గట్టుగా సంగీతాన్నే అందించే యువ సంగీత దర్శకులు తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది ఉన్నారు. లాక్‌డౌన్‌.. సినీ పరిశ్రమపై దాని ప్రభావం..

తరంతో స్వరం మారుతోంది..

సినీ సంగీతం ప్రవాహంలాంటిది. ఎప్పటికప్పుడు కొత్త నీరు వస్తూనే ఉంటుంది. కాలంతో మారే పరిణామాలకు తగ్గట్టుగా సంగీతాన్నే అందించే యువ సంగీత దర్శకులు తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది ఉన్నారు. లాక్‌డౌన్‌.. సినీ పరిశ్రమపై దాని ప్రభావం.. కొత్త తరానికి నచ్చే బాణీలు.. ఇలాంటి అనేక విషయాలలో వారి అభిప్రాయాలను తెలుసుకోవటానికి ‘నవ్య’ ఇద్దరు యువ సంగీత దర్శకులను పలకరించింది. 


నా సంగీతం ఫెయిల్‌ కాలేదు!

ప్రముఖ ఛాయగ్రహకుడు హరి అనుమోలు తనయుడు శేఖర్‌ చంద్ర. ‘మనం చేసే పని మాట్లాడాలి కానీ బ్యాక్‌గ్రౌండ్‌ ఏముంది’ అనే శేఖర్‌ ఏమంటున్నారంటే..


‘లాక్‌డౌన్‌కి ముందు మూడు సినిమాలు చేస్తానని ఒప్పుకున్నా. పని ప్రారంభించిన 20 రోజులు కాకముందే లాక్‌డౌన్‌ విధించారు. ఒక విధంగా ఇది కూడా నా మంచికే వచ్చింది. కొత్త విషయాలు తెలుసుకోవడానికి.. కొత్త తరహా బాణీలు కట్టడానికి..  నన్ను నేను మెరుగుపరచుకోవటానికి లాక్‌డౌన్‌ సమయం ఎంతో ఉపయోగపడింది. చిన్నప్పటి నుంచి నేను కీబోర్డ్‌ ప్లేయర్‌ని. వాటిలో వచ్చే రకరకాల మార్పులను గమనించటానికి ఈ సమయం ఉపయోగపడింది. కళారంగంలో ఒత్తిడి లేకపోతే మంచి ఫలితాలు వస్తాయి. నా విషయంలో ఇదే నిజమైంది. 


పారితోషికం గుర్తురాదు...

అందరికీ పెద్ద సినిమాలు చేయాలనే ఉంది. కానీ మనం చేసే పనిలో ఎంత సంతృప్తి పొందుతున్నామన్నదే ముఖ్యమని నేను నమ్ముతా. వాస్తవానికి కెరీర్‌ మొదటి నుంచి నేను సెలక్టివ్‌గానే ఉన్నా. మంచి కథ, మంచి దర్శకుడు ఉన్నప్పుడు పారితోషికం గుర్తురాదు. నేను సంగీత దర్శకత్వం వహించిన సినిమాలు ఫెయిల్‌ కావచ్చు. కానీ నా సంగీతం ఎక్కడా ఫెయిల్‌ కాలేదు. 


12 ఏళ్ల కెరీర్‌..

నా 12 ఏళ్ల కెరీర్‌లో 35 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించా. ఈ 12 ఏళ్లలో ఎన్నో మార్పులొచ్చాయి. ఇప్పుడు రకరకాల కథలు వస్తున్నాయి. వాటికి తగ్గట్టుగా సంగీతాన్ని అందించాల్సి ఉంది. అప్పుడైనా.. ఇప్పుడైనా మంచి సంగీతం వినిపిస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. రకరకాల పాటలు సృష్టించినా.. మెలోడీ నా ప్రత్యేకత.. అదే నాకిష్టం. అంతే కాకుండా ప్రేక్షకులు కొత్త ధోరణిని కూడా ఆదరిస్తున్నారు. నా తాజా సినిమా సమ్మతంలో ఈ మార్పును 

గమనిస్తారు.


రెండు వేర్వేరు

థియేటర్‌లో సినిమా చూడటానికి.. ఓటీటీ ద్వారా ఇంట్లో కూర్చుని సినిమా చూడటానికి మధ్య  చాలా తేడా ఉంది. సంగీతంలో కూడా ఈ తేడా కనిపించాలి. థియేటర్‌లో విడుదలయ్యే  ఒక సినిమాకు పాట చేయాలంటే-  రిథమ్స్‌, షాట్స్‌ చాలా ఫిల్‌ చేయాల్సి ఉంటుంది. ఓటీటీ కోసం ప్రత్యేకంగా తీసే సినిమాలకు, సిరీస్‌లకు కొత్త తరహా సంగీతం అందించాలి.


హిట్‌ సినిమాలు

నచ్చావులే, అనసూయ, అవును, సినిమా చూపిస్త మావ, కార్తీకేయ, సుబ్రమణ్యపురం, సవారీ


ఎవరికైనా టైమ్‌ రావాలి

ఈ మధ్య కాలంలో సినీ సంగీత ప్రపంచంలో మెరుస్తున్న సంగీత దర్శకుల్లో సాయికార్తీక్‌ ఒకరు. ‘‘చేతి నిండా పని ఉంటే చాలు.. అదే చాలు..’’ అనే కార్తీక్‌ సినీ రంగంలో వస్తున్న మార్పుల గురించి ఏమంటున్నారంటే..


‘‘12 ఏళ్ల క్రితం నేను కెరీర్‌ ప్రారంభించినప్పటికీ.. ఇప్పటికీ మధ్య చాలా తేడా వచ్చింది. కొత్త కొత్త కథలు.. కొత్త జానర్‌లు వస్తున్నాయి. కోవిడ్‌ అందరికీ కొంత విశ్రాంతి ఇచ్చింది. అప్‌డేట్‌ అవటానికి అవకాశమూ ఇచ్చింది. దీని వల్ల నాకు కొత్త ప్రయోగాలు చేయటానికి అవకాశం చిక్కింది. కాలంతో పాటుగా సంగీత ధోరణులు మారుతూ వస్తాయి. ప్రస్తుతం- రెట్రోను ఎక్కువ మంది వింటున్నారు. సంగీత దర్శకులు కూడా హిపాప్‌, పంజాబీ ఫోక్‌ వంటి సంగీతాన్ని అడుగుతున్నారు. నేను సహజసిద్ధంగా డ్రమ్మర్‌ని. అందువల్ల ఎక్కువగా లైవ్‌ రికార్డింగ్‌కే ఇష్టపడతా. రిథమ్స్‌ ప్రోగ్రామింగ్‌ నా బలమని అందరూ అంటుంటారు. 60 సినిమాలకు సంగీతం అందించినా- నేనెప్పుడు స్టార్‌డమ్‌ కోసం పాకులాడలేదు.  చేతి నిండా పని ఉందా? లేదా? మనం ఇంకో నలుగురికి పని ఇచ్చామా..’ అనే విషయాలే చూశా. సినీ సంగీత ప్రపంచంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ ఏ.ఆర్‌.రెహమాన్‌ కాలేరని నేను నమ్ముతా. ప్రతి వ్యక్తికి ఒక సమయం వస్తుంది. దాని కోసం వేచి చూడాలంతే! ఉదాహరణకు ‘లవర్‌’ సినిమాకు నలుగురు సంగీత దర్శకులు పనిచేశారు. అందులో ‘నాలో చిలిపి కల’ పాటను నేను కంపోజ్‌ చేశా. ఆ పాట చాలా హిట్‌ అయింది. అలా అప్పుడప్పుడు సమయం కలిసొస్తుంది.


కొత్త తరం...

ఓటీటీ కోసం కొత్తవారు న్యూఏజ్‌ కథలతో వస్తున్నారు. ఆ చిత్రాలకు రెగ్యులర్‌ ఫార్మెట్‌లో కమర్షియల్‌ సౌండ్స్‌ ఇవ్వలేం. ఆ కథలకు తగ్గట్టే వారు రెట్రో, హిపాప్‌ ఇలా రకరకాల జానర్లు అడుగుతున్నారు. తెలుగు ఫార్మెట్‌ కాకుండా కొత్త తరహా సంగీతం అడుగుతున్నారు. అలాంటి వాటికి భిన్నమైన సంగీతాన్ని అందించాలి. కొత్త తరహా సంగీతాన్ని ఆకళింపుచేసుకోవాలి. అప్పుడే నిజమైన సంగీతం బయటకు వస్తుంది.


హిట్‌ సినిమాలు

రాజా ది గ్రేట్‌, సుప్రీమ్‌, పటాస్‌, పైసా, రౌడి, రాజుగారి గది

Updated Date - 2020-09-13T05:30:00+05:30 IST