ఆంజనేయుని యుక్తి

ABN , First Publish Date - 2020-10-16T07:04:19+05:30 IST

ఆంజనేయ స్వామి ఎంతటి శాస్త్ర పాండిత్యం, దేహబలం, ధైర్య సాహసాలు కలవాడో అంతటి బుద్ధిశాలి. అందుకే..

ఆంజనేయుని యుక్తి

ఆంజనేయ స్వామి ఎంతటి శాస్త్ర పాండిత్యం, దేహబలం, ధైర్య సాహసాలు కలవాడో అంతటి బుద్ధిశాలి. అందుకే.. సన్యాసి రూపాన్ని ధరించి తన వాక్చాతుర్యంతో శ్రీరామలక్ష్మణలను ఆకర్షించి శ్రీరామ-సుగ్రీవుల మధ్య మిత్ర బంధాన్ని ఏర్పరిచగలిగాడు. ఆంజనేయుని శక్తిసామర్థ్యాలపై అపారమైన నమ్మకం ఉన్నందునే.. సీతాన్వేషణ కోసం దక్షిణ దిక్కుగా వెళ్తున్న ఆ కపిశ్రేష్ఠుడికి రాముడు తన ఉంగరాన్ని ఇచ్చాడు.


సీతమ్మ జాడ తెలిస్తే తన గుర్తుగా అందివ్వమన్నాడు. లంకకు వెళ్లేందుకు సముద్రాన్ని దాటుతున్న హనుమకు సురస అనే రాక్షసి అడ్డుపడి.. ‘నా నోట్లో ప్రవేశించకుండా నువ్వు ముందుకు వెళ్లలేవు. ఇది నాకు దేవతలు ఇచ్చిన వరం’ అంటే.. ఆంజనేయుడు యుక్తిగా సూక్ష్మరూపంలోకి మారి సురస నోట్లోకి ప్రవేశించి క్షేమంగా బయటకు వచ్చాడు. అతిథి సత్కారాలు చేస్తా ఆగమంటూ మైనాకుడు ఆపితే.. బుజ్జగింపు మాటలతో మైనాకుణ్ని మెప్పించి, ఒప్పించి ముందుకు సాగాడు. సింహిక అనే రాక్షసి తనను మింగబోతే.. యుక్తితో తన ఆకారాన్ని చిన్నగా చేసి సింహిక నోట్లోకి ప్రవేశించి, ఆపై తన ఆకారాన్ని పెంచి వాడియైున గోళ్లతో సింహికను వధించాడు.


రాక్షసుల శక్తియుక్తులను తెలుసుకోవడానికి.. వారికి ఇష్టమైన రాత్రి సమయంలోనే పిల్లి అంత ఆకారాన్ని ధరించి లంకలో సంచరించాడు. సీతమ్మ కనిపించలేదని దిగులు చెంది, ప్రాణాలను వదలాలని భావించినా అంతలోనే తమాయించుకున్నాడు.

‘‘చనిపోవడంవల్ల ఎన్నెన్నో దోషాలు సంభవిస్తాయి. బతికి ఉంటే ఎప్పటికైనా సుఖాలను పొందవచ్చు అని తలంచి, బుద్ధి బలాన్ని ఉపయోగించి ఉత్సాహాన్ని కూడగట్టుకుని చివరి ప్రయత్నంగా అశోకవనంలో వెతికి సీతాదేవిని దర్శించాడు. రాక్షస స్త్రీలు పెట్టే బాధలను భరించలేక సీతమ్మ ప్రాణత్యాగానికి సిద్ధపడినప్పుడు.. ఎదురుగా వెళ్లకుండానే యుక్తితో రామకథామృతాన్ని వినిపించి ఆ తల్లి ప్రాణాలను కాపాడిన ఘనత ఆంజనేయునిదే.




చేయవలసిన పనితో పాటు మరికొన్ని పనులను కూడా నిర్వర్తించే ఉత్తమ కార్యసాధకుల కోవకు చెందిన ఆంజనేయుడు సీతాన్వేషణతోపాటు, తన బలాన్ని రావణునికి రుచి చూపించడం, రాక్షసుల బలాన్ని తాను తెలుసుకోవడం అనే రెండు పనులుచేశాడు. ఇందుకు దండోపాయాన్ని ఎంపిక చేసుకున్నాడు.


అందుకే..  ‘‘ఎవరి బుద్ధిబలం, పౌరుషం, పరాక్రమాల వలన నీ మనసు అమితానందమును పొందినదో వారికి ముత్యాలహారాన్ని బహుమానంగా ఇవ్వు’’ అని పట్టాభిషేక సమయంలో శ్రీరాముడు సూచించగా.. సీతమ్మ ఆ హారాన్ని ఆంజనేయుడికి బహూకరించింది. సీతారాముల ఆదరాభిమానాలతోపాటు దేవదానవుల, నరుల, వానరుల ప్రశంసలకు పాత్రుడైన ఆంజనేయుని యుక్తిని (బుద్ధిబలాన్ని) మనం ఆదర్శంగా గ్రహిద్దాం. సత్కార్యాలను సమర్థవంతంగా నిర్వహించగల సామర్ధ్యాన్ని అలవరుచుకునే దిశగా కృషిని కొనసాగిద్దాం.

- సముద్రాల శఠగోపాచార్యులు, 9059997267


Updated Date - 2020-10-16T07:04:19+05:30 IST