కాంగ్రెస్ బలహీనపడుతోంది అంటూ మళ్లీ గళం విప్పిన సీనియర్లు

ABN , First Publish Date - 2021-02-27T21:03:21+05:30 IST

కాంగ్రెస్ పార్టీపై సీనియర్ నేత కపిల్ సిబాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రానూ రానూ కాంగ్రెస్ బలహీనపడుతోందని, పార్టీని పటిష్ఠం చేయాలని

కాంగ్రెస్ బలహీనపడుతోంది అంటూ మళ్లీ గళం విప్పిన సీనియర్లు

శ్రీనగర్ : కాంగ్రెస్ పార్టీపై సీనియర్ నేత కపిల్ సిబాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రానూ రానూ కాంగ్రెస్ బలహీనపడుతోందని, పార్టీని పటిష్ఠం చేయాలని అవసరం ఎంతో ఉందని పేర్కొన్నారు. పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ కశ్మీర్‌లో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి జీ -23 నేలందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా కపిల్ సిబాల్ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోందన్న సత్యాన్ని గ్రహించాలని, అందుకే తాము ఇక్కడ కలిసినట్లు తెలిపారు. గతంలోనూ ఇలాగే కలిశామని, అందరం కలిసి పార్టీని పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. జమ్మూ కశ్మీర్‌లోని ప్రతి జిల్లాలో క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటని తెలిసిన ఏకైక వ్యక్తి ఆజాద్ అని, ఎంపీగా పదవీ విరమణ పొందుతున్నారని తెలుసుకొని ఎంతో బాధపడ్డామని కపిల్ తెలిపారు. ఇంత అనుభవం ఉన్న నేత సేవలను పార్టీ ఎందుకు ఉపయోగించుకోవట్లేదో తమకు ఏమాత్ర అర్థం కావడం లేదన్నారు. విమానంలో ప్రయాణిస్తున్న సందర్భంలో పైలట్‌తో పాటు ఇంజినీర్ కూడా అవసరమని, ఆజాద్ పార్టీలో ఓ ఇంజినీర్ పాత్రను పోషిస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రంలో ఏ మూలన ఏం జరుగుతుందో ఆయనకు బాగా తెలుసని, ఆయన ఓ ఇంజినీర్ అని సిబాల్ పేర్కొన్నారు. 


కాంగ్రెస్ అందర్నీ గౌరవిస్తుంది : ఆజాద్

కాంగ్రెస్ అందర్నీ గౌరవిస్తుందని మాజీ ఎంపీ, కాంగ్రెస్ అగ్రనేత గులాంనబీ ఆజాద్ స్పష్టం చేశారు. జమ్మూ వారైనా, కశ్మీర్ వారైనా, లడఖ్ వారైనా... తాము అందర్నీ గౌరవిస్తామని, అన్ని జాతుల వారినీ గౌరవిస్తామని తెలిపారు. అందర్నీ గౌరవించడమే తమ బలమని, దానిని అలాగే కొనసాగిస్తామని ఆజాద్ హామీ ఇచ్చారు. 


రాజ్ బబ్బర్ : 

‘‘మేమంతా జి-23 నేతలని ప్రజలంటున్నారు. నా మట్టుకైతే మేమంతా గాంధీ 23 అని అనుకుంటాం. గాంధీ ఆలోచనలతోనే చట్టం, రాజ్యాంగం రూపొందించబడింది. తామంతా కాంగ్రెస్‌ను ముందుకు తీసుకెళ్లడానికే ఉన్నాం. ఈ మధ్యనే ఎంపీగా ఆజాద్ పదవీ విరమణ పొందారు. సాక్షాత్తూ ప్రధాని మోదీ కూడా కన్నీరు కార్చారు.’’


ఆనంద్ శర్మ :

‘‘చాలా కష్టపడి మేం ఈ స్థాయికి వచ్చాం. దొడ్డిదారిన రాలేదు. బాజాప్తాగా వచ్చాం. అందరమూ విద్యార్థి రాజకీయాలను చేశాం. అందులోంచే ఇంత ఎదిగాం. మేం కాంగ్రెస్ మనుషులమే. కాంగ్రెస్ మనుషులం కాదనే హక్కు ఎవరికీ లేదు. మేం పార్టీని నిర్మించాం. మేమే పటిష్ఠం చేశాం. మేం ఐక్యతనే నమ్ముతాం.కొన్ని రోజులుగా కాంగ్రెస్ బలహీనపడుతోంది. పార్టీని పటిష్ఠం చేయడానికే మేం మాట్లాడుతున్నాం. దేశమంతా మరోసారి పటిష్ఠం కావాలి. నూతన తరాన్ని కాంగ్రెస్‌తో అనుసంధానించాలి. కాంగ్రెస్‌కు వచ్చే మంచి రోజులను మేం కళ్లారా చూడాలి.’’ అని ఆనంద్ శర్మ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-02-27T21:03:21+05:30 IST