జలపాతంలో విషాదం

ABN , First Publish Date - 2021-08-02T05:46:16+05:30 IST

జలపాతంలో విషాదం

జలపాతంలో విషాదం
గల్లంతైన ప్రదేశం

దుసపాటిలొద్దిలో వేర్వేరు సమయాల్లో ఇద్దరి గల్లంతు

 ఇంకా లభ్యం కాని ఆచూకీ

వాజేడు, ఆగస్టు 1: ములుగు జిల్లా వాజేడు మండలంలో పెను విషాదం చోటుచేసుకుంది. దుసపాటిలొద్ది జలపాతంలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఈ రెండు సంఘటనలు వేర్వేరుగా ఆదివారం చోటుచేసుకున్నాయి. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి థౌసండ్‌ క్వార్టర్స్‌ కాలనీకి చెందిన మునిగెల నరేష్‌(24), సంపత్‌, అశోక్‌, శ్రీకాంత్‌, అఖిల్‌ స్నేహితుల దినోత్సవాన్ని సరదాగా గడిపేందుకు ములుగు జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. ఇదే క్రమంలో వాజేడు మండలం కొంగాల అటవీ ప్రాంతంలోని దుసపాటిలొద్ది జలపాతం వద్దకు సాయంత్రం 5 గంటలకు వచ్చారు. జలపాతం ముందు భాగంలో నరేష్‌, శ్రీకాంత్‌ స్నానాలు చేస్తుండగా ఇద్దరూ నీటిలో జారిపడ్డారు. శ్రీకాంత్‌ను తోటి యువకులు బయటకు లాగగా నరేష్‌ గల్లంతయ్యాడు. 

అదే విధంగా సంగారెడ్డి జిల్ల కొండాపూర్‌కు చెందన వడ్ల రవికుమార్‌ (30) తన స్నేహితులతో కలిసి దుసపాటిలొద్ది జలపాతం వద్దకు సాయంత్రం 4 గంటల సమయంలో వచ్చాడు. జలపాతం పక్క నుంచి నీటిలో దిగగా ఒక్కసారి జారి పడి గల్లంతయ్యాడు. స్థానిక యువకులు గాలించినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. లోతు ఎక్కువ కావడంవల్ల ఇద్దరినీ వెతకడం కష్టతరంగా మారింది. విషయం తెలుసుకున్న వాజేడు ఎస్సై కొప్పుల తిరుపతిరావు జాలర్లను పంపినప్పటికీ  చీకటి కావడంతో గాలింపు చర్యలను నిలిపివేశారు. నరేష్‌ సింగరేణి ఉద్యోగి అని తెలిసింది. తండ్రి రాజయ్య మృతి చెందడంతో ఆయన స్థానంలో నరే్‌షకు ఉద్యోగం వచ్చిందని మిత్రులు తెలిపారు. రాజయ్య, సమ్మక్క దంపతులకు నరేష్‌ ఒక్కడే కొడుకని చెప్పారు. రవికుమార్‌ కొండాపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ఆపరేటర్‌గా పనిచేస్తునాడని మిత్రులు చెప్పారు.





Updated Date - 2021-08-02T05:46:16+05:30 IST