Abn logo
Mar 3 2020 @ 00:57AM

అశాంతి ఒప్పందం

తాలిబాన్‌తో శనివారం అమెరికా చేసుకున్న ‘శాంతి ఒప్పందం’ అఫ్ఘానిస్థాన్‌లో తిరిగి అశాంతికి బాటలు వేయబోతున్నది. మన దేశం ఈ ఒప్పందాన్ని ఘనంగా స్వాగతించలేని, గట్టిగా కాదనలేని స్థితిలో ఉన్నదనడానికి విదేశాంగమంత్రి జైశంకర్‌ వ్యాఖ్యలే రుజువు. అఫ్ఘానిస్థాన్‌ను ఒక దారికితేవడానికి రెండు దశాబ్దాలుగా పడిన కష్టం ఈ ఒప్పందం వల్ల వృధాకాకపోతే అంతే చాలునని అన్నారాయన. శాంతి ఒప్పందం అనంతరం అక్కడ  చోటుచేసుకోబోయే పరిణామాలను నిశితంగా గమనించడం మాత్రమే ప్రస్తుతానికి భారత్‌ ఉద్దేశమని ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతున్నది. ఇక, ఒప్పందంలో ప్రధానాంశంగా వేలాదిమంది తాలిబాన్‌ యుద్ధఖైదీల విడుదల ఉన్నప్పటికీ, ఆ ఒప్పందం కుదిరిన మర్నాడే అఫ్ఘాన్‌ అధ్యక్షుడు అష్రాఫ్‌ఘనీ ఇందుకు భిన్నంగా వ్యాఖ్యానించడం ఊహించని మలుపు. దేశంలో అధికార పంపకాలకు సంబంధించిన అంతర్గత చర్చలు ఆరంభం కాబోతున్న తరుణంలో ఘనీ ప్రకటన ఆదిలోనే హంసపాదుగా పరిణమించింది.


నార్వే రాజధాని ఓస్లోలో మార్చి 10నుంచి అఫ్ఘానిస్థాన్‌లోని వివిధ పక్షాల మధ్య చర్చలు ఆరంభం కాబోతున్నాయి. దీనికి ముందే ఐదువేలమంది తాలిబాన్లను జైళ్ళనుంచి విడుదల చేస్తామని అమెరికా ఒప్పందంలో చెప్పింది. ఈ హామీ ఇస్తేగిస్తే అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం ఇవ్వాలే తప్ప అమెరికా కాదని ఘనీ వాదన. బందీల విడుదల, చర్చల్లో అదీ ఒక అంశంగా ఉండటాన్ని ఆయన వ్యతిరేకించడం లేదు కానీ, అంతర్గత చర్చల ఆరంభానికి ముందే దానిని ఓ నిబంధనగా అమలు చేయడాన్ని ఆయన కాదంటున్నారు. బందీలను ముందుగా ఇచ్చిపుచ్చుకుంటేనే చర్చలకు సానుకూల వాతావరణం ఏర్పడుతుందని ఖతార్‌ హితవు చెబుతున్నది. ఈ ఒప్పందంలో ఘనీ పాత్ర ఏ మాత్రం లేదని మనకూ తెలిసిందే. అమెరికా కూడా సైన్యాన్ని ఉపసంహరించుకోవాలన్న తన లక్ష్యం ఉగ్రవాదంపై తాలిబాన్‌ వ్యవహారశైలిపై ఆధారపడి ఉంటుందే తప్ప, అఫ్ఘాన్‌లోని వివిధ పక్షాలు ఇకపై ఏం చేసుకుంటాయన్నదానిపై కాదని అంటున్నది. అంటే, తాలిబాన్‌– అఫ్ఘాన్‌ ప్రభుత్వం మధ్య చర్చలు ముందుకు సాగినా, లేకున్నా, అవి పరస్పరం కొట్టుకుచచ్చినా అమెరికాకు పట్టదని అర్థం. అమెరికా వ్యతిరేక ఉగ్రవాద కార్యకలాపాలకు అఫ్ఘానిస్థాన్‌ను స్థావరం కానివ్వనన్న హామీ మేరకు అల్‌కాయిదావంటి సంస్థలకు తాలిబాన్‌ సహకరించకపోతే అమెరికాకు చాలు. ఆరునూరైనా, నాలుగునెలల్లో సగం, పద్నాలుగు నెలల్లో పూర్తిగా అమెరికన్‌ సైన్యాన్ని ఉపసంహరించుకొని రెండు దశాబ్దాలుగా అక్కడ తెరిచిన ఉగ్రవాదంపై పోరు దుకాణాన్ని ట్రంప్‌ ఎంచక్కా మూసేస్తారని దీని అర్థం.


తాలిబాన్‌ నేతలతో ఫోటోలు దిగాలన్న కోరిక ట్రంప్‌కు గత ఏడాది సెప్టెంబరులో తీరలేదు. క్యాంప్‌డేవిడ్‌లో ఈ పని జరగాల్సి ఉండగా, ట్రంప్‌ దానిని కాదని సిద్ధంగా ఉన్న ఒప్పందాన్ని కూడా తిరగ్గొట్టారు. తాలిబాన్‌పై భీకరయుద్ధం చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు ఒప్పందం కుదిరిన శుభసందర్భంగా, త్వరలోనే తాలిబాన్‌ నేతలను కలుసుకోబోతున్నట్టు ఆయన ప్రకటించారు. పాకిస్థాన్‌ కీలకపాత్ర పోషించిన ఈ ఒప్పందం ఆచరణలోకి రావడంతో తాలిబాన్‌కు నైతికంగా ఎన్నడూ లేనంత విలువ, అధికారం దఖలు పడ్డాయి. పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న హక్కానీ నెట్‌వర్క్‌ తాలిబాన్‌ అంతర్భాగంగా నాయకత్వ స్థానంలో ఉండటం భారత్‌కు ప్రమాదకరమైన అంశం. అఫ్ఘాన్‌ అంతర్గత చర్చల్లో పేరుకు ఎన్ని పక్షాలున్నా, అంతిమ నిర్ణయం ఇక తాలిబాన్‌దే. బలహీనమైన ఘనీ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్నందున అమెరికా తప్పుకున్నాక, దానిని నిలువరించగలిగే శక్తి ఇక ఎవరికీ ఉండదు. పష్తూన్‌ల ఆధిపత్యం ఉన్న తాలిబాన్‌కు ఇతర తెగలతో సయోధ్యలేనందున దశాబ్దాల నాటి అంతర్యుద్ధాలు తిరిగి తలెత్తవచ్చు. అంతర్జాతీయ నియమాలకు కట్టుబడి ఉంటామనీ, అమెరికా, దాని మిత్రులకు హాని తలబెట్టబోమన్న హామీలను నమ్మి అమెరికా ఇప్పుడు దేశాన్ని దాని చేతికిచ్చి పోతున్నది. ఆ మిత్రుల జాబితాలో మనం ఉన్నా లేకున్నా, పాకిస్థాన్‌ దృష్టిలో మన లెక్క మాత్రం వేరు.

Advertisement
Advertisement
Advertisement