అమెరికాలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు?

ABN , First Publish Date - 2020-08-13T03:31:57+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు, మరణాలు అమెరికాలోనే నమోదయ్యాయి.

అమెరికాలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు?

వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు, మరణాలు అమెరికాలోనే నమోదయ్యాయి. అమెరికాలో చాలా కాలం నుంచి నిత్యం 50 వేలకు తగ్గకుండా కేసులు నమోదవుతూ వచ్చాయి. కొద్ది రోజుల పాటు ఈ సంఖ్య 60 నుంచి 70 వేలు కూడా దాటేసింది. ఆగస్టు నెలలో ఈ సంఖ్య లక్షకు చేరే అవకాశాలున్నాయని పలువురు నిపుణులు కూడా హెచ్చరించారు. అయితే అమెరికాలో గత మూడు రోజుల నుంచి కరోనా కేసుల సంఖ్యలో తగ్గుముఖం కనపడుతున్నట్టు తెలుస్తోంది. ఆదివారం, సోమవారం, మంగళవారం.. ఈ మూడు రోజుల్లో 50 వేల కంటే తక్కువగానే కేసులు నమోదయ్యాయి. జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటి లెక్కల ప్రకారం.. ఆదివారం 46,935 కేసులు నమోదవగా.. సోమవారం 49,536 కేసులు, మంగళవారం 46,808 కేసులు బయటపడ్డాయి. అయితే ఇందులో ఆనందించడానికి ఏమీ లేదని.. 40 వేలకు పైగా కేసులు నమోదవడం కూడా విచారకరమేనని నిపుణులు చెబుతున్నారు. మరోపక్క అమెరికాలో నిత్యం కరోనా కారణంగా మరణించే వారి సంఖ్య కూడా తగ్గింది. గత కొంతకాలంగా నిత్యం కనీసం వెయ్యి మంది కరోనా కారణంగా మరణిస్తూ రాగా.. ఆదివారం ఈ సంఖ్య 515, సోమవారం 525గా ఉంది. అయితే మంగళవారం మాత్రం మళ్లీ మరణాల సంఖ్య వెయ్యి దాటేసి 1,074కు చేరింది. కాగా.. జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటి లెక్కల ప్రకారం.. అమెరికాలో ఇప్పటివరకు 5,161,612 కరోనా కేసులు నమోదవగా.. కరోనా కారణంగా 164,976 మంది మృత్యువాతపడ్డారు. 

Updated Date - 2020-08-13T03:31:57+05:30 IST