డిజిటల్‌ ట్యాక్స్‌పై భారత్‌తో అమెరికా అమీతుమీ!

ABN , First Publish Date - 2021-03-28T06:25:50+05:30 IST

భారత్‌తో మరో వాణిజ్య యుద్ధానికి అమెరికా రంగం సిద్ధం చేసుకుంటోంది. అమెరికన్‌ ఈ-కామర్స్‌ కంపెనీలపై డిజిటల్‌ సేవల పన్నుకు సంబంధించి భారత్‌ సహా ఆరు దేశాలపై ప్రతీకార చర్యలను ప్రతిపాదించింది బైడెన్‌ సర్కారు

డిజిటల్‌ ట్యాక్స్‌పై భారత్‌తో అమెరికా అమీతుమీ!

ప్రతీకార చర్యలకు సిద్ధమవుతున్న పెద్దన్న 


వాషింగ్టన్‌/న్యూఢిల్లీ: భారత్‌తో మరో వాణిజ్య యుద్ధానికి అమెరికా రంగం సిద్ధం చేసుకుంటోంది. అమెరికన్‌ ఈ-కామర్స్‌ కంపెనీలపై డిజిటల్‌ సేవల పన్నుకు సంబంధించి భారత్‌ సహా ఆరు దేశాలపై ప్రతీకార చర్యలను ప్రతిపాదించింది బైడెన్‌ సర్కారు. ఈ చర్యలపై ప్రజాభిప్రాయం కోరుతూ ది యునైటెడ్‌ స్టేట్స్‌ ట్రేడ్‌ రిప్రజెంటేటివ్‌ (యూఎ్‌సటీఆర్‌) ప్రకటన కూడా జారీ చేసింది. అమెరికా ప్రతీకార చర్యలను ఎదుర్కోవాల్సి వచ్చే దేశాల జాబితాలో బ్రిటన్‌, ఇటలీ, టర్కీ, స్పెయిన్‌, ఆస్ట్రియా కూడా ఉన్నాయి. కాగా, అమెరికా ప్రతీకార ప్రయత్నాలపై సంబంధిత వర్గాలతో చర్చించాక దేశ వాణిజ్య, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు చేపడతామని భారత ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.


ప్రపంచ డిజిటల్‌ రంగంలో దిగ్గజ కంపెనీలన్నీ అమెరికాకు చెందినవే. డిజిటల్‌ సేవల పన్నుతో ప్రధానంగా తమ దేశ కంపెనీలపైనే భారం పడుతుందన్నది అమెరికా వాదన. తమ సంస్థలపై వివక్ష చూపుతున్నారన్న కారణంతో, అమెరికా వాణిజ్య చట్టంలోని సెక్షన్‌ 301 ప్రకారం ఆరు దేశాలపై 2020 జూన్‌లో యూఎస్‌ సర్కారు దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఏడాది జనవరిలో యూఎ్‌సటీఆర్‌ దర్యాప్తు ముగిసింది. 


భారత ఉత్పత్తులపై 25% వరకు పన్ను?

ప్రతీకార చర్యల్లో భాగంగా అమెరికా ప్రభుత్వం ఎంపిక చేసిన భారత ఉత్పత్తులపై 25 శాతం వరకు దిగుమతి సుంకం విధించే అవకాశం ఉంది. రొయ్య పిల్లలు, ఫర్నీచర్‌, బంగారు, వెండి ఆభరణాలు, బాస్మతి బియ్యం తదితర వస్తువులు ఈ జాబితాలో ఉండవచ్చు. అమెరికన్‌ కంపెనీలు మన ప్రభుత్వానికి ఏటా 5.5 కోట్ల డాలర్ల (సుమారు రూ.400 కోట్లు) మేర డిజిటల్‌ పన్ను చెల్లించాల్సి రావచ్చని అంచనా. డిజిటల్‌ పన్ను వివక్షపూరితం కాదని, ఈ-కామర్స్‌ కంపెనీలన్నింటికీ సమాన అవకాశాలు కల్పించడమే తమ ఉద్దేశమని భారత్‌ ఇదివరకే అమెరికాకు స్పష్టం చేసింది. 

Updated Date - 2021-03-28T06:25:50+05:30 IST