Abn logo
Jan 13 2021 @ 02:23AM

టీకా వచ్చిందోచ్‌

రాష్ట్రానికి చేరుకున్న 3.64 లక్షల డోసులు

వైద్య సిబ్బందికి కొవిషీల్డ్‌ పంపిన కేంద్రం

ఒక్కో వయల్‌ నుంచి పది మందికి టీకా

నేడు ఉమ్మడి జిల్లాలకు వ్యాక్సిన్‌ రవాణా

తొలి రోజు 4170 మందికే టీకా

టీకా వేసే 139 కేంద్రాల జాబితా విడుదల

ఒక్కో కేంద్రంలో మొదటిరోజు 30 మందికే!

ప్రతి కేంద్రానికీ ఒక ప్రత్యేక అధికారి

గ్రేటర్‌లో 31 వ్యాక్సిన్‌ కేంద్రాలను 

వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని

ఏపీకి కొవాగ్జిన్‌ టీకా కూడా!


హైదరాబాద్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసే టీకాలు రాష్ట్రానికి వచ్చేశాయి. తొలి విడతగా తెలంగాణకు కేంద్రం 3.64 లక్షల డోసులను పంపింది. మంగళవారం ఉదయం పుణే నుంచి ప్రత్యేక  కార్గో విమానంలో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోసులను పంపగా.. అవి  మధ్యాహ్నం 12.05 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నాయి. అక్కడి నుంచి పోలీసు భద్రత మధ్య ప్రత్యేక వాహనంలో కోఠిలోని వ్యాఽధి నిరోధక టీకా సముదాయానికి 12.55 గంటలకు చేరుకున్నాయి. ప్రత్యేక వాహనంలో వచ్చిన టీకాలను ప్రజారోగ్య  సంచాలకులు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు, వైద్య విద్య సంచాలకులు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి, టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌ రెడ్డి, ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ సుధీర అందుకున్నారు.


ఆ వాహనం నుంచి మొదటి పెట్టెను ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌  శ్రీనివాసరావు.. సిబ్బందితో కలసి కిందికి దించారు. వ్యాక్సిన్‌ వచ్చిన ఆనందం.. అధికారులతో పాటు అక్కడున్న సిబ్బంది అందరిలోనూ కనిపించింది. దీంతో వారంతా వ్యాక్సిన్‌ బాక్సులతో సెల్ఫీలు తీసుకున్నారు. టీకా డోసులను ఫ్రీజర్లలో నిల్వ చేసే ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీకా స్టోరేజ్‌ సెంటర్‌ వద్ద పోలీసు భద్రత పెంచారు. 


31 బాక్సులు.. 3.64 లక్షల డోసులు

వైద్య ఆరోగ్యశాఖ అధికారులకున్న సంకేతాల మేరకు కేంద్రం ముందుగా కొవిషీల్డ్‌ టీకానే పంపింది. మొత్తం డ్రై ఐస్‌తో  ప్రత్యేకంగా తయారు చేసిన బాక్స్‌లలో వయల్స్‌ను పంపింది. తొలి విడతగా 31 బాక్సుల్లో 3.64 లక్షల డోసులను పంపింది. ఒక్కో బాక్సులో 1200 వయల్స్‌, ఒక్కో వయల్‌లో 5 మిల్లీలీటర్ల మోతాదు టీకా ఉన్నట్లు బాక్సులపై ముద్రించి ఉంది. లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా డోసుల సంఖ్యను కేంద్రమే నిర్ణయించి పంపింది. వచ్చిన దాంట్లో పదిశాతం వేస్టేజ్‌ కింద పంపినట్లు అధికారులు తెలిపారు. కాగా మనకు పంపిన టీకాలు  గతేడాది నవంబరు 1న తయారవగా, ఎక్స్‌ఫైరీ తేదీ ఈ ఏడాది ఏప్రిల్‌  29 వరకు ఉంది. అంటే కరోనా వ్యాక్సిన్‌  ఎక్స్‌పైరీ గడువు ఆరు నెలలుగా భావించవచ్చు.


వచ్చింది ఒక్క డోసే..

వాస్తవంగా తెలంగాణ రాష్ట్రానికి రెండు విడతలకూ కలిపి ఒకేసారి 6.50 లక్షల కొవిషీల్డ్‌ డోసులు వస్తాయని అఽధికారులు భావించారు. కానీ మంగళవారం 3.64 లక్షల డొసులే చేరుకున్నాయి. మిగతాడోసులు త్వరలోనే వచ్చే అవకాశం ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం కోఠిలోని వ్యాధినిరోధక టీకా సముదాయంలో ఉన్న వ్యాక్సిన్లను  బుధవారం ఉమ్మడి జిల్లా కేంద్రాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని కోల్డ్‌ చైయిన్‌ పాయింట్స్‌కు చేరుకుంటాయి.


పదిమందికి..

టీకా వయల్స్‌లో 5మిల్లీలీటర్ల చొప్పున వ్యాక్సిన్‌ ఉంటుంది. ప్రతి లబ్ధిదారునికీ 0.5 ఎంఎల్‌ డోసు ఇస్తారు. అంటే ఒక్కో డోసు నుంచి పది మందికి టీకా ఇవ్వొచ్చు. వయల్‌ను ఓపెన్‌ చేశాక వెంటనే ఆరు గంటల్లోపే పది మందికి ఇవ్వాలని.. ఆలస్యమైతే టీకా పనిచేయదని అధికారులు చెబుతున్నారు. అది కూడా 2 నుంచి 25 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసినప్పుడు మాత్రమే పనిచేస్తుందని స్పష్టం చేస్తున్నారు. టీకా ఇచ్చిన అనంతరం 30 నిమిషాలపాటు వారు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. 


41 మినీహబ్‌లలో హైదరాబాద్‌ ఒకటి!

కొవిడ్‌-19 వ్యాక్సిన్ల కోసం భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 41 మినీ హబ్‌లలో హైదరాబాద్‌ ఒకటి. ఇక్కడ రోజుకు 100 మెగా టన్నుల టీకాల కార్గో నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయలున్నాయి. కాగా, తొలివిడతలో భాగంగా ఏపీకి కేంద్రం 4,96,680 డోసుల టీకాను పంపింది. ఇందులో 4,76,680 డోసులు కొవిషీల్డ్‌ టీకా కాగా.. 20 వేల డోసులు కొవాగ్జిన్‌ టీకావి.  


అపోహలొద్దు.. టీకా వేయించుకోండి

కొవిడ్‌ టీకా తీసుకుంటే సురక్షితంగా ఉండొచ్చు. వ్యాక్సిన్‌ తీసుకున్నాక కొద్దిపాటి సమస్యలొచ్చినా.. వాటివల్ల ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. సమర్థత, భద్రత అంశాల్లో కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ మెరుగ్గా ఉందని ఇప్పటికే పలువురు శాస్త్రజ్ఞులు తెలిపారు. కాబట్టి వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు, ఆందోళనలు పెట్టుకోవద్దు. ఎంపికైన లబ్ధిదారులంతా వ్యాక్సిన్‌ వేయించుకోండి. ముఖ్యంగా తొలివిడత టీకా కార్యక్రమానికి వైద్యులు, ఆరోగ్యసంరక్షణ సిబ్బంది సహకరించాలి.

- డాక్టర్‌ గడల శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకుడు

జీహెచ్‌ఎంసీలో 31  కేంద్రాలు

హైదరాబాద్‌ సిటీ, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 16న.. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 31 వ్యాక్సిన్‌ కేంద్రాలను ప్రధాని నరేంద్రమోదీ వర్చవల్‌గా ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌ జిల్లాలో అమన్‌నగర్‌ యుపీహెచ్‌సీ, జూబ్లీహిల్స్‌ అపోలో, చెస్ట్‌ ఆస్పత్రి, డాక్టర్‌ పాల్‌దాస్‌ యుపీహెచ్‌సీ, ఫెర్నాండెజ్‌ ఫౌండేషన్‌, కిమ్స్‌, కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రి, నాంపల్లి ఏరియా ఆస్పత్రి, రెయిన్‌బో చిల్డ్రన్‌ ఆస్పత్రి, తిలక్‌నగర్‌ యుపీహెచ్‌సీ, సోమాజీగూడ యశోద ఆస్పత్రి, మేడ్చల్‌ జిల్లాలోని ఆదిత్య, అంకుర, మల్లారెడ్డి, మ్యాట్రిక్స్‌, మెడిసిటీ, ఓమిని, రెమెడీ, శ్రీ శ్రీ హోలిస్టిక్‌ ఆస్పత్రులను, కుషాయిగూడ పీహెచ్‌సీ, మల్లాపూర్‌ యుపీహెచ్‌సీ, ఉప్పల్‌ పీహెచ్‌సీ వ్యాక్సిన్‌ కేంద్రాన్ని, రంగారెడ్డి జిల్లాలో ఎఐజీ, కేర్‌, కాంటినెంటల్‌, మెడికోవర్‌, కొండాపూర్‌ ఏరియా ఆస్పత్రి, మెయినాబాద్‌ పీహెచ్‌సీ, పీఆర్‌కె ఆస్పత్రి, వనస్థలిపురం ఏరియా ఆస్పత్రి వ్యాక్సిన్‌ కేంద్రాలను ప్రధాని ప్రారంభించనున్నారు.

Advertisement
Advertisement
Advertisement