టీకా దొరుకుతోంది

ABN , First Publish Date - 2021-06-03T07:16:01+05:30 IST

రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో భాగంగా 18 సంవత్సరాలు పైబడిన వారికి కొన్ని రోజులుగా టీకాలు అందుతున్నాయి. మొదట వ్యాక్సిన్ల కొరత కారణంగా 18-45 మధ్య వయసువారికి డోసులు అందలేదు

టీకా దొరుకుతోంది

18 ఏళ్లు పైబడిన వారికి అందుబాటులో వ్యాక్సిన్‌ 

ప్రైవేటు ఆస్పత్రులకు క్యూ కడుతున్న యువత 

ఇప్పటివరకు వాటిలో 60 వేల మందికి వ్యాక్సిన్‌

ప్రభుత్వ టీకా కేంద్రాల్లోనూ 2,17,141 మందికి..

వీరు సూపర్‌ స్ర్పెడర్‌ కేటగిరీకి చెందిన వారే

విదేశీ విద్యనభ్యసించేవారికి ఐపీఎమ్‌లో టీకా 


హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో భాగంగా 18 సంవత్సరాలు పైబడిన వారికి కొన్ని రోజులుగా టీకాలు అందుతున్నాయి. మొదట వ్యాక్సిన్ల కొరత కారణంగా 18-45 మధ్య వయసువారికి డోసులు అందలేదు. ప్రస్తుతం ప్రణాళికాబద్ధంగా ఆ వయసువారికి వ్యాక్సిన్లు అందిస్తున్నారు. ప్రధానంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆ వయసు వారికి వ్యాక్సినేషన్‌ జోరందుకుంది. జూన్‌ 2 వరకు 60 వేల పైచిలుకు మంది 18-45 మధ్య వయసువారు ప్రైవేటులో టీకా తీసుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవానికి  మే 1 నుంచి 18 పైబడిన వారికి టీకాలిచ్చేందుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కానీ తెలంగాణలో ఈ ప్రక్రియ చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 244 ప్రైవేటు ఆస్పత్రులు టీకాలిచ్చేందుకు అనుమతులు తీసుకున్నాయి. అలాగే 18 పైబడిన వారికి టీకాలు వేసేందుకు దరఖాస్తు చేసుకున్న అన్ని ఆస్పత్రులకు అనుమతులిస్తామని ప్రజారోగ్య సంచాలకుడు గడల శ్రీనివాసరావు ఇప్పటికే ప్రకటించారు.


రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రులకు ఉత్పత్తి కంపెనీలు టీకాలు సరఫరా చేయాలని ప్రభుత్వం కోరింది. టీకా లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రులకు 10 లక్షల డోసులు కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. ప్రైవేటు ఆస్పత్రులు టీకాలో భాగస్వామ్యమైతే ప్రభుత్వంపై కూడా భారం భారీగా తగ్గుతుందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కంపెనీల నుంచి ప్రైవేటు ఆస్పత్రులు నేరుగా వ్యాక్సిన్‌ను కొనుగోలు చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ వ్యాక్సిన్‌ కేంద్రాల్లో 18-45 మధ్య వయసు వారికి వ్యాక్సిన్‌ ఇవ్వడం లేదు. కేవలం సూపర్‌ స్ర్పెడర్లకే టీకాలు వేస్తున్నారు.  ప్రైవేటు ఆస్పత్రుల్లో 18 పైబడిన వారికి టీకాలు వేస్తుండటంతో వ్యాక్సిన్‌ కావాలనుకున్నవారంతా అటు వెళ్తున్నారు. గత ఐదు రోజుల నుంచే ప్రైవేటులో వ్యాక్సినేషన్‌ ఊపందుకుంది. ఇప్పటివరకు ప్రైవేటులో మొత్తం 58,408 మంది 18-45 మధ్య వయసు వారు టీకా తీసుకున్నారు. 4రోజుల్లోనే 55,573 మంది ఉండటం విశేషం. అంటే రోజుకు సగటున 14 వేల మంది ప్రైవేటులో ఆ వయసుల వారు టీకా తీసుకుంటున్నారు. ఇక ప్రభుత్వ టీకా కేంద్రాల్లోనూ ఇప్పటివరకు 2,17,141 మంది ఆ వయసు వారు వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. అయితే వీరంతా సూపర్‌ స్ర్పెడర్‌ కేటగిరీకి చెందిన వారే.  18-45 మధ్య వయసు ఉన్న మిగతా వారికి వ్యాక్సిన్లు ఇవ్వట్లేదు.


విదేశీ విద్యనభ్యసించేవారికి ఐపీఎమ్‌లో టీకా 

విదేశాల్లో విద్యనభ్యసించే విద్యార్థులు రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉన్నారు. వారికి టీకా ఇవ్వాలని మే 30న సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వారికి జూన్‌ 6 నుంచి వ్యాక్సిన్‌ వే సే అవకాశం ఉంది. హైదరాబాద్‌ నారాయణగూడలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌(ఐపీఎమ్‌)లో విద్యార్థులు టీకాలు తీసుకోవచ్చు. అయితే ముందుగా ఆన్‌లైన్‌లో విద్యార్థులు స్లాట్లు బుక్‌ చేసుకోవాల్సి ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. జూన్‌ 4 నుంచి  జ్ఛ్చిజ్టూజి.్ట్ఛజ్చూుఽజ్చుఽ్చ.జౌఠి.జీుఽ సైట్‌లో స్లాట్లు బుక్‌ చేసుకునే సౌకర్యం కల్పించినట్లు వెల్లడించింది. ఇదిలావుంటే విదేశాల్లో వర్సిటీల విద్యాసంవత్సరం ఆగస్టు నుంచి ప్రారంభం అవుతుంది. కొందరు విద్యార్థులు ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకా తీసుకుంటున్నారు. కొవాగ్జిన్‌ తీసుకుందామంటే 9-10 దేశాల్లో తప్ప మిగిలిన దేశాల్లో గుర్తింపులేదు. కొవిషీల్డ్‌ తీసుకుందామంటే రెండో డోసు కోసం 84రోజుల ఆగాల్సి ఉంటుంది. 


ప్రభుత్వ, ప్రైవేటులో 18-45 ఏళ్ల మధ్య వారికి వేసిన టీకాల వివరాలు

తేదీ ప్రైవేటులో కేంద్రాలు  ప్రైవేటులో టీకాలు  ప్రభుత్వకేంద్రాలు  టీకాలు

జూన్‌ 1 25 22,322 787 33,769

మే 31 23 17,466 716 30,480

మే 30 10 7,668 718 41,040

మే 29 22 8,117 1,047 55,247

Updated Date - 2021-06-03T07:16:01+05:30 IST