దసరా రుచుల ధమాకా!

ABN , First Publish Date - 2020-10-24T06:22:15+05:30 IST

పండుగ వేళ ప్రత్యేక వంటకాలు ఉండాల్సిందే. అయితే రొటీన్‌గా కాకుండా ఈసారి వెరైటీగా తీపి, కారం కలగలసిన రెసిపీలను టేస్ట్‌ చేద్దాం...

దసరా రుచుల ధమాకా!

పండుగ వేళ ప్రత్యేక వంటకాలు ఉండాల్సిందే. అయితే రొటీన్‌గా కాకుండా ఈసారి వెరైటీగా తీపి, కారం కలగలసిన రెసిపీలను టేస్ట్‌ చేద్దాం. గుజరాత్‌ ఫఫ్డా, మహారాష్ట్ర కడాకనీ, కేరళ యెరియప్ప... అలాంటివే.  ఇంకెందుకాలస్యం దసరా రోజున ఇంటిల్లిపాది ఈ సరికొత్త రుచులను  ఆస్వాదించండి. 





షోర్‌ భాజా


బెంగాల్‌లో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. వాడవాడలా దుర్గాదేవి ప్రతిమలు కొలువుదీరుతాయి. ఈ పండుగ పర్వదినాన ప్రతి ఇంటా షోర్‌ భాజా స్వీట్‌  తప్పకు రుచి చూస్తారు.


కావలసినవి

పాలు - ఒక లీటరు, పంచదార - పావుకేజీ, నెయ్యి - తగినంత, పిస్తా - కొద్దిగా. 


తయారీ విధానం

  1. స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నీళ్లు పోయాలి. అందులో పంచదార వేసి పాకం వచ్చే వరకు మరిగించాలి.
  2. మరొక పాత్రలో పాలు తీసుకుని మరిగించాలి. పాలు బాగా మరిగి పైన మీగడ వస్తుంది. మీగడ తయారవుతున్న కొద్దీ ఒక స్పూన్‌తో ప్లేట్‌లోకి తీసుకుంటూ ఉండాలి.
  3. అలా సేకరించిన మీగడను వెడల్పాటి ప్లేట్‌లోకి తీసుకుని చతురస్రాకార ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.
  4. స్టవ్‌పై పాన్‌ పెట్టి నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కిన తరువాత కట్‌ చేసి పెట్టుకున్న ముక్కలను వేసి వేగించాలి. 
  5. వేగించుకున్న స్వీట్‌ ముక్కలను పంచదార పానకంలో వేయాలి. 
  6. పావుగంట తరువాత పానకంలో నుంచి తీసి పిస్తాతో గార్నిష్‌ చేసి అందించాలి.



మావా కోకొనట్‌ రోల్‌


కావలసినవి

కోవా - ఒకకేజీ, పంచదార - 300గ్రా, కుంకుమపువ్వు - ఒక గ్రాము, కొబ్బరి పొడి - 100గ్రాములు.


తయారీ విధానం

  1. స్టవ్‌పై పాన్‌ పెట్టి కోవా, పంచదార వేసి వేడి చేయాలి. పంచదార పూర్తిగా కరిగేంత వరకు ఉంచాలి. 
  2. మిశ్రమం చిక్కబడిన తరువాత స్టవ్‌పై నుంచి దింపి చల్లారబెట్టుకోవాలి.
  3. తరువాత రెండు భాగాలుగా కట్‌ చేసుకోవాలి. 
  4. ఒక భాగం తీసుకుని కర్రతో చపాతీలా వెడల్పులా చేసుకోవాలి. 
  5. మరో భాగంలో కుంకుమ పువ్వు కలిపి, చపాతీలా వెడల్పుగా చేసుకోవాలి.
  6. ఇప్పుడు ఒక భాగంపై మరొక భాగం పెట్టి రోల్‌ చేయాలి.
  7. కొబ్బరి పొడి అద్ది, గుండ్రంగా చిన్న చిన్న భాగాలుగా కట్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి.

యెరియప్ప

విజయదశమి రోజున కేరళ ప్రజలు చేసుకునే రెసిపీ ఇది. అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో ఈ వంటకం తయారు చేస్తుంటారు. 


కావలసినవి

బియ్యం - ఒకకప్పు, పెసర్లు - రెండు టీస్పూన్లు, మెంతులు - ఒక టీస్పూన్‌, కొబ్బరి తురుము - అరకప్పు, బెల్లం - అరకప్పు, యాలకులు - మూడు, రవ్వ - రెండు టీస్పూన్లు, నూనె - తగినంత.


తయారీ విధానం

  1. ముందుగా బియ్యం, పెసర్లు, మెంతులను మూడు నాలుగు గంటలపాటు నానబెట్టుకోవాలి.
  2. తరువాత మిక్సీలో వేసి గ్రైండ్‌ చేయాలి. కొబ్బరి తురుము, బెల్లం, యాలకులు వేసి మరోసారి గ్రైండ్‌ చేయాలి. నీళ్లు కొద్దిగా పోయాలి. నీళ్లు ఎక్కువగా పోస్తే మిశ్రమం పలుచగా అవుతుంది.
  3. ఈ మిశ్రమంలో కొద్దిగా రవ్వ కలిపితే యెరియప్పలు క్రిస్పీగా వస్తాయి. మిశ్రమం పలుచగా కాకుండా ఇడ్లీ పిండి మాదిరిగా ఉండేలా చూసుకోవాలి.
  4. ఇప్పుడు స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోయాలి. నూనె వేడెక్కిన తరువాత ఈ మిశ్రమాన్ని గరిటెతో తీసుకుని వేయాలి. 
  5. చిన్నమంటపై రెండు వైపులా గోధుమ రంగులోకి మారే  వరకువేగించాలి. 
  6. బయటకు తీసిన తరువాత వెడల్పాటి మూతతో యెరియప్పలను ఒత్తాలి. ఇలా చేస్తే  వాటికి పట్టిన ఎక్కువ నూనె పోతుంది.

తరగ

కర్ణాటకలో దసరా రోజున ప్రతి ఇంట్లో ఈ వంటకం వండుతారు.


కావలసినవి

మైదా - ఒకకప్పు, సెనగపిండి - రెండు కప్పులు, వాము - ఒక టీస్పూన్‌, కారం - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా.


తయారీ విధానం

  1. ఒక వెడల్పాటి పాత్రలో మైదా తీసుకుని అందులో సెనగపిండి, వాము, కారం, తగినంత ఉప్పు వేసి, కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా మెత్తటి మిశ్రమంలా కలపాలి.
  2. తరువాత కొద్దిగా నూనె రాసి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ పూరీల్లా చేసుకోవాలి.
  4. వీటిని నూనెలో వేగించి తీసుకుంటే కరకరలాడే తరగలు రెడీ.


కడాకనీ


మహారాష్ట్రీయులు దసరా పర్వదినాన కడాకనీ అనే ప్రత్యేకమైన స్వీట్‌ను తయారుచేసి అతిథులకు అందిస్తారు. పచ్చిమిర్చి చట్నీతో తింటే ఈ వంటకం రుచిగా ఉంటుంది. దీని తయారీకి...


కావలసినవి

మైదా - అరకప్పు, పంచదార - మూడు టేబుల్‌స్పూన్లు, నూనె - సరిపడా, రవ్వ - అరకప్పు.


తయారీ విధానం

  1. ఒక పాత్రలో పంచదార తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి పంచదార పూర్తిగా కరిగే వరకు పక్కన పెట్టాలి.
  2. మరొక పాత్రలో మైదా తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి కలపాలి. తరువాత పంచదార నీళ్లు వేసి మెత్తటి మిశ్రమంలా చేసుకోవాలి. ఈ మిశ్రమానికి పైన కొద్దిగా నూనె రాసి గంట పాటు పక్కన పెట్టాలి.
  3. తరువాత పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ పూరీల్లా ఒత్తుకోవాలి. ఫోర్క్‌ సహాయంతో వాటికి చిన్న చిన్న రంధ్రాలు చేయాలి. ఇలా రంధ్రాలు చేయడం వల్ల పూరీల మాదిరిగా పొంగకుండా ఉంటాయి.
  4. ఇప్పుడు స్టవ్‌పై కడాయి పెట్టి నూనె పోయాలి. నూనె వేడెక్కిన తరువాత కడాకనీలు వేసి రెండు వైపులా ముదురు గోధుమరంగులోకి మారే వరకు వేగించాలి.
  5. అంతే... నోరూరించే కడాకనీలు రెడీ.


ఫఫ్డా


గుజరాతీలు దసరా పండగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకొంటారు. అమ్మవారికి ఫఫ్డా అనే ప్రత్యేకమైన వంటకాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. 


కావలసినవి

సెనగపిండి - ఒక కప్పు, వాము - పావు టీస్పూన్‌, నల్లమిరియాలు - 10, పసుపు - పావు టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు, బేకింగ్‌ సోడా - కొద్దిగా, నూనె - సరిపడా, ఉప్పు - రుచికి తగినంత. 


తయారీ విధానం

ఒక పాత్రలో సెనగపిండి తీసుకుని అందులో వాము, దంచిన మిరియాలు, పసుపు, ఇంగువ, బేకింగ్‌ సోడా, తగినంత ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి మిశ్రమంలా కలపాలి. ఒక స్పూన్‌ నూనె వేసి కలిపితే మిశ్రమం మెత్తగా అవుతుంది. తరువాత ఈ మిశ్రమాన్ని అరగంట పాటు పక్కన పెట్టాలి.

  1. ఇప్పుడు మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
  2. ఒక్కో ఉండను తీసుకుంటూ చేత్తో వెడల్పుగా ఒత్తుకోవాలి. కర్రతో వెడల్పుగా చేసుకుని కత్తితో ముక్కలుగా కూడా కట్‌ చేసుకోవచ్చు. 
  3. ఇప్పుడు స్టవ్‌పై కడాయి పెట్టి నూనె వేడి చేయాలి. నూనె కాస్త వేడి అయ్యాక ఫఫ్డాలు వేసి వేగించుకోవాలి. 
  4. ఫఫ్డాలను గోధుమ రంగులోకి మారే వరకు వేగించి, సర్వ్‌ చేసుకోవాలి.



Updated Date - 2020-10-24T06:22:15+05:30 IST