ఐసీఏఆర్‌ ర్యాంకింగ్‌లో వెటర్నరీ వర్సిటీకి 57వ స్థానం

ABN , First Publish Date - 2021-12-04T07:54:48+05:30 IST

భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్‌) 2020కిగాను శుక్రవారం వెల్లడించిన ఆలిండియా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీల ర్యాంకింగ్‌లో తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ వర్సిటీకి 57వ ర్యాంకు వచ్చింది.

ఐసీఏఆర్‌ ర్యాంకింగ్‌లో వెటర్నరీ వర్సిటీకి 57వ స్థానం
వీసీ డాక్టర్‌ పద్మనాభరెడ్డి

గతేడాది కన్నా 7 స్థానాలు ఎగబాకి మెరుగైన ర్యాంకు


తిరుపతి(విద్య), డిసెంబరు 3: భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్‌) 2020కిగాను శుక్రవారం వెల్లడించిన ఆలిండియా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీల ర్యాంకింగ్‌లో తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ వర్సిటీకి 57వ ర్యాంకు వచ్చింది. గతేడాది ర్యాంకింగ్‌లో 64వస్థానంలో నిలవగా.. ప్రస్తుతం 7 స్థానాలుపైకి ఎగబాకి 57కు వచ్చింది. దేశవ్యాప్తంగా ఐసీఏఆర్‌ అక్రిడిటేషన్‌ కలిగిన 67 అగ్రివర్సిటీల్లో (అగ్రికల్చరల్‌, వెటర్నరీ, హార్టికల్చరల్‌, ఫిషరీష్‌) జేఆర్‌ఎఫ్‌, ఎస్‌ఆర్‌ఎ్‌ఫలు, రీసెర్చ్‌ పబ్లికేషన్లు, రైతులస్థాయికి తీసుకెళ్లే విస్తరణ కార్యక్రమాలు, విద్యార్థులు అధ్యాపకుల నిష్పత్తి, రెగ్యులర్‌ యూనివర్సిటీ ఆఫీసర్లు, రిక్రూట్‌మెంట్‌ లాంటి అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఈ ర్యాంకులు ప్రకటించారు. ఈ ర్యాంకులలో వెనుకబడితే జాతీయస్థాయి ఐసీఏఆర్‌ కోటా అడ్మిషన్లు, ఫండింగ్‌ ప్రాజెక్టులు చాలా తక్కువగా వస్తాయని వర్సిటీ వర్గాలు అంటున్నాయి. ఈ ర్యాంకింగ్‌లో గుంటూరులోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయవర్సిటీ 2019లో 13వస్థానం సాధించగా.. ఈ ఏడాది రెండుస్థానాలు పైకి ఎగబాకి 11వర్యాంకును, వెంకటరామన్నగూడెం కేంద్రంగా నడిచే డాక్టర్‌ వైఎస్సార్‌ హార్టికల్చరల్‌ వర్సిటీ 2019లో 34వస్థానం సాధించగా..ఈఏడాది 13స్థానాలు కిందకు దిగజారి 49వర్యాంకుకు చేరింది. 


వచ్చే ఏడాదిలో మెరుగైన ర్యాంకు సాధిస్తాం

దేశంలోని 13 వెటర్నరీ వర్సిటీల్లో మన వర్సిటీ ఈదఫా మధ్యస్థ ర్యాంకును సాధించామని వీసీ డాక్టర్‌ వి.పద్మనాభరెడ్డి తెలిపారు. వర్సిటీలోని వనరులు వినియోగించుకుని గతేడాది కన్నా కొంతమెరుగైన స్థానం సాధించామన్నారు. ఈఏడాది ఎక్కువసంఖ్యలో రెగ్యులర్‌ ఆఫీసర్ల పోస్టులను కూడా భర్తీ చేశామని, విస్తరణ విభాగాన్ని మరింతగా పటిష్టం చేసి రాబోవు రోజుల్లో ఇంకా మెరుగైన ర్యాంకు సాధిస్తామని ఆయన చెప్పారు. 

Updated Date - 2021-12-04T07:54:48+05:30 IST