నిర్లక్ష్యమే బలి తీసుకుంది..

ABN , First Publish Date - 2021-05-10T05:17:45+05:30 IST

మామిళ్లపల్లి వద్ద ముగ్గురాళ్ల గనుల్లో (బెరైటీ్‌స)లో అడుగడుగునా నిబంధనలకు పాతరేశారు.

నిర్లక్ష్యమే బలి తీసుకుంది..
ముగ్గురాళ్లను వెలుపలికి తీస్తున్న గని

బాధ్యత మరిచిన వివిధ శాఖాధికారులు 

మైన్‌ సేఫ్టీ పాటించని గని నిర్వాహకులు

అధికార పార్టీ లీడర్‌ కావడంతో నిద్రమత్తులో నిఘా

పది మంది కూలీలను పొట్టన పెట్టుకున్నారు 

భూగర్భ మైనింగ్‌ నిబంధనలకు తూట్లు 

ఆరోజే మైనింగ్‌ రద్దు చేసి ఉంటే పది మంది బతికి ఉండేవారు 

ప్రభుత్వానికి నివేదిక పంపాం : కలెక్టర్‌ హరికిరణ్‌

ఎవరినీ వదిలిపెట్టం : ఎస్పీ అన్బురాజన్‌ 


(కడప-ఆంధ్రజ్యోతి): 

మామిళ్లపల్లి వద్ద ముగ్గురాళ్ల గనుల్లో (బెరైటీ్‌స)లో అడుగడుగునా నిబంధనలకు పాతరేశారు. కొండలను పిండి చేసే పేలుడు పదార్థాల నిల్వ.. బ్లాస్టింగ్‌ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? జనావాసాలకు దూరంగా ఉండాలి, ప్రమాదవశాత్తు పేలినా ప్రాణనష్టం జరగకుండా స్ట్రాంగ్‌ రూమ్‌ (మ్యాగజెన్‌)లో నిల్వ చేయాలి, పేలుడు పదార్థాలు రవాణా చేయాలంటే ప్రత్యేక వాహనం ద్వారా లైసెన్సు హోల్డర్లే రవాణా చేయాలి, ఈ నిబంధనలు పాటిస్తున్నారో లేదో..? సంబంధిత మైనింగ్‌, మైన్‌ సేఫ్టీ, రెవెన్యూ, పోలీస్‌ యంత్రాంగం తనిఖీలు చేయకుండా అందరూ కళ్లకు గంతలు కట్టుకున్నారు..? నిర్వాహకులు మాత్రం అధికార పార్టీ అండతో అనుమతుల ముసుగులో ఇష్టారాజ్యంగా పేలుడు పదార్థాల రవాణా.. నిల్వ.. మైనింగ్‌ చేస్తున్నారు. నిఘా అధికారుల బాధ్యతారాహిత్యానికి పొట్టకూటి కోసం వచ్చిన పది మంది బడుగు జీవులు బలయ్యారు. వారి కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయాయి. మాకెవరు దిక్కురా..? అంటూ రోదిస్తున్న అభాగ్యులను ఓదార్చడం ఎవరి తరం.. రూ.10 లక్షల పరిహారంతో కుటుంబాలకు జరిగిన నష్టం తీరుతుందా..? ఈ ప్రశ్నలకు ఏలిక పెద్దలే సమాధానం చెప్పాలి. 


మైన్‌సేఫ్టీ ఏదీ..? 

కలసపాడు మండలం పోరుమామిళ్ల సమీపంలో సర్వే నెంబర్‌.1,133 పరిధిలో 30.916 హెక్టార్లలో కడప నగరానికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి చెన్నంశెట్టి రామచంద్రయ్య సతీమణి చెన్నంశెట్టి కస్తూరిబాయి పేరుతో మైనింగ్‌ లీజుకు తీసుకున్నారు. 2001 నవంబరు 2 నుంచి 2021 నవంబరు 1వ తేదీ వరకు 20 ఏళ్లు ముగ్గురాళ్ల మైనింగ్‌ కోసం గనుల శాఖ లీజుకు ఇచ్చింది. అయితే.. లీజుదారుడు ఈ మైనింగ్‌ను మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారిమఠం అధికార వైసీపీ నాయకుడు నాగేశ్వరరెడ్డికి జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్ని జీపీఏ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన అక్కడ భూగర్భ మైనింగ్‌ చేస్తున్నారు. భూగర్భంలోని తెల్లముగ్గురాళ్లను వెలికితీసి గ్రేడింగ్‌ చేసి రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం అక్కడికి ఇతియోస్‌ వాహనంలో తీసుకువచ్చిన జిలెటిన్‌ స్టిక్స్‌, డిటోనేటర్లు వంటి మందుగుండు పేలుడు పదార్థాల విస్ఫోటనంతో పది మంది మృత్యుఒడికి చేరిన సంగతి తెలిసిందే.. అయితే మైనింగ్‌ ప్రదేశంలో పేలుడు పదార్థాల నిల్వ, బ్లాస్టింగ్‌ వంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారా అంటే.. లేదని అధికారుల సమాధానం. మైనింగ్‌, క్వారీల్లో మందుగుండు సామాగ్రి నిల్వ, బ్లాస్టింగ్‌ కోసం మైన్‌ సేఫ్టీ, ఎక్స్‌ప్లోజర్‌ లైసెన్సు తప్పనిసరి. మైనింగ్‌ లీజుదారుడుకి ఈ లైసెన్సు లేని పక్షంలో ఎక్స్‌ప్లోజర్‌ లైసెన్సుదారుడు నుంచి వర్క్‌ ఆర్డర్‌ మీద అగ్రిమెంట్‌ చేసుకుని బ్లాస్టింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను తుంగలో తొక్కారు. మైనింగ్‌ నిర్వహించే ప్రాంతంలో ఎత్తయిన ప్రదేశంలో జనావాసాలకు కనీసం 400-500 మీటర్ల దూరంలో మందుగుండు సామాగ్రిని మ్యాగజైన్‌ (స్ట్రాంగ్‌ రూమ్‌)లో, మినీ మ్యాగజైన్‌లలో భద్రపరచాలి. ప్రమాదవశాత్తు పేలుడు జరిగినా ప్రమాద తీవ్రత ఉండదు. అయితే.. అక్కడ ఎక్కడ కూడా పేలుడు పదార్థాలు నిల్వ చేసే మ్యాగజైన్‌లు లేవని నిబంధనలకు విరుద్ధంగానే బ్లాస్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. 


నిబంధనలకు తూట్లు

భూగర్భంలోని ముగ్గురాళ్లను వెలికితీసే మైనింగ్‌ అది. 20-30 అడుగుల వరకు గాలి, వెలుతురు వచ్చేలా బావిలాంటి సొరంగం తవ్వి.. అక్కడి నుంచి ముగ్గురాళ్లు మైనింగ్‌ నిర్వహించాలి. అనుభవజ్ఞులైన కార్మికులనే మైనింగ్‌కు వినియోగించాలి. హెల్మెట్‌, లైట్స్‌, ఆక్సిజన్‌ వంటివి సమకూర్చాలి. భూగర్భంలోకి వెళ్లాక పైనుంచి రాళ్లు పడకుండా సపోర్టర్స్‌ (రక్షణవలయం) ఏర్పాటు చేయాలి. ఇలాంటి నిబంధనలకు తూట్లు పొడుస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా లైసెన్సు పొందిన మైన్‌మెంట్‌, బ్లాస్టర్‌ ద్వారానే బ్లాస్టింగ్‌ చేయించాలి. వారి ద్వారానే పటిష్ట భద్రత కలిగిన ప్రత్యేక వాహనంలో మందుగుండు రవాణా చేయాలని మైనింగ్‌ అధికారులు అంటున్నారు. అయితే వీటికి తూట్లు పొడిచారు. అండర్‌గ్రౌండు మైనింగ్‌ ప్రాంతానికి మనుషులు, పశువులు రాకుండా ప్రహరీగోడ లేదా చుట్టూ కంచె ఏర్పాటు చేయాలి. బ్లాస్టింగ్‌ సమయంలో కనీసం రెండు కి.మీల దూరం వరకు ప్రజలు రాకుండా కట్టుదిట్టుమైన చర్యలు తీసుకోవాలి. కంట్రోల్‌ బ్లాస్టింగ్‌ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నిబంధనలు అక్కడ అమలు కావడం లేదని అధికారుల తనిఖీలోనే వెలుగు చూసింది. ఇంత జరిగినా అధికారులు ఏం చేశారు. 


వేంపల్లి గోడౌన్‌కు అనుమతి ఉందా..?

పేలుళ్లు జరిగిన మామిళ్లపల్లి ముగ్గురాళ్ల మైనింగ్‌కు వేంపల్లి సమీపంలోని ఓ గోదాము నుంచి జిలెటిన్‌ స్టిక్స్‌, డిటోనేటర్లు, ఇతర మందుగుండు సామాగ్రి ఇతియోస్‌ వాహనంలో రవాణా చేసినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. మందుగుండు సరఫరా చేసిన వేంపల్లి గోడౌన్‌ యజమానికి బ్లాస్టింగ్‌ లైసెన్సు ఉందా..? మందుగుండు నిల్వ చేసిన ప్రాంతంలో పటిష్ట భద్రత కలిగిన మ్యాగజైన్‌ (స్ర్టాంగ్‌ రూమ్‌) ఉందా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిజంగా అనుమతులు ఉంటే.. మందుగుండు రవాణా చేసే పటిష్ట భద్రత కలిగిన వాహనంలో కాకుండా ఏమాత్రం అనుభవం లేని డ్రైవర్‌ ద్వారా ఇతియోస్‌ వాహనంలో ఎలా రవాణా చేశారన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇలా ఎన్ని రోజులుగా రవాణా చేస్తున్నారు. అధికారులు కళ్లకు గంతలు కట్టుకున్నారా..? అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. అయితే.. ఈ మైనింగ్‌ లీజుదారుడు, జీపీఏ తీసుకున్న మైనింగ్‌ నిర్వాహకుడు నాగేశ్వరరెడ్డి ఇద్దరూ కూడా అధికార వైసీపీ నాయకులు కావడం కొసమెరుపు. వీరికి కీలక ప్రజాప్రతినిధులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఫలితంగా నిబంధనలకు పాతరేసి ఇష్టారాజ్యంగా మైనింగ్‌ చేస్తున్నా.. భద్రత లేకుండా పేలుడు పదార్థాల రవాణా.. బ్లాస్టింగ్‌ చేస్తున్నా.. అధికారులు కళ్లకు గంతలు కట్టుకున్నారనే విమర్శలు లేకపోలేదు. 


ఆరోజే లీజు రద్దు చేసి ఉంటే..?

మామిళ్లపల్లి ముగ్గురాళ్ల మైనింగ్‌ రూల్స్‌ అతిక్రమిస్తున్నారని మైనింగ్‌ అధికారులు గుర్తించారు. 2019 నవంబరు 16న, అక్టోబరు 18న మైనింగ్‌ అధికారులు ఆ క్వారీని తనిఖీ చేశారు. నిబంధనలు పాటించడం లేదని గుర్తించారు. నిర్వాహకుడు నాగేశ్వరరెడ్డికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. అయితే మైనింగ్‌ అధికారులు గుర్తించిన లోపాలను సరిదిద్ది అన్ని జాగ్రత్తలు తీసుకుంటానని జీపీఏ తీసుకున్న నాగేశ్వరరెడ్డి మైనింగ్‌ అధికారులకు సమాధానం ఇచ్చారు. 2020 ఆగస్టు 25న మరోసారి తనిఖీ చేశారు. యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తుండడమే కాకుండా.. షోకాజ్‌ నోటీసులకే సమాధానం ప్రకారం ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకపోవడంతో ఏపీఎంఎం రూల్స్‌ ప్రకారం లీజు రద్దు చేయాలని కోరుతూ లేఖ.నెంబర్‌.3223/ఎం1/2001 కింద 2020 సెప్టెంబరు 20న రాష్ట్ర ఉన్నతాధికారులకు సిఫారసు లేఖ రాసినట్లు మైనింగ్‌ ఏడీ రవిప్రసాద్‌ తెలిపారు. అంతేకాకుండా ఈ ప్రదేశంలో మైనింగ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తే.. తక్షణమే తమకు సమాచారం ఇవ్వాలని స్థానిక పోలీసు, రెవెన్యూ అధికారులకు లేఖ రాశారు. స్థానిక అధికారులు గానీ, రాష్ట్ర మైనింగ్‌ అధికారులు కానీ పట్టించుకోలేదు. ఆ బాధ్యతారాహిత్యమే పదిమందిని బలి తీసుకుంది.


ఆ రూ.10 లక్షలతో ఆ పది కుటుంబాల కన్నీళ్లు తుడవగలమా...

పేలుళ్ల జరిగిన బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. విశాఖపట్నం ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. రూ.కోటి పరిహారం మంజూరు చేసింది. సీఎం సొంత జిల్లాలో జరిగిన ప్రమాదంలో పది మంది మృతి చెందారు. వారిలో ఐదుగురు సీఎం జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందులకు చెందిన వాళ్లే. రూ.10 లక్షలు పరిహారం ఇస్తామని ప్రకటించడం ఓకే. నాడు విశాఖ ఘటనలో రూ.కోటి పరిహారం ఇచ్చి.. ఇక్కడ మాత్రం రూ.10 లక్షలతో సరిపుచ్చడం ఎంతవరకు భావ్యం. ఆ డబ్బుతో కార్మికుల కుటుంబాల కన్నీళ్లు తుడవలేం. కనీసం ఆ కుటుంబానికి అండగా నిలవాలంటే.. రూ.50 లక్షల నష్టపరిహారం, మృతి చెందిన కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. 


మైనింగ్‌లో వెలుగు చూసిన లోపాలు ఇవి... :

కలసపాడు మండలం మామిళ్లపల్లె సమీపంలో వైసీపీ నాయకుడు నిర్వహిస్తున్న ముగ్గురాళ్ల భూగర్భమైనింగ్‌ కోసం ఏమాత్రం అనుభవం లేని కార్మికులను నియమించారు. మైనింగ్‌ యాక్ట్‌ 1952 సెక్షన్‌ 17 కింద ఇది విరుద్ధం.

2013-14 సంవత్సరాలలో గనులు, భూగర్భ శాఖ ఇచ్చిన మైనింగ్‌ ప్లానింగ్‌ కంటే ఎక్కువగా మైనింగ్‌ తవ్వకాలు చేశారు. 

పర్యావరణ పరిరక్షణ చట్టం-1984 మేరకు ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండానే వేల టన్నుల భూగర్భ మైనింగ్‌ చేస్తున్నారు. 

మైనింగ్‌ నిబంధనలకు అనుగుణంగా కార్మికులు మైనింగ్‌ జరిగే ప్రదేశం లోపలికి, బయటకు వచ్చేందుకు ఎలాంటి ప్రత్యేక దారులు లేవు. ఆ ప్రాంతానికి ఇతరులు వెళ్లకుండా ఎలాంటి రక్షణ గోడలు, ఫెన్సింగ్‌ ఏర్పాట్లు చేయలేదు.

అత్యంత ప్రమాదకరమైన పద్ధతిలో క్రేన్‌ బక్కెట్ల ద్వారా కార్మికులను భూగర్భగనుల్లోకి దింపుతున్నారు. అక్కడ సరైన వెలుతురు, గాలి లేదు. అప్రూవ్‌డ్‌ మైనింగ్‌ కోసం అష్యూరెన్స్‌ అమౌంట్‌ రూ.16.99 లక్షలు చెల్లించాలని 2018 జూలై 21న గనులు, భూగర్భ శాఖ డీడీ నోటీసులు ఇచ్చినా ఇంతవరకు చెల్లించలేదు. 

 మైన్స్‌ సేఫ్టీ సంబంధిత అధికారులు (కాంపిటెడ్‌ అథారిటీ) అనుమతి లేకుండా పేలుడు పదార్థాలు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. 

ఎటువంటి అనుమతులు లేకుండా టిప్పర్ల ద్వారా ముగ్గురాళ్లను (బెరైటీస్‌) రవాణా చేస్తున్నారు. భూగర్భ మైనింగ్‌లో చేసే బెరైటీస్‌ ఉత్పత్తి, రవాణాకు సంబంధించిన ఎలాంటి రికార్డులు లేవు. ఉత్పత్తి, అమ్మకపు లెక్కలు లేవు. రవాణాకు, తవ్వకపు ఖనిజానికి భారీగా తేడాలు ఉన్నాయి. 

నాణ్యమైన ముగ్గురాయిని తక్కువ నాణ్యత రాయిగా చూపించి రాయల్టీ రూపంలో మైనింగ్‌ శాఖ ఖజానాకు భారీగా గండికొట్టారు. మైనింగ్‌ పర్మిట్‌లలో ఇచ్చిన దాని కంటే ఎక్కువ ఖనిజాన్ని తవ్వినట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి లోపాలు ఎన్నో.... 


ప్రభుత్వానికి నివేదిక పంపాం 

- సి.హరికిరణ్‌, కలెక్టర్‌

మామిళ్లపల్లి ముగ్గురాళ్ల గనుల్లో జరిగిన పేలుళ్ల ప్రమాదంపై సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపాం. లీజుదారుడు, జీపీఏ దారుడు మైనింగ్‌ నిబంధనలు ఉల్లంఘించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. గత ఏడాది సెప్టెంబరు 20న లీజును రద్దు చేయాలని మైనింగ్‌ అధికారులు పై అధికారులకు సిఫారసు లేఖ పంపించారు. మృతి చెందిన పది మందిలో ఏడుగురికి వైఎస్సార్‌ బీమా అమలులో ఉంది. ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది. తదితర వివరాలతో ప్రభుత్వానికి నివేదిక పంపించాం.


ఎవరినీ ఉపేక్షించం 

- కేకేఎన్‌ అన్బురాజన్‌, ఎస్పీ

ముగ్గురాళ్ల మైనింగ్‌లో జరిగిన పేలుళ్ల ఘటనలో ఎవరినీ ఉపేక్షించం. ఇప్పటి వరకు జీపీఏ నాగేశ్వరరెడ్డితో పాటు ఐదుగురిపై కేసు నమోదు చేశాం. వారిలో లక్ష్మిరెడ్డి పేలుడు ప్రమాదంలోనే మృతి చెందాడు. ఇద్దరు మా అదుపులో ఉన్నారు. వారిని విచారిస్తున్నాం. వేంపల్లి నుంచి పేలుడు పదార్థాలు తీసుకువచ్చినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అక్కడ నిల్వ చేసిన వ్యక్తికి ఎక్స్‌ప్లోజివ్‌ లైసెన్సు ఉందా..? ఆ వ్యక్తికి ప్రమాదం జరిగిన మైనింగ్‌ యజమానికి వర్క్‌ అగ్రిమెంటు ఉందా..? తదితర కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం. ఎవరినీ ఉపేక్షించే పరిస్థితి లేదు. అయితే.. ఈ సంఘటనలో నాగేశ్వరరెడ్డితో పాటు ఆయన సోదరుడు, వేంపల్లి నుంచి పేలుడు పదార్థాలు రవాణా చేసిన వ్యక్తిపైన, మైనింగ్‌ లీజుదారుడుపైన కేసులు నమోదు చేసినట్లు తెలిసింది.





Updated Date - 2021-05-10T05:17:45+05:30 IST