ఏజెన్సీలోకి కరోనా

ABN , First Publish Date - 2020-06-06T11:18:12+05:30 IST

ఇప్పటికే ఢిల్లీ మర్కజ్‌ వెళ్లి వచ్చిన వారితో జిల్లా ను తాకిన కరోనా వైర్‌సతో జిల్లా వ్యాప్తంగా 21 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.

ఏజెన్సీలోకి కరోనా

ముంబై టూ ఉట్నూర్‌.. 

అడ్డదారిలో ఇంటికి చేరిన వలస కూలీలు

కొత్తగా తొమ్మిది మందికి సోకిన వైరస్‌

ఉట్నూర్‌కు ఇంకా కొనసాగుతున్న రాకపోకలు

అప్రమత్తంగా లేకుంటే వైరస్‌ వ్యాప్తికి అవకాశం


ఆదిలాబాద్‌, జూన్‌ 5(ఆంధ్ర జ్యోతి): ఇప్పటికే ఢిల్లీ మర్కజ్‌ వెళ్లి వచ్చిన వారితో జిల్లా ను తాకిన కరోనా వైర్‌సతో జిల్లా వ్యాప్తంగా 21 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీనిని సమర్థవంతంగా కట్టడి చేయడంతో ఇక జిల్లాకు వైరస్‌ ముప్పు తప్పిందని అందరూ భావించారు. కానీ మళ్లీ ముంబాయి నుంచి ఉట్నూర్‌ మండలానికి తిరిగి వచ్చిన వారితో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావ డం ఏజెన్సీలో కలకలం రేపుతోంది. ఇటీవల కొత్తగా 9 మందికి పాజిటివ్‌ రావడం ఆందోళన పరిస్థితులకు దారి తీస్తోంది. అయితే అధికారులు ముందులాగా కట్టడి చర్యలు చేపట్టక పోవడంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. మొదట ఉట్నూర్‌ మండల కేంద్రానికి చెందిన ఆరుగురికి పాజిటివ్‌ రాగా, లక్కారాం గ్రామ పంచాయతీ పరిధిలో ముగ్గురికి కరోనా వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఏజెన్సీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 9కి చేరింది. మరో ఒకరిద్దరికి అనుమానిత లక్షణాలు ఉండడంతో పరీక్షలు చేస్తున్నారు. వీరి ఫలితాలు రావాల్సి ఉంది. అమాయక గిరిజన గ్రామాల్లోకి కరోనా మహామ్మారి చొరబడి కల్లోలం సృష్టిస్తుంది. ప్రస్తుతం వానాకాలం కావడంతో మారుమూల గ్రామాలకు చెందిన రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేందుకు ఉట్నూర్‌ రావడానికి జంకుతున్నారు.


సరిహద్దు ప్రాంతాలలో నిఘా వైఫల్యం

పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం వలసకూలీల రాకకు సడలింపులు ఇవ్వడంతో సరిహద్దుల్లో థర్మల్‌ స్ర్కీనింగ్‌ పరీక్షలు చేసి అనుమతిస్తున్నారు. జిల్లాకు చెందిన వలస కూలీలకు హ్యాండ్‌ స్టాంప్‌ వేసి 14 రోజుల పాటు హోంక్వారంటైన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. కాని ఉట్నూర్‌ వలస కూలీలు అధికారుల కళ్లు కప్పి దొడ్డిదారిలో ఇంటికి తిరిగి రావడంతో అధికారులు హ్యాండ్‌ స్టాంప్‌ వేయలేకపోయారు. దీంతో వారిని గుర్తించే సమయంలోపే పలు ప్రాంతాలలో తిరిగినట్లు తెలుస్తుంది. ముందే కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని ఉంటే వైరస్‌ ఇంతగా వ్యాప్తి చెంది ఉండేది కాదని వాదనలు వినిపిస్తున్నాయి. సరిహద్దులో మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 


పాజిటివ్‌ కేసులు పెరిగే అవకాశం

ముంబాయి నుంచి జిల్లాకు తిరిగి వచ్చిన వలస కూలీలపై సరైన నిఘా పర్యవేక్షణ లేక పోవడంతో హోం క్వారంటైన్‌ సమయం పూర్తికాక ముందే ఇతర ప్రాంతాలకు వెళ్లినట్లు సమాచారం. చివరకు తిరిగి వచ్చిన వలస కూలీలకు పాజిటివ్‌ అని తేలడంతో వారు కాంటాక్ట్‌ అయిన వారిని గుర్తించడం కష్టంగా మారుతుంది. ముంబాయి నుంచి ఉట్నూర్‌ పరిసర ప్రాంతాలకు మొత్తం 22 మంది వలస కూలీలు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే తొమ్మిది మందికి కరోనా పాజిటివ్‌ రావడంతో మిగిత 13 మంది ఆరోగ్య పరిస్థితిపై నిత్యం వైద్య బృందాలు ఆరా తీస్తున్నాయి. ప్రస్తుతం వారికి ఎలాంటి లక్షణాలు కనిపించక పోవడంతో పరీక్షలు చేయడం లేదు. అయితే మరిన్ని పాజిటివ్‌ కేసులు పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 


యథేచ్ఛగా రాకపోకలు

గత రెండు, మూడు రోజుల క్రితమే ఉట్నూర్‌ మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చిన ఇంకా ఉట్నూర్‌కు అన్ని రకాల రాక పోకలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఉట్నూర్‌లోని శాంతినగర్‌, బోయవాడ, లక్కారాం గ్రామ పంచాయతీ పరిధిలోని నవోదయ నగర్‌ను కట్టడి ప్రాంతాలుగా ప్రకటించి కట్టడి చర్యలు తీసుకుంటున్నారు. అయినా ఉట్నూర్‌ మీదుగానే ఆసిఫాబాద్‌, మంచిర్యాల, ఆదిలాబాద్‌లకు బస్సు సర్వీసులను నడుపుతున్నారు. నిత్యం ఏడు అద్దె బస్సులతో పాటు 12 ఆర్టీసీ సర్వీసులు నడుస్తున్నాయి. వీటితో పాటు ప్రైవేట్‌ వాహనాలు అందుబాటులో ఉండడంతో ప్రయాణికులు యథేచ్ఛగా ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితులతో ఇతర ప్రాంతాలకు వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందంటున్నారు. అంతేకాకుండా పూర్తిస్థాయిలో కట్టడి చేస్తేనే ముప్పు తప్పుతుందన్న వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి.


ఉట్నూర్‌ మండల కేంద్రంలో లాక్‌డౌన్‌ కొనసాగిస్తు న్నప్పటికీ  పాక్షికంగానే కనిపిస్తోంది. దీంతో కట్టడి ప్రాంతాల నుంచి జనం యథేచ్ఛగా బయటకు రావడం ఆందోళనకర పరిస్థితులకు దారి తీస్తోంది. ఇకనైనా సంబంధిత అధికారు లు అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు.


Updated Date - 2020-06-06T11:18:12+05:30 IST