పల్లెలపై వైరస్‌ పడగ

ABN , First Publish Date - 2020-08-03T08:45:45+05:30 IST

ఇన్నాళ్లుగా పట్టణ ప్రాంతాల్లోనే విశ్వరూపం చూపుతున్న కరోనా.. ఇప్పుడు పల్లెలపైనా విరుచుకుపడుతోంది. ద్వితీయ శ్రేణి పట్టణాలతో పాటు..

పల్లెలపై వైరస్‌ పడగ

  • రాష్ట్రంలోని సగం మండలాలు, 1500 పైగా గ్రామాలకు
  • విస్తరించిన మహమ్మారి: వైద్య ఆరోగ్య శాఖ నివేదిక
  • ప్రతి ఊరికీ 100-150 మంది కొత్తవారి రాక
  • గ్రామాలకు వేగంగా వ్యాప్తి.. సెప్టెంబరులో భారీగా కేసులు
  • కేసులెక్కువున్న 5-6 జిల్లాల్లో ఆక్సిజన్‌ పడకలు ఫుల్‌
  • పేరొందిన ప్రైవేటు ఆస్పత్రుల్లో వెంటిలేటర్‌ బెడ్స్‌ నిల్‌
  • సర్కారీ దవాఖానల్లో బెడ్స్‌ ఖాళీగా ఉన్నా వెళ్లని రోగులు


హైదరాబాద్‌, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): ఇన్నాళ్లుగా పట్టణ ప్రాంతాల్లోనే విశ్వరూపం చూపుతున్న కరోనా.. ఇప్పుడు పల్లెలపైనా విరుచుకుపడుతోంది. ద్వితీయ శ్రేణి పట్టణాలతో పాటు.. గ్రామీణ ప్రాంతాల్లోనూ భారీగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతుండటంతో ఊళ్లు ఉలిక్కిపడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే సగానికిపైగా మండలాల్లో పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 1500 గ్రామాల్లో మహమ్మారి బాధితులున్నారని వైద్యఆరోగ్యశాఖ గుర్తించింది. వైరస్‌ ఉధృతి ఇలాగే కొనసాగితే సెప్టెంబరులో గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కేసులు భారీగా నమోదయ్యే ప్రమాదం ఉందని పేర్కొంటూ సర్కారుకు ఒక నివేదిక ఇచ్చింది. గ్రామాల్లో కరోనా బాధితులు పెరుగుతుండటంతో క్షేత్రస్థాయి వైద్య సిబ్బందితో వైద్య ఆరోగ్య శాఖ ఫీవర్‌ సర్వే చేయించింది. ప్రతి గ్రామంలోనూ దాదాపు 100 నుంచి 150 కొత్తముఖాలు ఉన్నట్లు సర్వేలో వారు  గుర్తించారు.


కొత్తగా కనిపిస్తున్నవారంతా ఇన్నాళ్లుగా ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం నగరాలకు వెళ్లినవారేనని.. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు కరోనా సంక్షోభంతో మళ్లీ గ్రామాలకు వచ్చారని తేల్చారు. అలాంటివారి వల్ల గ్రామీణ ప్రాంతాల్లో వైరస్‌ కేసులు పెరుగుతున్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది. నమోదవుతున్న కేసుల ఆధారంగా ద్వితీయ శ్రేణి నగరాల్లో ఆగస్టు చివరినాటికి.. పల్లెల్లో సెప్టెంబరు నెలలోనూ.. పెద్ద ఎత్తున పాజిటివ్‌లు నమోదవుతాయని అంచనా వేస్తోంది. ఇప్పటిదాకా గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కేసులు భారీగా నమోదు కాకపోవడంతో అక్కడి ఆర్థిక వ్యవస్థ పెద్దగా దెబ్బతినలేదు. అక్కడ కూడా కేసుల ప్రభావం మొదలైతే ఆర్థిక చక్రం గాడితప్పే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఆక్సిజన్‌ పడకల కొరత..

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొత్తం 4663 ఆక్సిజన్‌ పడకలుండగా అందులో 1298 మంది రోగులున్నారు. మరో 3365 బెడ్స్‌ ఖాళీగా ఉన్నట్లు సర్కారు హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. గణాంకాల ప్రకారం అన్ని పడకలు ఖాళీగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న ఐదారు జిల్లాల్లో మాత్రం ఆక్సిజన్‌ పడకలు నిండిపోతున్నాయి. ఉదాహరణకు.. నల్గొండ జిల్లా ఆస్పత్రిలో 35 ఆక్సిజన్‌ బెడ్స్‌ ఉంటే 34 మంది రోగులున్నారు. సూర్యాపేటలో 40 పడకలుంటే అన్నీ నిండిపోయాయి. సిద్దిపేటలో 31 ఆక్సిజన్‌ పడకలకుగాను.. ఏడు ఖాళీగా ఉన్నాయి.  వరంగల్‌ అర్బన్‌లో గత 15 రోజులుగా నిత్యం 120కి తగ్గకుండా కేసులు నమోదు అవుతున్నాయి. అక్కడ ఎంజీఎం ఆస్పత్రిలో  150 ఆక్సిజన్‌ పడకలుంటే అందులో కేవలం ఆరే ఖాళీగా ఉన్నాయి. మహబూబ్‌నగర్‌లో 65 పడకలుంటే ఇప్పటికే 35 మంది రోగులున్నాయి. ఆదిలాబాద్‌ రిమ్స్‌లో  270 పడకలుంటే 76 మంది, నిజామాబాద్‌లో 205 పడకలకు గాను 98 మంది రోగులు చికిత్స పొందుతున్నారు.


మున్ముందు కేసులు పెరిగే అవకాశం ఉన్నందున జిల్లా ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ పడకలు దొరకడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక.. పేరొందిన ప్రైవేటు ఆస్పత్రుల్లో వెంటిలేటర్‌ పడకలు దొరకడమే గగనంగా మారింది. హైదరాబాద్‌లో ప్రైవేటులో మొత్తం 1247 వెంటిలేటర్స్‌ పడకలుంటే అందులో 826 మంది రోగులుండగా, 421 బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రం మొత్తం 1251 వెంటిలేటర్‌ బెడ్స్‌ ఉండగా..కేవలం 270 మంది రోగులే ఉన్నారు. మరో 981 బెడ్స్‌ ఖాళీగా ఉన్నట్లు హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొన్నారు. ఇక ప్రైవేటులో ఖాళీగా ఉన్న వెంటిలేటర్‌ బెడ్స్‌ అన్నీ చిన్న చిన్న ఆస్పత్రుల్లోనివే. ప్రభుత్వ ఆస్పత్రుల్లో భారీ సంఖ్యలో వెంటిలెటర్‌ బెడ్స్‌ ఖాళీగా ఉన్నా.. రోగులు అటువైపు వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపట్లేదు. ఒకరిద్దరు రోగులు గాంధీ, చెస్ట్‌ ఆస్పత్రుల్లో చనిపోయే ముందు అక్కడి పరిస్థితులపై సెల్ఫీ వీడియోలు తీసి బయటకు పంపడంతో సర్కారీ ఆస్పత్రులంటేనే పేషెంట్లు భయపడే పరిస్థితి కనిపిస్తోంది.


విస్తృతంగా ఆర్‌ఎంపీల సేవలు

ప్రస్తుతం వైరస్‌ రెండో దశ నడుస్తోందని, మూడో దశలో గ్రామీణ ప్రాంతాలకు చేరుకుంటుందని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. పల్లెల్లో కేసులు పెరిగితే మరణాల శాతం కూడా ఎక్కువగా ఉండవచ్చని సర్కారు అంచనా వేస్తోంది. అక్కడ వృద్ధులతో పాటు వైద్య సేవలు తక్కువగా ఉండటం ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో.. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఆర్‌ఎంపీలు, పీఎంపీల సేవలను విస్తృతంగా వాడుకోవాలని ఇప్పటికే సర్కారు నిర్ణయించింది. వారి దగ్గరికి జ్వరపీడితులు, కరోనా అనుమానిత లక్షణాలున్న వారు వస్తే వెంటనే స్థానికంగా ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపాలని ఆర్‌ఎంపీ, పీఎంపీలకు వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఆదేశాలు వెళ్లాయి. అవసరమైతే వారే స్వయంగా కరోనా అనుమానితులను వైరస్‌ నిర్ధారణ పరీక్షలకు కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. పాజిటివ్‌లను ఆదిలోనే గుర్తించి, వారిలో దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి ముందుగానే చికిత్స అందిస్తే, వారి ప్రాణాలు కోల్పోకుండా కాపాడవచ్చని వైద్య ఆరోగ్యశాఖ భావిస్తోంది.

Updated Date - 2020-08-03T08:45:45+05:30 IST