ఎన్నాళ్లో వేచిన వూహాన్‌!

ABN , First Publish Date - 2020-04-09T07:58:08+05:30 IST

కరోనా ‘పుట్టినిల్లు’ వూహాన్‌ రెక్కలు విప్పుకొంది. రెండున్నర నెలల బందీఖానాను వదిలి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటోంది. నగరంలో వైరస్‌ వ్యాప్తి దాదాపుగా ఆగిపోవడంతో...

ఎన్నాళ్లో వేచిన వూహాన్‌!

  • రెండున్నర నెలల తర్వాత స్వేచ్ఛ


వూహాన్‌, ఏప్రిల్‌ 8: కరోనా ‘పుట్టినిల్లు’ వూహాన్‌ రెక్కలు విప్పుకొంది. రెండున్నర నెలల బందీఖానాను వదిలి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటోంది. నగరంలో వైరస్‌ వ్యాప్తి దాదాపుగా ఆగిపోవడంతో.. 76 రోజుల తర్వాత అక్కడ లాక్‌డౌన్‌ను ఎత్తివేశారు. దీంతో ప్రజలు బుధవారం వీధుల్లోకి వచ్చారు.  ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించి తమ పనులు ప్రారంభించారు. రైళ్లు తిరుగుతున్నాయి. విమానాలు ఎగురుతున్నాయి. కర్మాగారాల్లో యంత్రాల రొద మళ్లీ మొదలైంది. 1.10 కోట్ల జనాభా ఉన్న వూహాన్‌లో జనవరి 23న పూర్తి లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చింది.


అప్పటి నుంచి ఎడారులను తలపించిన నగర వీధులు ఇప్పుడు తిరిగి జనంతో కళకళలాడాయి. స్నేహితులు, సహోద్యోగులు, బంధువులను కలుసుకున్న వారు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఒకరికొకరు ఆలింగనం చేసి కంటతడి పెట్టారు. ‘కరోనా వైర్‌సను జయించాం’ అని కేకలు పెట్టారు. దుకాణాలను ప్రత్యేకంగా దీపాలతో అలంకరించారు. వూహాన్‌ విమానాశ్రయంలో బుధవారం దిగిన తొలి విమానానికి జల ఫిరంగులతో స్వాగతం పలికారు. విమానాశ్రయంలో సిబ్బంది పూర్తిస్థాయిలో రక్షణ పరికరాలను ధరించి విదులు నిర్వహిస్తున్నారు.

Updated Date - 2020-04-09T07:58:08+05:30 IST