Abn logo
Oct 18 2020 @ 00:43AM

యుద్ధం మొదలైంది!

సినిమాల్లో హీరోలు, హీరోయిన్లు, విలన్లు స్పష్టంగా కనిపిస్తూ ఉంటారు. విలన్లు ప్రజలను పీడిస్తూ ఉంటారు. హీరో ఎదురుతిరుగుతాడు. హీరోయిన్‌ అతని హీరోయిజాన్ని ప్రేమిస్తుంది. చివరకు విలన్‌ను హీరో అంతం చేసేస్తాడు. 

కొన్ని వేల సినిమాల్లో ఈ తరహా కథలు చూస్తూ ఉంటాం. కానీ నిజ జీవితంలో హీరోలెవరో.. విలన్‌లు ఎవరో తెలుసుకోవటం చాలా కష్టం. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూట్‌ ఆత్మహత్య వ్యవహారం రకరకాల మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో- మీడియా తమను విలన్‌లుగా చూపిస్తోందని.. వారిని నియంత్రించాలని కోరుతూ ఈ వారం బాలీవుడ్‌కు చెందిన 34 ప్రొడక్షన్‌ హౌస్‌లు.. ఇండస్ట్రీకి ప్రాతినిధ్యం వహించే సంస్థలు ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్‌ సంచలనం రేకెత్తిస్తోంది. 


పిటిషన్‌లో ఏముంది?

‘‘ ఈ రెండు ఛానల్స్‌ ( ఆ తర్వాత మొత్తం మీడియా అని మార్చారు) చేస్తున్న ప్రతికూల ప్రచారం వల్ల కొన్ని వేల మంది సినీ కార్మికుల జీవితాలు ఇబ్బందుల్లో పడుతున్నాయి. బాలీవుడ్‌ నటులందరూ క్రిమినల్స్‌ అన్నట్లుగా.. బాలీవుడ్‌ డ్రగ్స్‌ను ప్రొత్సహిస్తుందన్నట్లుగా చేస్తున్న ప్రచారం వల్ల ప్రజలలో బాలీవుడ్‌ అంటే ఒక తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. కొందరు తామే కోర్టులుగా వ్యవహరిస్తూ తీర్పులు ఇస్తున్నారు. పవిత్రమైన న్యాయ వ్యవస్థను చేతుల్లోకి తీసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు!’’


సల్మాన్‌ఖాన్‌కు షారూక్‌కు పడదు. షారూక్‌ అంటే అమీర్‌కు నచ్చదు. ఈ ముగ్గురు ఖాన్‌లంటే అజయ్‌దేవగన్‌కు ఎక్కడో చిన్న ఇబ్బంది. కరణ్‌ జోహర్‌ తన సినిమాలన్నీ షారూక్‌తో తియ్యటానికే ఇష్టపడతాడు. ధర్మా ప్రొడక్షన్స్‌లో పనిచేయటానికి అమీర్‌ ఇష్టపడడు. ఇలాంటి వార్తలన్నీ మనం ఎప్పుడో ఒకప్పుడు చదివే ఉంటాం. వీరందరూ కలిసి ఎప్పుడైనా ఒక వేదిక మీదకు వస్తే చూడాలనుకొనే అభిమానులు కొన్ని కోట్ల మంది ఉంటారు. ఒక వేదికపైకి కాదు కానీ వీరందరూ కలిసి   ఢిల్లీ హైకోర్టులో  మీడియాకు వ్యతిరేకంగా దాఖలు చేసిన 1069 పేజీల పిటిషన్‌ దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది.బాలీవుడ్‌ నటులపైన.. మొత్తం బాలీవుడ్‌ ఇండస్ట్రీపైనా వివిధ ఛానల్స్‌లో ప్రసారమవుతున్న కథనాలన్నింటినీ గుదిగుచ్చి ఈ పిటిషన్‌ను వేశారు. అమీర్‌ఖాన్‌ ప్రొడక్షన్‌, అజయ్‌దేవగన్‌ ఫిల్మ్స్‌, సల్మాన్‌ఖాన్‌ ఫిల్మ్స్‌, యాష్‌రాజ్‌ఫిల్మ్స్‌, ధర్మా ప్రొడక్షన్స్‌- ఇలా బాలీవుడ్‌ను శాసించే ప్రొడక్షన్‌ హౌస్‌లన్నీ ఈ పిటిషన్‌లో భాగస్వాములవటం చరిత్రలో నిలిచిపోయే విషయమని విమర్శకులు పేర్కొంటున్నారు. భారతీయ సినీ చరిత్రలో ఈ తరహా పోరాటం ఎప్పుడు జరగలేదని వెల్లడిస్తున్నారు. 


ఎందుకింత కోపం?

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుట్‌ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్‌లో ఉన్న చీలికలన్నీ బయటకు వచ్చాయి. సుశాంత్‌ ఆత్మహత్యకు బాలీవుడ్‌లో ఉన్న పెద్దలు కొందరిపై చూపించే అవాజ్యమైన ప్రేమే పరోక్ష కారణమని.. తనకు అవకాశాలు రాకుండా కొందరు ప్రయత్నిన్నారనే బాధతో సుశాంత్‌ తీవ్రమైన ఒత్తిడికి గురయ్యి ఆత్మహత్య చేసుకున్నాడని వార్తలు రావటం మొదలుపెట్టాయి. కరణ్‌ జోహార్‌, సల్మాన్‌ ఖాన్‌, అలియా భట్‌ వంటి నటులపై సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ మొదలయింది.


ఈ వివాదం అనేక మలుపులు తిరుగుతున్నా.. చివరకు అది డ్రగ్స్‌ దారి పట్టినా.. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరోలెవ్వరూ దాని గురించి మాట్లాడలేదు. ఖాన్‌ త్రయమే కాకుండా.. అజయ్‌దేవగన్‌, కరణ్‌ జోహర్‌ వంటి వారు పెదవి విప్పటానికి ఇష్టపడలేదు. ఈ ఆత్మహత్య వ్యవహారం డ్రగ్స్‌ బాట పట్టడం.. దీపిక, రకుల్‌ వంటి వారు డ్రగ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో విచారణకు హాజరు కావటం కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఇంగ్లీషు, హిందీ ఛానల్స్‌- బాలీవుడ్‌పై అనేక కథనాలు ప్రసారం చేయటం మొదలుపెట్టాయి.


కొన్ని కథనాలలో బాలీవుడ్‌ అంతా డ్రగ్స్‌తో కుళ్లిపోయిందని.. బాలీవుడ్‌ తారలు క్రిమినల్స్‌ అని వ్యాఖ్యలు కూడా వినిపించాయి. మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లు.. అసలే కొవిడ్‌ దెబ్బతో రెవెన్యూ నష్టం జరిగి విలవిలాడుతున్న బాలీవుడ్‌ పెద్దలకు ఇదొక సమస్యగా మారింది. పరిస్థితి ఇంకా చేయి దాటిపోతే-  ప్రజలలో బాలీవుడ్‌పైన ఉన్న ఆకర్షణ పోతుందని.. బాలీవుడ్‌ వారందరినీ క్రిమినల్స్‌గా చూసే అవకాశముందని వారు భావించారు. దీనితో బాలీవుడ్‌కు చెందిన ప్రముఖలందరూ కలిసి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీని ద్వారా బాలీవుడ్‌ అంతా ఒక తాటి మీద ఉందని ప్రజలకు ప్రధానోద్దేశంగా కనిపిస్తోంది. దీనితో పాటుగా కోర్టులో కేసు ఉంటే- మీడియా కొంత కట్టడితో వ్యవహరిస్తుందని కూడా విమర్శకులు బావిస్తున్నారు. తేలుతుందా?

వాస్తవానికి బాలీవుడ్‌, నేషనల్‌ మీడియా ఒక దానిపై మరొకటి ఆధారపడి ఉన్నవే! బాలీవుడ్‌లో హీరోలకు, చిత్రాలకు ప్రచారం కల్పించేది నేషనల్‌ మీడియానే! ప్రచారం సరిగ్గా లేక దెబ్బతిన్న సినిమాలెన్నో మనకు బాలీవుడ్‌ చరిత్రలో కనిపిస్తాయి. కానీ అదే సమయంలో మీడియాకు ప్రకటనల ద్వారా కొంత ఆదాయాన్ని ఇచ్చేది బాలీవుడ్డే!


అంతే కాదు. ఛానల్స్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రోగ్రాములకే టీఆర్‌పీలు ఎక్కువ కూడా. అంటే ఇటు బాలీవుడ్‌.. అటు ఎలకా్ట్రనిక్‌ మీడియా ఒక దానిపై మరొకటి ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం ఎంత దెబ్బలాడుకున్నా- భవిష్యత్తులో ఒకరికొకరు సాయం చేసుకోవాల్సిందే. లేకపోతే ఇద్దరికీ ఇబ్బంది తప్పదు. సుశాంత్‌ కేసు చల్లబడి.. థియేటర్లు తెరుచుకొని.. రెవెన్యూ పెరిగే వరకూ  ఈ యుద్ధం తప్పదు!మీడియా ఏం చేస్తోంది?

ఛానల్స్‌లో ప్రసారమవుతున్న వివిధ కార్యక్రమాలను సమీక్షించి.. నియంత్రించటానికి న్యూస్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ స్టాండర్స్డ్‌ అథారిటీ అనే స్వీయ నియంత్రణ సంస్థ ఉంది. దేశంలోని ఛానల్స్‌ అన్నీ కలిపి దీనిని ఏర్పాటు చేసుకున్నాయి. 

సుశాంత్‌ ఆత్మహత్య విషయంలో కొన్ని ఛానల్స్‌లో ప్రసారమయిన అనుచిత వ్యాఖ్యలపై దీనికి కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై అథారిటీ విచారణ జరిపి- ఆజ్‌తక్‌, జీ న్యూస్‌, న్యూస్‌24లను- కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పమని కోరింది.దాదాపు అందరూ...

ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా, ది సినీ అండ్‌ ఆర్టిస్ట్స్‌ ఆసోషియేషన్‌ సహా ముఖ్యమైన 

బాలీవుడ్‌ సంస్థలన్నీ ఈ పిటిషన్‌లో భాగస్వాములయ్యాయి. ఖాన్‌ల త్రయంతో పాటు కరణ్‌జోహార్‌, అనూష్క శర్మ, 

అజయ్‌దేవగన్‌, అనీల్‌ కపూర్‌, షారూక్‌ ఖాన్‌, ఆదిత్య చోప్రా, ధర్మేంద్ర మొదలైన వారికి చెందిన 24 ప్రొడక్షన్‌ హౌస్‌లు కూడా ఈ పిటిషన్‌లో భాగమయ్యాయి. 


Advertisement
Advertisement
Advertisement