సజ్జన సాంగత్యం.. ఆనందానికి మార్గం

ABN , First Publish Date - 2020-08-02T08:06:04+05:30 IST

సజ్జన సాంగత్యం.. ఆనందానికి మార్గం

సజ్జన సాంగత్యం.. ఆనందానికి మార్గం

గంగా పాపం శశీ తాపం దైన్యం కల్పతరుస్తథా

పాపం తాపంచ దైన్యం చ హంతి సంతో మహాశయాః


గంగా నది పాపాన్ని, చంద్రుడు తాపాన్ని, కల్పవృక్షం పేదరికాన్ని పోగొడతాయి.  మహాపురుషుల, సత్పురుషుల ఆశ్రయం, దర్శనం ఈ మూడింటినీ పోగొడతాయని దీని అర్థం. భగవంతుని ప్రేమకు అందరూ అర్హులే. కానీ, మానవునికి విశ్వాసం తక్కువ. అందుకే భగవంతుని నామస్మరణకు దూరమై, కష్టాలపాలవుతున్నాడు. ఆత్మవిశ్వాసం, సత్పురుష సాంగత్యం, భగవంతునిపైకి దృష్టిని మరలుస్తాయి. ఇది సత్యం. సత్పురుషుల కొలువు భగవంతుని సాన్నిధ్యంతో సమానమన్నారు పెద్దలు. చెడ్డవాని స్నేహం పలు సంశయాలకు తావిస్తుంది. సత్పురుషుని స్నేహం మలయమారుతంలా జీవితాన్ని పునీతం చేస్తుంది.


సత్పురుషులంటే ఎవరు? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాది  అరిషడ్వర్గాల కల్మషం అంటని పవిత్ర మూర్తులకు ‘సత్పురుషు’లన్న నామం శోభిస్తుంది. వారు పవిత్ర గోదావరి లాంటి వారు. తమ జ్ఞాన ప్రభోదాలతో వారు ఈ సమస్త ప్రపంచాన్నీ అజ్ఞానాంధకారాన్నుంచి కాపాడగలుగుతారు. సత్పురుష సాంగత్యం అందరికీ మార్గదర్శకం. నారద, తుంబుర, ప్రహ్లాదాది భక్తవరేణ్యులు, విదురాది మహా భక్తులందరూ సత్పురుషుల కోవలోనివారే. అలాంటి మహాత్ములు, సత్పురుషులు అవతరించి ఈ పవిత్ర భూమిని జ్ఞాన భూమిగా, తపో భూమిగా సంస్కరించి, ఉద్ధరించి తరించారు. 


భగవంతుని ప్రేమకు దుష్టులు, శిష్టులన్న తారతమ్యం లేదు. ఎంతటి దుర్మార్గుడినైనా భగవంతుడు కరుణించి మోక్ష ప్రాప్తినిచ్చిన వృత్తాంతాలు మన పురాణాల్లో చాలా ఉన్నాయి. బిడ్డలు తప్పుచేస్తే తల్లిదండ్రులు ప్రేమ, ఆదరాభిమానాలతో దగ్గరికి చేర్చుకొని వారికి మంచి, చెడులు తెలిపి సక్రమంగా నడిపించినట్లే భగవంతుడు ప్రతి ఒక్కరినీ కరుణిస్తాడు. సత్పురుషుల సాంగత్యం కూడా అలాగే చెడ్డవారిలో మంచితనాన్ని పెంచుతుంది. వారికి స్వపర బేధాలుండవు. అందరినీ సమానంగా ఆదరిస్తారు. మంచి మాటలతో పవిత్ర మార్గంలో పయనించేలా చేస్తారు. భగవంతునిలా దయాగుణం, క్షమాగుణం సత్పురుషులకు ఉంటాయి కనుక వారిని భగవంతునితో సమానులుగా చెప్పొచ్చు. అట్టి సత్పురుష సాంగత్యానికి సంపూర్ణ భక్తి విశ్వాసాలు మాత్రమే సాధనాలు. కురుక్షేత్రంలో అర్జునుడు ఇలాగే ధర్మ మార్గమెరిగి శ్రీకృష్ణుని లాంటి సత్పురుషుని (భగవంతుని) కృపనొందాడు. సజ్జన సాంగత్యం, సత్పురుషాదుల సేవలు జీవనానికి ఆనంద మార్గాలవుతాయి కనుక కలియుగంలో సత్పురుషుల వచనాలను విని తరిద్దాం. జ్ఞానప్రదులమై భగవంతుని చరణాలనాశ్రయించి ధన్యులమవుదాం.


పరాంకుశం శ్రీనివాసచారి, 9493455256

Updated Date - 2020-08-02T08:06:04+05:30 IST