Advertisement
Advertisement
Abn logo
Advertisement

నీ కలం తొలిచిన దారి!

సరసస్వరసురఝరీగమనమంటూ

సప్తస్వరాలను సరళంచేసి సిరివెన్నెలవయ్యావు

నీ కవనాన్ని గానంలా చేసి ఎందరికో 

బతుకు మీద ఆశని ఉచ్ఛ్వాసగా నింపావు!


సిగ్గులేని జనాలను నిగ్గదీసి అడగమంటూ

నువ్వు రగిలించిన నిప్పులు రేపే గాయాలు తగ్గేదెలా?

ఎవరో ఒకరు ఎపుడో అపుడు... అటో ఇటో

నడవాల్సిందే అంటూ ముందుకు సాగడానికి అంకురం వేశావు!


ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అంటూ

జీవితంలో పట్టుదలను పెంచావు!

దరికిరాని వనాలకోసం వసంతమే తరలి

వస్తుందని చస్తున్న ఆశను బతికించావు!


జగమంత కుటుంబం ఉన్నా మనం ఏకాకులమనే

జీవిత చక్రాన్ని ఒక్క మాటలో బోధించావు!


ఎంతవరకు ఎందుకొరకు అని అడక్కుండా

గమనమే గమ్యమనుకొమ్మన్నావు

చేదు, బాధ, కీడు, మేలూ అన్నీ మామూలే

కొన్నాళ్లే అంటూ నిరాశలో ఉత్సాహాన్నిచ్చావు!


మేఘాలలో తేలిపొమ్మంటూ, తూఫానులా రేగిపొమ్మంటూ

ఉడుకు రక్తంలో గులాబీలు పూయించావు

అందరికీ అర్థంకాని సంగీతాన్ని

అందులోని అంతులేని జ్ఞానాన్ని

సరళం చేసి మధురంగా రాసి

మత్తు తగ్గని మందులా ఎక్కించావు!


ఆలుమగల గొడవలు చెప్తావు

దాంపత్యపు గొప్పతనం వివరిస్తావు

బోడి చదువులు వద్దంటావు

చదువులేకపోతే బతుకే లేదంటావు


బతుకు ఎంత హీనమో చూపిస్తావు

ఎంత గొప్పగా బతకొచ్చో నువ్వే చెప్తావు

ఏ వయసు వాళ్లకైనా సరే వాళ్లకు 

అర్థమయ్యే భాషలో జీవితాన్ని బోధించావు

నీ మాటలతో నిద్ర లేపుతావు

నీ సాహిత్యంతో ముందుకు నడిపిస్తావు

నీ మాటలు, వాటిని పాటలా మార్చే నీ కలం

ఆగిపోతే ఎంతమంది స్తబ్ధులయ్యారో!

ఇంత నిశ్శబ్దాన్ని ఇచ్చి ఎందుకు వెళ్లావయ్యా

గులాబి

Advertisement
Advertisement