Abn logo
Apr 8 2020 @ 03:43AM

కమనీయం.. కోదండరాముడి కల్యాణం

వేదపండితులు, టీటీడీ అధికారుల ఆధ్వర్యంలో కల్యాణం 

లాక్‌డౌన్‌ దృష్ట్యా ఆలయ తలుపులు మూసివేసి  భారీ భద్రత 


రాజంపేట/ఒంటిమిట్ట, ఏప్రిల్‌ 7: ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణోత్సవం మంగళవారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆగమశాస్త్ర ప్రకారం వైష్ణవ సంప్రదాయంలో పౌర్ణమి వెలుగులో సీతారాముల కల్యాణాన్ని నిర్వహించారు. కరోనా లాక్‌డౌన్‌ దృష్ట్యా భక్తులు లేకుండా, మీడియాకు అనుమతివ్వకుండా టీటీడీ అఽధికారులు, వేదపండితులతో స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించారు. జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శంకర్‌బాలాజీ కుటుంబ సమేతంగా స్వామివారికి పట్టువస్త్రాలు, డిప్యూటీ ఈవో లోకనాధం ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. పండితుల చతుర్వేదపారాయణం, మంగళవాయిద్యాల నడుమ రాత్రి 8.38 గంటలకు శ్రీరామచంద్రుడు సీతమ్మ మెడలో మంగళసూత్రధారణ చేశారు.


టీటీడీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రాజే్‌షబట్టర్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రమణీయమైన ఈ ఉత్సవాన్ని రామాలయ కోవెలలో వేదపండితులు, టీటీడీ అధికారుల సమక్షంలో నిర్వహించారు. అనంతరం నివేదన ఇచ్చి బ్రహ్మముడి వేశాక మహదాశీర్వచనం చేసి హారతి ఇవ్వడంతో కల్యాణ తంతును ముగించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ హనుమంతునాయక్‌ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. టీటీడీ భక్తి ఛానల్‌ కల్యాణోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. కరోనా లాక్‌డౌన్‌ దృష్ట్యా కల్యాణోత్సవానికి ముందే టీటీడీ అధికారులను, వేదపండితులను అనుమతించిన అనంతరం ప్రధాన ద్వారాన్ని మూసివేసి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.  కార్యక్రమంలో ఎస్‌ఐలు అమర్‌నాధరెడ్డి, రమే్‌షకుమార్‌రెడ్డి, లక్ష్మీకర్‌రెడ్డి, తహసీల్దారు విజయకుమారి, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. 


సంప్రదాయంగా ఎదుర్కోలు ఉత్సవం 

ఒంటిమిట్ట కోదండరామాలయంలో మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు ఎదుర్కోలు ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులను వివిధ పుష్పాలతో అలంకరించి పల్లకిపై కొలువుదీర్చారు. ఆలయ రంగమండపంలో మంగళవాయిద్యాల నడుమ కల్యాణ మంటపానికి తీసుకెళ్లారు. రజిత సింహాసనంపై కల్యాణమూర్తులను ఆశీనులు చేశారు. అనంతరం పూజాసామగ్రిని సంప్రోక్షణ జరిపి కల్యాణోత్సవానికి ఎలాంటి విజ్ఞాలు కలగకుండా విష్వక్సేన పూజ చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్యాణం అనంతరం మంగళవారం రాత్రి సీతారాములు గజవాహనంపై ఊరేగారు. 

Advertisement
Advertisement
Advertisement