అతిథి అధ్యాపకుల అరణ్య రోదన

ABN , First Publish Date - 2022-09-06T05:28:30+05:30 IST

విద్యాసంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా అతిథి అధ్యాపకుల వెతలు తీరడం లేదు. రెగ్యులర్‌ లెక్చరర్లతో సమానంగా విధులు నిర్వహిస్తున్న తమను రెగ్యులరైజ్‌ చేయాలని గెస్ట్‌ లెక్చరర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

అతిథి అధ్యాపకుల అరణ్య రోదన

 - రెన్యూవల్‌ చేయరు...రెమ్యూనరేషన్‌ ఇవ్వరు

- ఎన్నాళ్లు ఈ వెట్టి చాకిరి

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

విద్యాసంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా అతిథి అధ్యాపకుల వెతలు తీరడం లేదు. రెగ్యులర్‌ లెక్చరర్లతో సమానంగా విధులు నిర్వహిస్తున్న తమను రెగ్యులరైజ్‌ చేయాలని గెస్ట్‌ లెక్చరర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రెగ్యులరైజ్‌ మాట దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగాలను కూడా రెన్యూవల్‌ చేయక పోవడంతో మనోవేదనకు గురవుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, గెస్ట్‌ లెక్చరర్‌ వంటి పోస్టులు ఉండవని, వారందరిని రెగ్యులరైజ్‌ చేస్తామని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఇచ్చిన హామీ ప్రత్యేక రాష్ట్రం వచ్చి ఎనిమిదేళ్లయినా కార్యరూపం దాల్చలేదు.  ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకే అతీగతీ లేకపోతే ఎలా అని గెస్ట్‌ లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీజీ, పీహెచ్‌డీ విద్యార్హతలు ఉన్నా తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్‌ చేస్తారనే ఆశతో అరకొర వేతనాలు ఇస్తున్నా గెస్ట్‌ లెక్చరర్లు ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో విఽధులు నిర్వహిస్తున్నారు. కళాశాలల్లో అధ్యాపకుల కొరత ఉండడంతో గెస్ట్‌ లెక్చరర్లు వారు లేని లోటును భర్తీచేస్తున్నారు. 


 వేతనాలు సకాలంలో అందక ఇబ్బందులు


గత విద్యాసంవత్సరంలో గౌరవ వేతనాలను సకాలంలో ఇవ్వక పోయినప్పటికీ భవిష్యత్‌పై ఆశతో తిరిగి విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. అయినా ఈ సంవత్సరం వారి పోస్టులను రెన్యూవల్‌ చేయకపోవడంతో నాలుగు నెలలుగా అనధికారికంగా కొందరు ఆయా కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్నారు. మరికొంత మందిని పోస్టులు రెన్యూవల్‌ చేయలేదంటూ సంబంధిత కళాశాలల ప్రిన్సిపాల్స్‌ విధుల్లోకి చేర్చుకోలేదు. మరికొన్ని కళాశాలల్లో లెక్చరర్ల కొరత ఉండడంతో ప్రిన్సిపాల్స్‌ గెస్ట్‌ లెక్చరర్లను పిలిపించి మీరు విధుల్లో చేరి బోధిస్తేనే భవిష్యత్‌లో రెన్యూవల్‌ చేస్తామని, లేకపోతే నోటిఫికేషన్‌ ఇచ్చి కొత్త వారిని తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. దీనితో చాలా మంది గెస్ట్‌లెక్చరర్లు విధిలేని పరిస్థితిలో కళాశాలల్లో అనధికారికంగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు గెస్ట్‌ లెక్చరర్లను రెన్యూవల్‌ చేయక పోవడం, ఎలాంటి వేతనాలను కూడా ఇవ్వక పోవడంతో ఇంకెన్నాళ్ళు వెట్టి చాకిరీ చేయాలో తెలియక రాష్ట్రంలోని అక్కడక్కడ ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారని పలువురు గెస్ట్‌లెక్చరర్లు వాపోతున్నారు. 


 జిల్లాలో 77 మంది గెస్ట్‌ లెక్చరర్లు


జిల్లాలోని 15 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 58 మంది, ఐదు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 19 మంది గెస్ట్‌లెక్చరర్లుగా పని చేస్తున్నారు. ఒక్కో గెస్ట్‌ లెక్చరర్‌ నెలకు 72 గంటలు అంటే 72 పీరియడ్స్‌ తీసుకోవాల్సి ఉంటుంది. వీరికి ఒక్కో పీరియడ్‌కు 300 రూపాయల చొప్పున నెలకు గరిష్టంగా 72 పీరియడ్స్‌ తీసుకొని విద్యాబోధన చేసినందుకు పారితోషకంగా 21,600 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది. వీటిలో కొన్ని నెలల్లో 72 పీరియడ్స్‌ చెప్పే అవకాశం లేనపుడు, సెలవులు ఎక్కువగా వచ్చిన సందర్భంలో 10, 15 పీరియడ్స్‌ కూడా రావని, అలాంటి సందర్భంలో నెలకు 3 నుంచి 4వేల రూపాయల పారితోషకం కూడా రాని సందర్భాలుంటాయి. కొవిడ్‌ తర్వాత నిత్యావసరాల ధరలతోపాటు జీవన వ్యయం  పెరిగినందున తమకు ఇచ్చే పారితోషకాన్ని పెంచాలని, అర్హులైన వారందరిని రెగ్యులరైజ్‌ చేయాలంటూ గెస్ట్‌ లెక్చరర్ల సంఘాలు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ప్రభుత్వం ఇటీవల పారితోషకాన్ని కొంత పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ప్రతి పీరియడ్‌కు ఇచ్చే 300 రూపాయలను 390కి పెంచింది. తాజా పారితోషకం ప్రకారం నెలకు 28,600 వరకు వస్తుందని గెస్ట్‌లెక్చరర్లు సంతోషించారు. తమ పోస్టులు రెగ్యులరైజ్‌ అయ్యే వరకు కనీసం ఈ పారితోషకంతోనైనా కుటుంబాన్ని పోషించుకోవచ్చని భావించి విధుల్లో తిరిగి చేరేందుకు సిద్ధమయ్యారు. విద్యాసంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం  గెస్ట్‌ లెక్చరర్లను రెన్యూవల్‌ చేయక పోవడంతో వారు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఓవైపు గత సంవత్సరంలోని బకాయిలను ఇవ్వకుండా ఈ సంవత్సరంలో ఉద్యోగం రెన్యూవల్‌ చేయకుండా కొత్త రెమ్యూనరేషన్‌ ఇవ్వకుండా గెస్ట్‌లెక్చరర్లతో వెట్టిచాకిరి చేయిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 


 ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌


ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల్లో  అక్కడి ప్రభుత్వాలు గెస్ట్‌ లెక్చరర్లను రెగ్యులరైజ్‌ చేసింది. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో అర్హత కలిగి గెస్ట్‌ లెక్చరర్లుగా పనిచేస్తున్న వారికి ఉద్యోగభద్రత కల్పిస్తూ వారికి కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తిస్తూ వేతనాలను చెల్లిస్తూ పదవీ విరమణ వరకు కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేశాయి. ఆయా రాష్ట్రాల్లో మాదిరిగా తమకు కూడా ఉద్యోగభద్రత కల్పించాలని, రెగ్యులరైజ్‌ చేయాలని గెస్ట్‌లెక్చరర్లు కోరుతున్నారు. పీహెచ్‌డీలు, పీజీలు చేసి రెగ్యులర్‌ ఉద్యోగం దొరకక చాలీచాలనీ డబ్బులతో కుటుంబాలను పోషించుకుంటున్న గెస్ట్‌లెక్చరర్లు రకరకాల ఇబ్బందులతో రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. గెస్ట్‌ లెక్చరర్ల బలవన్మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందోని ఆ సంఘంతోపాటు పలువురు విద్యావేత్తలు, మేధావులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గెస్ట్‌ లెక్చరర్లను రెన్యూవల్‌ చేసి బకాయిలతోపాటు నాలుగు నెలలుగా కళాశాలల్లో పని చేస్తున్న వారికి  రెమ్యూనరేషన్‌ ఇవ్వాలని కోరుతున్నారు. 


  రాష్ట్ర ప్రభుత్వం గెస్ట్‌ లెక్చరర్ల సమస్యలు పరిష్కరించాలి

- పంచకోటి బాలయ్యచారి, టీజీఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు 


ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు గెస్ట్‌లెక్చరర్లను రెగ్యులరైజ్‌ చేశాయి. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో గెస్ట్‌లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించారు. మన  రాష్ట్రంలో మాత్రం రెగ్యులరైజ్‌ చేయక పోగా కనీసం గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను గౌరవించి గెస్ట్‌లెక్చరర్‌గా కొనసాగిస్తూ ఉద్యోగాలను రెన్యూవల్‌ కూడా చేయలేదు.  రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది మంది జూనియర్‌, డిగ్రీ కళాశాలల గెస్ట్‌లెక్చరర్లు ఇప్పటి వరకు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీటికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అరకొర వేతనాలతో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులకు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడిచినా తిరిగి విధుల్లోకి తీసుకోక పోవడంతో మనోవేదనకు లోనవుతున్నారు. గత సంవత్సరం బకాయిలు చెల్లించక పోవడం, ఈ సంవత్సరం విధుల్లోకి తీసుకోకపోవడంతో ఆకలితో అలమటిస్తూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇతర రాష్ట్రాల ప్రజలను ఆదుకుంటున్న సీఎం కేసీఆర్‌ స్వరాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న అతిథి అధ్యాపకులను ఆదుకోవాలి.

Updated Date - 2022-09-06T05:28:30+05:30 IST