అభేద దర్శనమ్‌ జ్ఞానమ్‌

ABN , First Publish Date - 2020-06-25T07:59:39+05:30 IST

‘‘పార్థా! ద్రవ్యమయమైన యజ్ఞం కంటే జ్ఞానమయ యజ్ఞం శ్రేష్ఠం. అన్ని కర్మలూ, సర్వ విషయాలూ జ్ఞానంనందే పరిసమాప్తమవుతాయి’

అభేద దర్శనమ్‌ జ్ఞానమ్‌

శ్రేయాన్‌ ద్రవ్యమయా ద్యజ్ఞాత్‌ జ్ఞానయజ్ఞః పరంతప

సర్వం కర్మాఖిలం పార్థ, జ్ఞానే పరిసమాప్యతే


‘‘పార్థా! ద్రవ్యమయమైన యజ్ఞం కంటే జ్ఞానమయ యజ్ఞం శ్రేష్ఠం. అన్ని కర్మలూ, సర్వ విషయాలూ జ్ఞానంనందే పరిసమాప్తమవుతాయి’ అని భగవానుని ఉపదేశం. జ్ఞానికి బ్రహ్మాండమంతా తన కుక్షి (పొట్ట)యందున్నట్లే ఉంటుంది. ప్రపంచంలోని దేహాలన్నీ తనవిగానే ఎంచుతాడు. ఆ స్థితిలో సుఖదుఃఖాలు, శీతోష్ణాదులు దేహానికి సంభవించినట్లు భావించడు. వాయువు తన స్వభావమైన చలనాన్ని, సూర్యుడు తనకు సహజమైన ప్రకాశాన్ని, జలం తన స్వభావమైన చల్లదనాన్ని వదలనట్లే.. ఆత్మజ్ఞాని తనదైన దైవ భావాన్ని త్యజించడు. అజ్ఞానావస్థలో మాత్రమే ఇంద్రియ వృత్తులు స్ఫురిస్తాయి. ఆత్మోదయం కలిగిన జ్ఞాన దశలో స్ఫురించవు.


అజ్ఞాన సర్పదష్టస్య బ్రహ్మ జ్ఞానౌషధం వినా

కిము వేదైశ్చ శాస్రైశ్చ కిము మంత్రైః కిమౌషధైః

అని ‘వివేక చూడామణి’లో ఆదిశంకరుల బోధ. ‘‘అజ్ఞానం అనే పాము కాటుకు బ్రహ్మజ్ఞానమే ఔషధం. అది తప్ప మరో ఔషధం లేదు. అజ్ఞాన సర్పదష్టుడయి విలపిస్తున్న జీవుడు ఆత్మానుభవంతో మాత్రమే శాంతినొందగలడు. అటువంటి వాడికి వేదాలు, మంత్రాలు, శాస్త్రాలు పని చెయ్యవ’’ని దీని భావం. ఎవరి అజ్ఞానం ఆత్మజ్ఞానం చేత నిర్మూలింపబడుతుందో, వారికి ఆ జ్ఞానం సూర్యునివలె ప్రకాశించి పరమార్థతత్వాన్ని చూపుతుంది. ‘‘జ్ఞానం దేవతు కైవల్యమ్‌’’ అని శ్రుతి వాక్యం. భేద బుద్ధిగల జీవులు (అందరిలోనూ ఆ పరమాత్మే నిండి ఉన్నాడన్న విషయం తెలియక భేదం చూపేవారు) అజ్ఞానంతో తమను మరచి మళ్లీ మళ్లీ జననాది దుఃఖాలను పొందుతున్నారు. సూర్యకిరణాలు చీకట్లను పారద్రోలి, ప్రాణులకు సుఖాన్నిచ్చినట్లుగా.. అజ్ఞానం అనే చీకటిని జ్ఞానమనే కిరణం పారద్రోలుతుంది. కనుక జ్ఞానం వల్లనే ముక్తి. జ్ఞానం అజ్ఞానంతో ఆవరింపబడి ఉండడం వల్లనే జీవులు మోహానికి గురవుతున్నారు. ‘‘అజ్ఞానమే భేదబుద్ధినిస్తుంది. జ్ఞానం సమబుద్ధినిస్తుంది. జీవితేచ్ఛ ఎక్కువగా ఉన్న మానవుడికి జ్ఞానం లభించదు. ఎంత వరకు ఆ ఆసక్తి తగ్గించుకుంటాడో అందుకు తగినట్టుగా జ్ఞానాభివృద్ధి పొందగలడు.’’ అంటారు శ్రీ రామకృష్ణ పరమహంస.


జ్ఞానిది ఆత్మ దృష్టి లేదా బ్రహ్మ దృష్టి. అంటే.. అన్నింటిలోనూ ఆత్మను దర్శించడం. అన్నింటి మూలమైన స్థితికి వెళ్లి బ్రహ్మమొక్కటే సత్యం, మిగిలినవన్ని అసత్యములని గ్రహించడం. అందుకే అన్నమయ్య ‘బ్రహ్మమొక్కటే’ అంటూ కీర్తనలో చాటాడు. అజ్ఞాని మాయకు లోబడి భేద బుద్ధి కలిగి ఉంటాడు. జ్ఞాని ఆ భేదాలన్నీ అసత్యమని గ్రహిస్తాడు. ఇదే జ్ఞానికి అజ్ఞానికి గల భేదం. అభేద దర్శనమ్‌ జ్ఞానమ్‌. ఆత్మజ్ఞానమొక్కటేమానవుని సంసార జాలం నుండి విముక్తి పొందింపగలదు. ‘‘సత్త్వాత్‌ సంజాయతే జ్ఞానమ్‌’’.. సత్త్వ గుణం గలవారికే జ్ఞానం సిద్ధిస్తుంది. గడ్డి కుప్పను అగ్ని దహించివేసినట్లు జ్ఞానాగ్ని పాపరాశిని భస్మం చేస్తుంది. జ్ఞానాన్నిమించిన పవిత్ర పదార్థం వేరొకటి లేదు. బుద్ధి.. జ్ఞానం వైపు పయనించే కొద్దీ మనుష్యతత్వం వికసిస్తుంది. ఉత్తమ జ్ఞానంచే బోధితమైన నిర్మల చిత్తమే మోక్షంగా సిద్ధిస్తుంది.



- మేఘశ్యామ (ఈమని) 8332931376

Updated Date - 2020-06-25T07:59:39+05:30 IST