ఏ పిల్లి తెలివైనది?

ABN , First Publish Date - 2021-02-23T06:21:03+05:30 IST

శ్రీకృష్ణదేవరాయల సభలో ఒకరోజు జంతువుల తెలివితేటల గురించి చర్చ మొదలైంది. అప్పుడు ‘‘పిల్లులు చాలా తెలివైనవి’’ అని ఒక మంత్రి అన్నారు. సభలో ఉన్నవారంతా ఆ మంత్రితో ఏకీభవించారు...

ఏ పిల్లి తెలివైనది?

శ్రీకృష్ణదేవరాయల సభలో ఒకరోజు జంతువుల తెలివితేటల గురించి చర్చ మొదలైంది. అప్పుడు ‘‘పిల్లులు చాలా తెలివైనవి’’ అని ఒక మంత్రి అన్నారు. సభలో ఉన్నవారంతా ఆ మంత్రితో ఏకీభవించారు. అంతేకాదు ప్రతి ఒక్కరూ తమ పిల్లి బాగా తెలివైనదని చెప్పసాగారు. దాంతో శ్రీకృష్ణదేవరాయలు ఎవరి పిల్లి తెలివైనదో తెలుసుకోవాలనే కుతూహలంతో ఒక పోటీ పెట్టాలనుకున్నారు. ‘ఏ పిల్లి అయితే మిగతా పిల్లుల కన్నా భిన్నమైన పని చేస్తుందో, ఆ పిల్లి విజేత’ అని ప్రకంటించారు. ఆ మరుసటి వారం అందరూ తమ పిల్లులను వెంట తీసుకొని సభకు వచ్చారు. తెనాలి రామకృష్ణుడు కూడా తన పిల్లితో వచ్చాడు.


రాజుగారు పోటీకి ముందు పిల్లులకు చిన్న విందు ఇవ్వాలనుకున్నారు. పిల్లులకు బంగారు పల్లెంలో పాలు పోశారు. పాలను చూడగానే అన్ని పిల్లులు పరుగున బంగారు పల్లెం దగ్గరకు వెళ్లాయి. కానీ ఒక్క పిల్లి మాత్రం పాలకు దూరంగా జరిగింది. ఆ పిల్లి వింత ప్రవర్తన చూసి రాజుతో సహా అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు రామకృష్ణుడు నవ్వుతూ ‘‘మహారాజా! అన్ని పిల్లులు పాల వైపు పరుగెత్తాయి. కానీ నా పిల్లి మాత్రం ఏ పిల్లి చేయని పని చేసింది’’ అన్నాడు. కృష్ణదేవరాయలు రామకృష్ణుడి పిల్లిని విజేతగా ప్రకటించాడు. రామకృష్ణుడు తన పిల్లికి ఎలా శిక్షణ ఇచ్చాడో తెలుసుకోవాలన్న ఆసక్తి సభికులలో కలిగింది. ‘‘నేను నా పిల్లికి మంచి పాలు తాగించాలని పాలను బాగా మరిగించాను. తరువాత వాటిని ఒక పల్లెంలో పోసి చల్లారబెట్టాను. అయితే పాలను చూడగానే నా పిల్లి పరుగున వచ్చి పల్లెంలో మూతి పెట్టింది. నేను ఆపుదామని చూసే లోపే అది మూతి కాల్చుకుంది. ఆ రోజు నుంచి పాలను చూడగానే దూరంగా వెళ్లడం మొదలెట్టింది’’ అని రామకృష్ణుడు చెప్పగానే మహారాజుతో సహా అందరూ నవ్వుకున్నారు.

Updated Date - 2021-02-23T06:21:03+05:30 IST