తాగునీటిపై తోడేళ్ల కన్ను

ABN , First Publish Date - 2020-06-04T10:08:27+05:30 IST

నల్లగొండ, నకిరేకల్‌ నియోజకవర్గాలకు తాగునీరు అందించే ఉదయసముద్రంపై బడాబాబుల కన్నుపడింది.

తాగునీటిపై తోడేళ్ల కన్ను

ఉదయసముద్రం నీళ్ల లూటీ

అక్రమంగా పైప్‌లైన్లు, వందల ఎకరాలకు సాగునీరు

పెద్దల అండతో రైతులపై దౌర్జన్యం, 

రియల్టర్‌ మాయాజాలం


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-నల్లగొండ)

నల్లగొండ, నకిరేకల్‌ నియోజకవర్గాలకు తాగునీరు అందించే ఉదయసముద్రంపై బడాబాబుల కన్నుపడింది. నిబంధనలకు విరుద్ధంగా కాల్వలు తవ్వి భారీ పైప్‌లైన్లతో వందల ఎకరాల సాగుకు తరలించుకుపోతున్నారు. అసైన్డ్‌, పోరంబోకు భూములు ఆధీనంలోకి తీసుకోవడం, సాగునీటి సౌకర్యం కల్పించి అధిక ధలకు విక్రయించడం నల్లగొండ మండలానికి చెందిన ఓ పెద్దమనిషి రివాజుగా మారింది. గతంలో పది, ఇరవై ఎకరాల్లో సాగించిన వ్యవహారం తాజాగా ఏకంగా 250 ఎకరాలకు ఉదయసముద్రం నీళ్లు మళ్లించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తమ భూముల్లోంచి ప్రైవేటు వ్యక్తులు పైప్‌లైన్లు వేయడం ఏంటని సన్న, చిన్నకారు రైతులు ప్రశ్నిస్తే అధికారబలంతో ఆ గొంతులను నొక్కేస్తున్నారు.


తాగునీటి అవసరాలకు ఇబ్బందే

నల్లగొండ, నకిరేకల్‌ నియోజకవర్గంలోని లక్షలాది ప్రజల తాగునీటి అవసరాలను ఉదయసముద్రం తీరుస్తోంది. ఈప్రాజెక్టు ప్రాధాన్యతను గుర్తించిన అధికారులు, పాలకులు గత ఆరేళ్లుగా ఈ ప్రాజెక్టుకు నీళ్ల ఇబ్బందిలేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదే అదునుగా భావించిన కొందరు చిన్న, సన్నకారు రైతులు ఉదయసముద్రం బ్యాక్‌వాటర్‌లో పైపులువేసి మోటర్ల ద్వారా తమ పొలాలకు సాగునీరు మళ్లించుకుంటున్నారు. ఈవ్యవహారంతో కరువుకాలంలో తాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతుండటంతో కలెక్టర్‌ ఆదేశంమేరకు నల్లగొండ రూరల్‌ మండలం పరిధిలోని దండెంల్లి ప్రాంతంలో 11కేవీ సబ్‌స్టేషన్‌ సైతం మరోచోటికి మార్చారు. కొత్తగా రైతులు విద్యుత్‌ కనెక్షన్‌కోసం దరఖాస్తు చేసినా స్థానిక విద్యుత్‌శాఖ ఏఈ ఫీల్డ్‌ విచారణ చేసి, ఉదయసముద్రం నీటికి ఇబ్బంది లేదని ధ్రువీకరిస్తేనే ఇక్కడ విద్యుత్‌ కనెక్షన్‌ మంజూరవుతుంది.


అలాంటి దండెంపల్లి గ్రామానికి చెందిన ఓ బడాబాబు గతంలో స్థానిక భూములకు ఉదయసముద్రం నీళ్లు మళ్లించి మంచి రేట్లకు ఇతరులకు విక్రయించారు. ఇందులో భారీగా గిట్టుబాటు ఉండటంతో తాజాగా 250 ఎకరాలకు అక్రమంగా నీటిని మళ్లించే పనిని యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. 5 ఇంచుల సామర్థ్యం కలిగిన పైపులతో పదిలైన్లు వేస్తున్నారు. మొత్తం 200పైగా పైపులు వేయడం ప్రారంభించారు. చెరువుగర్భం నుంచి పైపులు వేసేందుకు ఎక్స్‌కవేటర్‌తో కాల్వలు తవ్వడం ఓ వైపు, పైపులు వేసుకుంటూ రావడం మరోవైపు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఓ భారీ పరిశ్రమకు అవసరమయ్యే స్థాయిలో నీటిని తరలించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. తమకు ఉన్నదే కొద్దిభూమి అందులోంచి పైప్‌లైన్లు ఏంటని? స్థానిక రైతులు ప్రశ్నిస్తే దౌర్జన్యమే. పైపులు వేయడం అక్రమం అని తెలిసినా స్థానిక రైతులు నోరు విప్పడం లేదంటే సదరు పెద్దమనిషి పలుకుబడి ఇట్టే తెలిసిపోతుంది.


గతంలో పైపులువేసి నీటిని తరలించి భూములు అమ్మినా, తాజాగా 250 ఎకరాలకు నీళ్లు మళ్లించే పనులు నిబంధనలకు విరుద్ధంగా జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో సాగుతున్నా నీటిపారుదల శాఖ అధికారులు మౌనం పాటించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యహహారంపై చిన్ననీటి పారుదలశాఖ ఎస్‌ఈ హమీద్‌ ఖాన్‌ వివరణ కోరగా ‘ఉదయసముద్రం నీళ్లు తరలించడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదు, నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించే వారిపై చట్టరీత్యా క్రిమినల్‌ చర్యలు తీసుకుంటాం’ అన్నారు. 

Updated Date - 2020-06-04T10:08:27+05:30 IST