మహిళలకు పనిభారం పెరిగింది

ABN , First Publish Date - 2021-04-08T05:12:32+05:30 IST

తరగతి గదిలో పాఠాలు చెప్పడం కంటే సామాజిక చైతన్యం రగిలించేందుకే ఆమె ప్రాధాన్యం ఇచ్చారు. మారుమూల పల్లెలు, గిరిజన గూడేల్లో పర్యటించి, పరిశోధించి... వ్యవసాయ రంగంలో ఆడవారు ఎదుర్కొంటున్న సవాళ్లను వెలుగులోకి తెచ్చారు

మహిళలకు పనిభారం పెరిగింది

తరగతి గదిలో పాఠాలు చెప్పడం కంటే సామాజిక చైతన్యం రగిలించేందుకే ఆమె ప్రాధాన్యం ఇచ్చారు. మారుమూల పల్లెలు, గిరిజన గూడేల్లో పర్యటించి,  పరిశోధించి... వ్యవసాయ రంగంలో ఆడవారు ఎదుర్కొంటున్న సవాళ్లను వెలుగులోకి తెచ్చారు. కరోనా వల్ల నష్టపోయిన... పోతున్న మహిళల పరిస్థితులపై అధ్యయనం చేశారు... సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ (సెస్‌) తొలి మహిళా డైరెక్టర్‌ ఆచార్య ఎల్లంకి రేవతి. ఆ విశేషాలు ‘నవ్య’తో పంచుకున్నారు... 


ప్రాజెక్టు కోసం మారుమూల పల్లెలకూ, గిరిజన ప్రాంతాలకూ వెళుతుంటా. కొన్నిసార్లు అక్కడ కొద్దిరోజులు ఉండాల్సి వస్తుంది. అలాంటప్పుడు మహిళా పరిశోధకులకు ఎదురయ్యే ప్రధాన సమస్య మౌలిక వసతుల లేమి. 


ఆయన స్ఫూర్తితో...

మా సొంతూరు వరంగల్‌ జిల్లా లేబర్తి. అయితే, నా చదువంతా హన్మకొండలో సాగింది. ఎగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, పెరిగిన నాకు సమాజాన్ని అర్థం చేసుకోవడంలో మా ఆయన బియ్యాల జనార్దనరావు స్ఫూర్తి. తెలంగాణ మలిదశ పోరాటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ సూత్రీకరించింది కూడా జనార్దనరావే. ఆయన కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తూ ఆదివాసీ, గిరిజనుల మీద పలు విలువైన పరిశోధనలు చేశారు. అలాంటి అరుదైన వ్యక్తి 2002లో గుండె పోటుతో కన్నుమూశారు. తదుపరి నా భర్త పేరిట ఫౌండేషన్‌ను నెలకొల్పాను. తద్వారా ఆయన మొదలుపెట్టిన కొన్ని రచనలను, అనువాదాలను పూర్తిచేసి, పుస్తకాలుగా తీసుకొచ్చాం. ఏటా ఆదివాసి, గిరిజనులపై వెలువడే పరిశోధనలను ప్రచురిస్తున్నాం.


స్వయంప్రతిపత్తిగల ఒక సామాజిక, ఆర్థిక శాస్త్రాల పరిశోధనా సంస్థ ‘సెస్‌’. ఇందులో చాలా పేరున్న ఆర్థికవేత్తలు బోర్డాఫ్‌ గవర్నర్లుగా ఉన్నారు. ‘ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్స్‌ రీసెర్చ్‌ కేంద్రాని’కి అనుబంధంగా సాగే ‘సెస్‌’ సర్వేలకు కచ్చితత్వం ఉంటుంది. అలాంటి ఒక ప్రముఖ సంస్థకు డైరెక్టర్‌ కావడమంటే మాటలు కాదు. అప్పటి వరకూ పరిపాలనా పరమైన అనుభవం లేని నేను కొత్త హోదాలో సమర్థవంతంగా పనిచేయగలనా అనే బెరుకు మొదట్లో ఉండేది. కానీ పని చేస్తూపోతున్న క్రమంలో ఆ భయాలన్నీ పోయాయి. ‘సెస్‌’ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి రెండేళ్లయింది. ఈ రెండేళ్లలో సంస్థ అభ్యున్నతికి తోడ్పడే పలు కీలక నిర్ణయాలను తీసుకోకలిగాను. ముఖ్యంగా కొవిడ్‌ సమయంలోనూ మా పరిశోధనలను కొనసాగించాం. 


కొవిడ్‌ పరిస్థితులపై అధ్యయనం... 

‘తెలంగాణ డెవలెప్‌మెంట్‌ సిరీస్‌’ పేరుతో పన్నెండు అంశాలపై అధ్యయనం చేసే బాధ్యత తీసుకున్నాం. అప్పట్లో బడ్జెట్‌ కేటాయింపుల్లో ‘సెస్‌’కు అంత ప్రాధాన్యత ఉండేది కాదు. ఈ ఏడాది ఆ సమస్యనూ అధిగమించాం. ఈ మధ్య కాలంలో ఉన్నత విద్యామండలితో కలిసి విద్యారంగంపై ప్రత్యేక అధ్యయన విభాగాన్ని ప్రారంభించాం. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కోరడంతో తెలంగాణలో వివిధరంగాలపై లాక్‌డౌన్‌ నష్టాన్ని అంచనా వేస్తూ, ఒక సర్వే నిర్వహించాం. కరోనా వల్ల రాష్ట్రం సుమారు రూ.70వేల కోట్ల ఆదాయం కోల్పోయినట్లు అందులో తేలింది. ఎస్సీ, ఎస్టీ వర్గాలమీద కొవిడ్‌ ఎంతగా ప్రభావం చూపిందో కూడా అధ్యయనాలు చేశాం. కరోనాను ఎదుర్కోవడంలో ఇతర రాష్ట్రాలు అవలంభించిన పద్ధతుల మీద మరొక రీసెర్చీ పేపర్‌ రూపొందించాం. 


అధికమైన గృహహింస... 

అలాగే ‘యంగ్‌ లైవ్స్‌’ ప్రాజెక్టులో భాగంగా యువతతో కొవిడ్‌ ప్రభావంపై మాట్లాడాం. అందులో 19 ఏళ్లు, 26 ఏళ్ల వయస్కులు మూడు వేల మంది పాల్గొన్నారు. కరోనా వల్ల చాలామంది జీవనోపాధి కోల్పోయారు. అయితే, కొందరు చిన్న, మధ్యతరహా పరిశ్రమల నుంచి వ్యవసాయ రంగ పనుల వైపు మళ్లారు. మహిళలు ఎక్కువగా ఉద్యోగాలు కోల్పోయారు. ఆడవారికి ఇంట్లో పని భారం అధికమైంది. గృహహింస కూడా పెరిగిందని మా అధ్యయనంలో తేలింది. అలాగే తెలంగాణ బీసీ కమిషన్‌ కోరిక మేరకు ‘సోషియో ఎకనామిక్‌ కండిషన్స్‌ ఆఫ్‌ బ్యాక్‌వర్డ్‌ క్యాస్ట్స్‌ ఇన్‌ తెలంగాణ’ అంశంపై ఒక అధ్యయనం చేశాం. అందులో బీసీ కులాలకు ఉపకులాలుగా ఉన్న పద్దెనిమిది కులాల సోషియో ఎకనామిక్‌ నివేదిక తయారు చేసి ఇచ్చాం. మా రిపోర్టు ఆధారంగా ఆ ఉపకులాలను తెలంగాణ ప్రభుత్వం బీసీలుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేయడం సంతోషకరం.  


అది వ్యక్తిత్వవికాస పుస్తకాల్లో దొరకదు... 

ప్రపంచ బ్యాంకు మూవింగ్‌ అవుట్‌ ఆఫ్‌ పావర్టీ ప్రాజెక్టులో భాగంగా రైతు ఆత్మహత్యల కుటుంబాల్లోని మహిళల స్థితిగతులపైనా సర్వే నిర్వహించాం. అందులో భాగంగా వందమంది బాధిత మహిళలను కలిసి, వివరాలు సేకరించా. వారి కన్నీటి గాథలు గుర్తొస్తే ఇప్పటికీ నాకు నిద్ర పట్టదు. వాళ్లను సమాజం, ప్రభుత్వం కేవలం బాధితురాళ్లుగా మాత్రమే చూస్తాయి. అంతకు మించి, మహిళా రైతులుగా మాత్రం గుర్తించవు. అయినా, వాళ్లు ఆత్మస్థైర్యంతో అడ్డంకులన్నీ ఎదుర్కొంటూ తమ పిల్లల కోసం జీవితాన్ని ముందుకు సాగించడం చూశాను. వ్యక్తిత్వవికాస పుస్తకాల్లో దొరకని ఆత్మస్థైర్యం ఆ బాధిత మహిళల్లో కనిపిస్తుంది. అదే నన్ను కదిలించింది.


సవాళ్లు... సమస్యలెన్నో... 

సామాజిక, ఆర్థికశాస్ర్తాల అధ్యయనం కోసం తీసుకున్న శాంపిల్స్‌ను సరైన విధంగా విశ్లేషించినప్పుడే ఆ పరిశోధనకు కచ్చితత్వం వస్తుంది. అలా జరగాలంటే నేను ఫీల్డుకు వెళ్లి, ప్రజలతో మాట్లాడినప్పుడే సాధ్యం. అలా నా ప్రాజెక్టు పరిధిమేరకు మారుమూల పల్లెలకూ, ఆదివాసీ, గిరిజన ప్రాంతాలకూ వెళుతుంటా. కొన్నిసార్లు అక్కడ కొద్దిరోజులు ఉండాల్సి వస్తుంది కూడా. అలాంటప్పుడు మహిళా పరిశోధకులకు ఎదురయ్యే ప్రధాన సమస్య మౌలిక వసతుల లేమి. ఒక స్టడీ కోసం నేను భద్రాచలం వద్ద కూనవరం, చింతూరు ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. మూడు రోజులు అక్కడే ఉన్నాను కూడా. ఆ ఊర్లలో ఒక్క మరుగుదొడ్డి కూడా లేదు. ఫీల్డు సర్వే అంటే, ముందుగానే అన్నం తక్కువ తినడం, నీళ్లు తాగకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకొని బయలుదేరతాం. 


కొత్త సాగు చట్టాలపై... 

ఆధారు కార్డ్‌ వచ్చిన కొత్తల్లో కొంత గందరగోళాలు నెలకొన్నాయి. కానీ ఆధార్‌ వల్ల మహిళలకు ప్రత్యేక గుర్తింపు లభించింది. అంతకు ముందు వరకూ రేషన్‌కార్డు వంటి గుర్తింపు కార్డుల్లోనూ ఇంటి యజమానికి మహిళ అనుసంధానమై ఉండేది. ఆధార్‌ మహిళలకు ఎలాంటి గుర్తింపు తెచ్చిందో తెలుసుకొనే క్రమంలో ప్రముఖ సామాజిక, ఆర్థిక శాస్త్రవేత్త గోవింద్‌ కేల్‌కర్‌తో పాటు నేనూ మరొకరు కలిసి అధ్యయనం చేశాం. ఆ నివేదిక ‘ఆధార్‌ అండ్‌ జండెర్‌ ఐడెంటిటీ’ పేరుతో పుస్తకంగా వచ్చింది. ఆధారు కార్డ్‌ ఆడవాళ్ల అస్తిత్వానికి ఒక చిహ్నం అనడంలో సందేహం లేదు. అలాగే కేంద్రం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాల అమలుతో తెలంగాణలో ఎలాంటి మార్పులు చోటుచేసు కోనున్నాయనే అంశంపైనా ప్రస్తుతం ఒక అధ్యయనం నిర్వహిస్తున్నాం.




జాతీయ స్థాయి సంస్థగా...

‘సెస్‌’ పరిశోధనా ఫలితాలను జనబాహుళ్యంలోకి తీసుకెళ్లడంలో మా పరిమితత్వాన్నీ గుర్తించాం. చాలా సందర్భాల్లో ఒక స్టడీ అయిపోగానే, మరొక సర్వేలో నిమగ్నమవుతాం. దాంతో మేము రూపొందించిన నివేదికలను సామాన్యులకు అర్థమయ్యేలా అందించడంలో విఫలమవుతున్నాం. అయితే, ఈ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నాం. ‘సెస్‌’ తెలంగాణకే పరిమితం కాదు. జాతీయ, అంతర్జాతీయ అంశాలపైన పరిశోధనలు జరుగుతాయి. ‘సెస్‌’ను మరింత పటిష్టపరచాలనేది నా లక్ష్యం.  డెవలప్‌మెంట్‌ స్టడీస్‌పై పీహెచ్‌డీ కోర్సులనూ అందిస్తున్నాం. అందుకోసం దేశ నలుమూలల నుంచి విద్యార్థులు మావద్దకు వస్తుంటారు. వ్యవసాయ రంగంపై మరిన్ని పరిశోధనలకు ‘సెస్‌’ వేదిక కావాలి. ఈ క్రమంలో ప్రొ.జయశంకర్‌ వ్యవసాయ యూనివర్సిటీ, ఇక్రిశాట్‌ తదితర సంస్థలతోనూ అనుసంధానమయ్యాం. 

కారుసాల వెంకటేశ్‌ 

Updated Date - 2021-04-08T05:12:32+05:30 IST