ఆ గుడిలో యాదవులే పూజారులు

ABN , First Publish Date - 2021-02-26T06:21:20+05:30 IST

సూర్యాపేట జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో చివ్వేంలం మండలంలోని దురాజ్‌పల్లి గ్రామానికి సమీపాన గొల్లగట్టుపై శ్రీ లింగమంతుల స్వామి...

ఆ గుడిలో యాదవులే పూజారులు

సూర్యాపేట జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో చివ్వేంలం మండలంలోని దురాజ్‌పల్లి గ్రామానికి సమీపాన గొల్లగట్టుపై శ్రీ లింగమంతుల స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో అర్ధ సంచారజాతికి చెందిన యాదవులే పూజారులుగా ఉండడం గొప్ప విషయం. యాదవ కులానికి చెందిన మున్నా, మెంతబోయిన, మట్ట, తండు వంశీయులు వంశపారంపర్యంగా నేటికీ ఇక్కడ పూజారులుగా కొనసాగుతున్నారు.


స్థానికుల కథనం ప్రకారం మొదట శ్రీ లింగమంతుల స్వామి ఆలయం ఉండ్రుగొండ సమీపంలోని పెద్దగట్టుపై ఉండేది. పూర్వం ఆ ప్రాంతంలో దట్టమైన అభయారణ్యం ఉండేది. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన గొల్లలు, ముఖ్యంగా కేసారం గ్రామానికి చెందిన చెందినవారు తమ గొర్రెల మందలను పెద్దగట్టు అటవీ ప్రాంతంలో మేపేవారు. ఈ ప్రాంతంలో అధికసంఖ్యలో ఉన్న క్రూరమృగాలు మేత కోసం వచ్చిన గొర్రెలు, మేకలను వందల సంఖ్యలో చంపి తినేవి. గొల్లలు దిక్కుతోచని స్థితిలో తమ పశుసంపదను క్రూరమృగాల బారినుంచి కాపాడాలని శివుడిని ‘ఓ లింగ.. ఓ లింగ...’ అంటూ వేడుకున్నారు. దీంతో శివుడు లింగమంతుల స్వామిగా, త్రిశూలధారియై గుర్రంపై వచ్చి ఈ ప్రాంతంలోని క్రూరమృగాలను వధించసాగాడు. ఎన్ని క్రూరమృగాలను వధించినా, వాటి రక్తపు చుక్క భూమిపై పడగానే రాక్షస అనుగ్రహంతో మళ్ళీ అవి పుడుతుండేవి. వాటిని వధించడంలో శివుడు అలసిపోగా, అతడి చెమట బండ మీద పడటంతో చౌడమ్మ తల్లి జన్మించింది. ఆమె క్రూరమృగాల రక్తం నేలపై పడకుండా తన నాలుకను ఆకాశమంత చేసి నాకడంతో క్రూరమృగాలన్నీ మృతి చెందాయి. దీంతో గొల్లలు తమ పశువులను రక్షించిన లింగమంతుల స్వామి, చౌడమ్మ తల్లి విగ్రహాలు ప్రతిష్టించుకొని పెద్దగట్టుపై ఆలయం నిర్మించి పూజలు చేయడం మొదలుపెట్టారు. అలాగే రెండేళ్ళకొకసారి ఘనంగా జాతరను నిర్వహించుకొనేవారు. దీన్నే ‘పెద్దగట్టు జాతర’, ‘శ్రీ లింగమంతుల స్వామి జాతర’ అని పిలుస్తారు. కొన్నేళ్ళకు జాతర జరిగే సమయంలో గొల్లకులానికి చెందిన గర్భిణీ పెద్దగట్టు మెట్లపై నుంచి కాలు జారి మరణించటం వల్ల గొల్లలు ఈ ఆలయాన్ని అక్కడి నుంచి ప్రస్తుతం ఉన్న గొల్లగట్టుకు మార్చినట్లు తెలుస్తోంది. ఇక్కడ కూడా యాదవులు సంప్రదాయంగా ప్రతిరోజూ శ్రీ లింగమంతుల స్వామికి, చౌడమ్మ తల్లికి పూజలు చేస్తూ రెండేళ్ళకొకసారి జాతరను ఘనంగా నిర్వహిస్తారు. ఈ నెల 28 నుంచి మార్చి 4 వరకు జరగనున్న ఈ జాతర తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందింది. ఈ ఆలయంలో యాదవ కులానికి చెందిన మున్నా, మెంతబోయిన, మట్ట, తండా వంశంవారు వివిధ వృత్తులు, ఉద్యోగాలు చేస్తూనే వంతులవారీగా పూజారులుగా పని చేస్తారు. వీరు ‘ఓ లింగ.. ఓ లింగ...’ అనే నామం మాత్రమే జపిస్తూ, యాదవ కుల సంప్రదాయ పద్ధతిలో పూజలు చేస్తారు. ఎలాంటి కానుకలు అడగరు. భక్తిభావంతో మెలగుతారు. 


గతంలో యాదవుల చేతిలో ఉన్న ఈ ఆలయం ప్రస్తుతం దేవాదాయశాఖ పరిధిలో ఉంది. ఈ ఆలయం నుంచి మామూలు సమయంలోను, జాతర సమయంలోను పెద్ద ఎత్తున ఆదాయం ప్రభుత్వానికి వెళుతోంది. అయినా ఈ ఆలయంలో పూజారులుగా పనిచేసేవారికి ప్రభుత్వం చిల్లిగవ్వ ఇవ్వకపోవడం శోచనీయం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వం అన్ని ఆలయాల్లోని పూజారులనూ ఉద్యోగులుగా గుర్తించి వారికి నెల జీతాలు ఇస్తున్నది. కానీ పెద్దగట్టు ఆలయం యాదవ పూజారులను ప్రభుత్వం ఉద్యోగులుగా ఎందుకు గుర్తించడం లేదు? ఇకనైనా వీరిని ఉద్యోగులుగా గుర్తించి, నెల జీతాలు ఇచ్చి వారికి తగిన న్యాయం జరిగేలా ప్రభుత్వం చొరవ చూపాలి. వీలైతే జాతర ఆదాయంలో కూడా వాటా ఇవ్వాలి. ఆలయ సమీపంలో వీరికి నివాసం కోసం ఇండ్లు నిర్మించాలి. జాతర సమయంలో తాత్కాలిక ఏర్పాట్లు కాకుండా, ఆలయ పరిసరాలలో శాశ్వత ఏర్పాట్లు చెయ్యాలి. శ్రీ లింగమంతుల స్వామి ఆలయ క్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధిపరచాలని యాదవ కులపెద్దలు, నాయకులు, మేధావులు కోరుతున్నారు.

డా. పోతరవేని తిరుపతి యాదవ్‌

కాకతీయ యూనివర్సిటీ, వరంగల్‌

Updated Date - 2021-02-26T06:21:20+05:30 IST