వైసీపీ పాలన అవినీతి మయం

ABN , First Publish Date - 2021-07-29T05:14:10+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ పాలనలో అవినీతి, అరాచకం రాజ్యమేలుతోందని ప్రశ్నించేవారిపై దాడులకు తెగబడుతూ దుర్మార్గపు పాలనకు తెరలేపారనిటీడీపీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసులరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు.

వైసీపీ పాలన అవినీతి మయం
అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం అందజేస్తున్న టీడీపీ నేతలు

ప్రశ్నిస్తే దాడులకు పాల్పడతారా

టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసులరెడ్డి

కడప (ఆంధ్రజ్యోతి), జూలై 28: రాష్ట్రంలో వైసీపీ పాలనలో అవినీతి, అరాచకం రాజ్యమేలుతోందని ప్రశ్నించేవారిపై దాడులకు తెగబడుతూ దుర్మార్గపు పాలనకు తెరలేపారనిటీడీపీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసులరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లాలోని ఫారెస్టులో వైసీపీ నేతల అక్రమ మైనింగ్‌ను పరిశీలించేందుకు వెళ్లిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వైసీపీ గుండాలు దాడి చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. వైసీపీ నేతలు ప్రజాసంపదను దోచుకుంటున్నారని అక్రమాలను నిలదీసిన టీడీపీ నేతలను అంతం చేసేందుకు వైసీపీ తెగించిందని తెలిపారు. రాష్ట్రంలో ఒక మాజీ మంత్రికి రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఎన్ని బెదిరింపులు, ఎన్ని దాడులు చేసినా తాము వెనక్కు తగ్గేది లేదని తెలిపారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అరెస్టు అన్యాయమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.


దేవినేని ఉమా అరెస్టు దారుణం

అటవీ సంపదను కొల్లగొడుతున్న వైసీపీ నేతల అక్రమాలను నిలదీసేందుకు వెళ్లిన మాజీమంత్రి దేవినేని ఉమాపై దాడి చేయడం దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమాపై దాడికి నిరసనగా బుధవారం కడపలోని ఆర్టీసీ బస్టాండు వద్ద అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. దాడిచేసినవారిని అరెస్టు చేయకుండా టీడీపీ నేతలపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయడం ప్రభుత్వ పిరికిపంద చర్య అన్నారు. కార్యక్రమంలో ఉపాధి హామీ మాజీ కౌన్సిల్‌ సభ్యులు పీరయ్య, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శులు సుధాకర్‌, సురేష్‌, రాంప్రసాద్‌, జనార్దన, మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.


సిగ్గుమాలిన చర్య : సాయినాథశర్మ

కమలాపురం(రూరల్‌), జూలై 28: మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వైసీపీ నేతలు దాడి చేయడం సిగ్గుమాలిన చర్య అని, దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీభట్ల సాయినాథశర్మ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. ఈ రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు.

Updated Date - 2021-07-29T05:14:10+05:30 IST