ప్రేమ కోసమై..

ABN , First Publish Date - 2021-06-02T09:34:54+05:30 IST

ప్రేమించిన అమ్మాయిని కలుసుకోవడం కోసం కాలినడకన వేల కిలోమీటర్ల ప్రయాణానికి సిద్ధమయ్యాడో యువకుడు! కాలినడకనే ఎడారిని అధిగమించి.. దేశాలను దాటేసి.. ఎక్కడో సుదూరాన ఉన్న స్విట్జర్లాండ్‌కు చేరుదామనుకున్నాడు!! చేరగలననుకున్నాడు!!

ప్రేమ కోసమై..

ప్రియురాలి కోసం యువకుడి కష్టాలు..

హైదరాబాద్‌ నుంచి స్విట్జర్లాండ్‌కు వెళ్లే ప్లాన్‌

బికనీర్‌ దాకా రైల్లో.. అక్కణ్నుంచీ పాక్‌, అఫ్ఘాన్‌ మీదుగా కాలినడకన వెళ్లే యత్నం

పాక్‌ ఆర్మీకి బందీగా చిక్కిన ప్రశాంత్‌..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో విడుదల

నాలుగేళ్లపాటు పాకిస్థాన్‌లో కష్టాలు..

కుటుంబీకులకు అప్పగించిన సీపీ సజ్జనార్‌

తల్లిదండ్రుల మాట వినండి.. యువత పెడదారి పట్టొద్దు: ప్రశాంత్‌


ప్రేమించిన అమ్మాయిని కలుసుకోవడం కోసం కాలినడకన వేల కిలోమీటర్ల ప్రయాణానికి సిద్ధమయ్యాడో యువకుడు! కాలినడకనే ఎడారిని అధిగమించి.. దేశాలను దాటేసి.. ఎక్కడో సుదూరాన ఉన్న స్విట్జర్లాండ్‌కు చేరుదామనుకున్నాడు!! చేరగలననుకున్నాడు!! అందుకోసం పొరుగదేశం కంచె దూకి అక్రమంగా చొరబడి.. అంతలోనే దొరికిపోయాడు. నాలుగేళ్లపాటు అక్కడ నానా కష్టాలూ పడి, జైలు శిక్ష అనుభవించి.. ఎట్టకేలకు భారత ప్రభుత్వ, సైబరాబాద్‌ పోలీసుల చొరవతో క్షేమంగా వెనక్కి వచ్చాడు. ప్రేమకోసం జీవితాన్ని అల్లకల్లోలం చేసుకున్న ప్రశాంత్‌ అనే యువకుడి కథ ఇది. ప్రాణం ఉండగా తన వాళ్లను కలుసుకుంటానో లేదో అని దిగులు పడ్డ అతను మంగళవారం హైదరాబాద్‌లో కన్నవాళ్లను కలుసుకుని ఆనందంతో పొంగిపోయాడు. ఈ కేసు వివరాలను సీపీ సజ్జనార్‌ మీడియాకు వివరించారు.


హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన ప్రశాంత్‌ కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు.  2015లో బెంగళూరులో తనతో పాటు పనిచేస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజుల్లోనే ఆ యువతికి డిల్లీలో ఉద్యోగం రావడంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. అప్పటికే ఆ యువతిపై మనసుపారేసుకున్న ప్రశాంత్‌... ఉద్యోగం పక్కన బెట్టి ఆ యువతికి తన మనసులోని మాట చెప్పడం కోసం ఇంట్లో చెప్పకుండా ఢిల్లీకి వెళ్లాడు. ఆ యువతి జాడకోసం తిరిగాడు. మధ్యప్రదేశ్‌లో ఆమె కుటుంబం చిరునామా తెలుసుకుని.. అక్కడికి వెళ్లి ఆమె తల్లిదండ్రులను కలిశాడు. ఆమెకు  స్విట్జర్లాండ్‌లో ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్లిపోయిందని వారు చెప్పారు.


అనంతరం బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ప్రశాంత్‌ 2016లో మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అయితే ఆ యువతిని మాత్రం అతడు మర్చిపోలేక పోయాడు. అలా ఏడాది గడిచాక ఇక ఉండలేక.. 2017 ఏప్రిల్‌లో ఆమె కోసం బట్టలు సర్దుకుని బయల్దేరాడు. ప్రశాంత్‌ ప్రేమ గురించి తెలిసిన అతడి తల్లి.. ఎక్కడికి వెళ్తున్నావంటూ ప్రశ్నించింది. ఆఫీ్‌సకు అని అబద్ధం చెప్పాడు. ‘‘వీకెండ్‌లో ఆఫీస్‌ ఎక్కడిది?’’ అని తల్లి ప్రశ్నించడంతో చేసేది లేక అప్పటికి ఆగిపోయాడు. కానీ తన మనసు మాత్రం మార్చుకోలేదు. ప్రయత్నాలు ఆపలేదు. స్విట్జర్లాండ్‌కు ఎలా వెళ్లాలో రూట్‌మ్యాప్‌ సిద్ధం చేసుకున్నాడు. మొత్తం దూరం 8700 కిలోమీటర్లు అని.. నడిచి వెళ్లడానికి 70 రోజులు పడుతుందని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. కోఠిలో కంపాస్‌ కొనుగోలు చేసి పెట్టుకున్నాడు. చివరికి.. 2017 ఏప్రిల్‌ 11న ఉదయమే ఆఫీ్‌సకు అని చెప్పి వెళ్లాడు. వెళ్లేటప్పుడు సెల్‌ఫోన్‌ ఇంట్లోనే పడేసి వెళ్లిపోయాడు. 


బికనీర్‌ వరకు రైల్లో... 

ఏప్రిల్‌-11న సికింద్రాబాద్‌లో టిక్కెట్‌ లేకుండానే రైలు ఎక్కాడు. ఆ రోజు సాయంత్రానికి ప్రశాంత్‌ ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఎక్కడికైనా వెళ్లాడేమో తిరిగి వస్తాడులే అని ఎదురు చూశారు. కానీ రోజులు గడిచినా అతడు తిరిగిరాకపోవడంతో ఏప్రిల్‌ 29న మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ప్రశాంత్‌ తండ్రి బాబూరావు మిస్సింగ్‌ కంప్లైంట్‌ ఇచ్చారు. అటు.. రైల్లో బయల్దేరిన ప్రశాంత్‌.. రాజస్థాన్‌లోని  బికనీర్‌లో దిగాడు. అక్కడి నుంచి కాలినడకన థార్‌ ఎడారి ప్రాంతం గుండా పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌, కజకిస్థాన్‌, ఇరాన్‌ తదితర దేశాల మీదుగా స్విట్జర్లాండ్‌ చేరుకోవాలన్నది అతడి ప్లాన్‌.


ఈ క్రమంలోనే.. మండు వేసవిలో.. ఏడారి ప్రాంతం గుండా కాలినడకన బయల్దేరాడు. బికనీర్‌లో ఒక వాటర్‌ బాటిల్‌లో నీళ్లు తీసుకెళ్లాడు. కానీ, సగం దూరం వెళ్లేసరికే ఆ నీళ్లు అయిపోయాయి. అయినా పంటి బిగువున 30 కిలోమీటర్లు నడిచాడు. అక్కడ పాకిస్థాన్‌ సరిహద్దు వచ్చింది. చేతిలో వీసా, ఇతర ధ్రువపత్రాలు లేవు కాబట్టి గేటు నుంచి అనుమతించరని.. కాబట్టి రహస్యంగా కంచె మద నుంచి దూకేసి వెళ్తే అయిపోతుంది అని ఎవరో ఇచ్చిన సలహా మేరకు ఇనుప ముళ్ల కంచె మీద నుంచి దూకి పాకిస్థాన్‌లో ప్రవేశించాడు. చేతులు తెగి రక్తం కారుతున్నా లెక్కచేయలేదు. అలా 2017 ఏప్రిల్‌ 14న పాకిస్థాన్‌ భూబాగంలోకి వెళ్లాడు. అదే ఎడారిలో పాక్‌ భూబాగంలో మరో 40 కిలోమీటర్లు నడిచి వెళ్లి బాగా దాహం వేసి, ఒక గుడిసె వద్ద సొమ్మసిల్లి పడిపోయాడు. అయితే.. సరిహద్దు వద్ద కంచెకు తగులుకున్న అతడి చొక్కా ఆధారంగా పాక్‌ సైనికులు అతణ్ని పట్టుకుని పై అధికారులకు అప్పగించారు. తొలుత వారు అతణ్ని అనుమానించి జైల్లో పెట్టి విచారించారు. కానీ, అతడి కథ విని, మంచివాడని భావించి మంచిగానే మసలుకొనేవారు. ఈ క్రమంలోనే ఒక అధికారి అతడి వీడియో తీసి భారత్‌లోని చానళ్లలో వచ్చేలా చేశారు.


‘‘నేను పాకిస్థాన్‌ ఆర్మీ చెరలో ఉన్నాను.’’ అంటూ ప్రశాంత్‌తో తెలుగులో చెప్పిన ఆ వీడియో వైరల్‌ కావడంతో ప్రశాంత్‌ తల్లిదండ్రులు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ కలిశారు. 2019 నవంబర్‌లో తెలంగాణ ప్రభుత్వం, భారత ప్రభుత్వం (కేంద్ర హోం శాఖ, విదేశాంగ శాఖ) సహకారంతో ప్రశాంత్‌ విడుదలకోసం సైబరాబాద్‌ పోలీసులు ప్రయత్నించారు. పాక్‌ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మరోవైపు.. ప్రశాంత్‌కు సహకరించిన పాక్‌ ఆర్మీ అధికారిని అక్కడి అధికారులు సెస్పెండ్‌ చేశారు. ప్రశాంత్‌ వీడియో బయటకు రావడంతో.. పాక్‌ ఆర్మీ అధికారులు అతణ్ని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనికి ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. ఆ శిక్ష పూర్తవడంతో మే-31న ప్రశాంత్‌ను పాక్‌ అధికారులు విడుదల చేస్తున్నట్లు ఇండియన్‌ ఎంబసీకి సమాచారం ఇచ్చారు. సీపీ సజ్జనార్‌ ఆదేశాలతో మాదాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ రవీంద్రప్రసాద్‌ పంజాబ్‌ రాష్ట్రం అటారి వద్దకు వెళ్లి, అతణ్ని తీసుకొని సోమవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. అనంతరం సీపీ సజ్జనార్‌.. వైజాగ్‌లో ఉంటున్న ప్రశాంత్‌ తండ్రి బాబూరావు, సోదరుడు శ్రీకాంత్‌కు సమాచారం ఇచ్చారు. ప్రశాంత్‌ను అతని సోదరుడికి అప్పగించారు. ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి వారిని వైజాగ్‌కు పంపారు.  


అమ్మానాన్న మాట వినండి

‘‘యువత పెడదారి పట్టొద్దు. తల్లిదండ్రుల మాట తప్పక వినండి’’.. మంగళవారంనాటి మీడియా సమావేశంలో యువతకు ప్రశాంత్‌ చేసిన విజ్ఞప్తి ఇది. నాలుగేళ్ల తన చేదు అనుభవాల గురించి.. చేసిన తప్పు వల్ల తాను కోల్పోయిన జీవితం గురించి ప్రశాంత్‌ మీడియాకు వివరించారు. ‘‘నేను తల్లిమాట వినకుండా వెళ్లి ఇలాంటి కష్టాలు పడ్డాను. ఈ రోజు నన్ను కాపాడి, తిరిగి నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన భారత ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటాను. నాకోసం రెండుసార్లు డిల్లీ వెళ్లి పెద్ద పెద్ద అధికారులతో మాట్లాడి నా విడుదలకు సహకరించిన సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను’’ అని సమావేశంలో ప్రశాంత్‌ భావోద్వాగానికి గురయ్యారు. సీపీ కాళ్లపై పడి కృతజ్ఞతలు తెలిపే ప్రయత్నం చేశారు.

Updated Date - 2021-06-02T09:34:54+05:30 IST