Advertisement
Advertisement
Abn logo
Advertisement

తీరని కష్టం.. చాలని పరిహారం

ఇప్పటికీ ఇళ్లు, వసతి లేక వరద బాధితుల రోడ్డుపాలు 


కోవూరు, నవంబరు 30: ఇటీవల వరదలకు మండల పరిధిలోని కోవూరు, పోతిరెడ్డిపాళెం, పాటూరు గ్రామాల్లోని పేదలు ఇప్పటికీ కష్టాలు ఎదుర్కొంటున్నారు. కోవూరులోని స్టౌబీడీ కాలనీ, నేతాజీ నగర్‌, కోనమ్మతోటల్లోని ఇళ్లన్నీ వరదనీటిలో చిక్కుకున్నాయి. సాలుచింతల ప్రాంతంలో కోవూరు-నెల్లూరు రోడ్డు మార్గంలోని ఇళ్లన్నీ వరదనీటి వల్ల దెబ్బతిన్నాయి. చాలా ఇళ్లు నేల మట్టమయ్యాయి. టీవీలు, వాషింగ్‌మెషిన్లు, సెల్‌ఫోన్లు పనికి రాకుండాపోయాయి. కొన్ని ఇళ్లలో  నుంచి టీవీలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. వస్త్రాలన్నీ వరదల్లో కొట్టుకుపోవడంతో కట్టుబట్టలతో మిగిలారు. ఆహారం కోసం అలమటిస్తున్నారు. ఇప్పటికీ ఇళ్లులేక, వసతి లేక చాలా కుటుంబాలు రోడ్డుపాలయ్యాయి.  వీరికి ప్రభుత్వం ఆర్థిక సహాయం రూ.2వేలు అందించింది. అలాగే టీవీ, లాప్‌టాప్‌లు పోగొట్టుకున్న కుటుంబాలకు కూడా అదే పరిహారం  ఇవ్వడంతో బాధను దిగమింగుకుంటున్నారు. భోజనం ఎవరైనా తీసుకువస్తే బాధితులు పరుగులు తీస్తున్నారంటే ఎంతగా బాధపడుతున్నారో అర్ధమవుతోంది.  


నష్టపరిహారం చెల్లించాలి

తీవ్రంగా నష్టపోయిన సాలుచింతల, స్టౌబీడీ కాలనీవాసులను ఆదుకోవాలి. లక్ష్మీపురంలోని మత్స్యకారులు ఎండు చేపలు తడిచిపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికీ సాలుచింతల బాధితులు రోడ్డుపైన దీనంగా చూస్తున్నారు. వెంటనే నష్టాన్ని లెక్కకట్టి ఆర్థిక సాయం   అందజేయాలి.

- లక్ష్మి, మత్స్యకారుల కుటుంబం, లక్ష్మీ నగర్‌


నిర్లక్ష్యం తగదు

మాపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు. భారీగా నష్టం జరిగితే రూ.2000లు ఇచ్చారు. ఆర్థిక సహాయం చెల్లించడంలోనూ, వసతి కల్పనలో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. ఇంతవరకు నష్టం అంచనా వేయలేదు. ఇళ్లు పడిపోయిన వారి పేర్లు రాసుకుని పోయారు. ఇప్పటికీ అధికారులు  మా వద్దకు రాలేదు. మేము చాలా ఇక్కట్లను ఎదుర్కొంటున్నాం.  

- కృష్ణయ్య, పీఆర్‌ఆర్‌ కాలనీ, కోవూరు.

 

Advertisement
Advertisement