Abn logo
Sep 19 2021 @ 01:03AM

మనీ బ్యాగుల చోరీ కేసుల్లో ముగ్గురి అరెస్టు

కాకినాడ క్రైం, సెప్టెంబరు 18 : పొలం కొనుగోలు చేసేందుకు డబ్బుల బ్యాగ్‌తో ఓ మహిళ బస్సు ఎక్కే సమయంలో బ్యాగును కట్‌ చేసి నగదు చోరీకి పాల్పడ్డ ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. అలాగే మరో సంఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి బ్యాగ్‌లో నగదు చోరీకి పాల్పడిన మరో నిందితుడిని కూడా అరెస్టు చేశారు.  ఇద్దరు నిందితుల నుంచి రూ.4.71 లక్షల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు క్రైం డీఎస్పీ రాంబాబు వెల్లడించారు. విశాఖ జిల్లా యలమంచిలి గాంధీనగర్‌ హరిజన పేటకు చెందిన వాసంశెట్టి కుమారస్వామి, ద్వారకానగర్‌కు చెందిన తెలికిచెర్ల వెంకట సత్యనారాయణ ప్రసాద్‌ (పంతులు) ఈనెల 16వ తేదీన కాకినాడ బస్టాండ్‌లో ఓ మహిళ బ్యాగ్‌ను కట్‌ చేసి రూ. 3.95 లక్షల నగదును ఎత్తుకుపోయారు.  అలాగే ఈనెల 12వ తేదీన విజయనగరం నుంచి బస్సులో కాకినాడకు వస్తున్న వ్యక్తి బ్యాగ్‌లో పెట్టిన రూ. 80 వేలును విశాఖ జిల్లా అరకు మండలం బొడ్డగుడ్డకు చెందిన కొర్రా ప్రహ్లాద్‌ చోరీకి పాల్పడటంతో బాఽధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అదనపు ఎస్పీ కుమార్‌ నేతృత్వంలో కాకినాడ డీఎస్పీ భీమారావు, క్రైం డీఎస్పీ రాంబాబు పర్యవేక్షణలో సీఐ, ఎస్‌ఐలు దర్యాప్తు చేపట్టారు. ఈనెల 17న సాయంత్రం 4.30 గంటల సమయంలో కాకినాడ వైఎస్‌ఆర్‌ బ్రిడ్జి భరతమాత గుడి వద్ద వాసంశెట్టి కుమారస్వామి. తెలికిచెర్ల వెంకట సత్యనారాయణ ప్రసాద్‌ (పంతులు)ను  ఏఎస్‌ఐ ఆర్‌.గోపాలకృష్ణ సిబ్బందితో దాడి చేసి అరెస్ట్‌ చేశారు. రెండో కేసులో నిందితుడు  కొర్రా ప్రహ్లాద్‌ను శుక్రవారం టౌన్‌ రైల్వేస్టేషన్‌ వద్ద అరెస్ట్‌ చేసి, రూ.78 వేలు స్వాధీనం చేసుకున్నారు. క్రైం డీఎస్పీ ఎస్‌.రాంబాబు, త్రీటౌన్‌ క్రైం సీఐ అప్పలనాయుడు, ఎస్‌ఐలు, సిబ్బందిని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు అభినందించారు.