తాళాలు వేసిన ఇళ్లల్లో చోరీ

ABN , First Publish Date - 2021-01-16T06:22:54+05:30 IST

మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి తాళాలు వేసిన రెండు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు.

తాళాలు వేసిన ఇళ్లల్లో చోరీ

మోత్కూరు, జనవరి 15: మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి తాళాలు వేసిన రెండు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలడుగు గ్రామానికి చెందిన గుర్రం రంజిత్‌కుమార్‌, గుర్రం సతీష్‌ (అన్నదమ్ములు) హైదరాబాదులో ఉంటారు. వారి తల్లి పాలడుగులోని ఇళ్ల వద్ద ఉంటుంది. ఆమె ఈ నెల 11న ఇళ్లకు తాళాలు వేసిన సంక్రాంతి పండుగకు హైద్రాబాదు కుమారుల వద్దకు వెళ్లింది. ఈనెల 14న రంజిత్‌కుమార్‌ పాలడుగులోని ఇంటికి వచ్చే సరికి  తన ఇంటితో పాటు, తన సోదరుడి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూసే సరికి బీరువాలు తెరిచి అందులో ఉన్న బంగారం, వెండి, నగదు దోచుకెళ్లినట్టు గుర్తించారు. రంజిత్‌కుమార్‌ ఇంటిలో సుమారు 5 తులాల బంగారు గొలుసు, 6 ఉంగరాలు, 20 తులాల వెండి, రూ.5 వేలు నగదు, మూడున్నర ఎకరాల భూమి సేల్‌డీడ్‌, సతీష్‌ ఇంట్లో ఏడున్నర గ్రాముల బంగారు ఉంగరం, రూ.వెయ్యి నగదు ఎత్తుకెళ్లారు. రంజిత్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమెదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్‌ఐ జి.ఉదయ్‌కిరణ్‌ తెలిపారు. 


సంతోషిమాత ఆలయంలో హుండీ చోరీ 

భువనగిరి టౌన్‌, జనవరి 15: జిల్లా కేంద్రం భువనగిరి ఖిల్లా నగర్‌లోని  శ్రీ సంతోషీమాత ఆలయంలో బుధవారం రాత్రి చోరీ జరిగింది. ఆలయ గ్రిల్‌ను బలవంతంగా తొలగించి లోనికి వచ్చిన దొంగలు హుండీని ధ్వంసం చేసి భక్తులు సమర్పించిన కానుకలను అపహరించారు. అయితే 5 నెలల్లో ఇదే ఆలయంలో చోరీ జరగడం ఇది రెండోసారి. ఆలయ పూజారి మణిశర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్‌ఐ అంజయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ పుటేజీలను పరిశీలించి, సంఘటనా స్థలం నుంచి ఆధారాలను సేకరించారు. 


పండుగపూట విషాదం

అన్న మందలించాడని తమ్ముడి బలవన్మరణం

ఆత్మకూరు(ఎం), జనవరి 15: సంక్రాతి పండుగ ఆ ఇంట్లో విషాదం నింపింది. పండుగను కొడుకులతో కలిసి  ఆనందం జరుపుకోవాలనుకున్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. అన్న తిట్టాడని తమ్ముడు బలవన్మరణానికి పాల్పపడిన సంఘటన మండలంలోని లింగరాజుపల్లి జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని లింగరాజుపల్లి గ్రామానికి చెందిన ఎర్ర క్రిష్ణారెడ్డి కి ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు రేణురెడ్డి బి.టెక్‌.ఫైనల్‌, రెండవ కొడుకు కరుణాకర్‌రెడ్డి బి.టెక్‌. తృతీయ సంవత్సరం హైద్రాబాదులో చదువుకుంటు హస్టల్‌ ఉంటున్నారు. సంక్రాంతి పండుగకు ఇద్దరు స్వగ్రామానికి వచ్చారు. బోగి పండుగ రోజు ఇంటి సమస్యలు చర్చించుకుంటున్న సందర్భంలో పెద్ద కొడుకు రేణురెడ్డి తమ్ముడు కరుణాకర్‌రెడ్డిని తిట్టినట్లు తెలిసింది. దాంతో మనస్థాపానికి గురైనా  కరుణాకర్‌రెడ్డి(21) ఈనెల 14 న ఇంట్లో ఎవరికి చెప్పకుండా హైద్రాబాద్‌కు వెళ్ళిపోయి నాంపల్లి రైల్వేసేషన్‌ వద్ద రైలు పట్టాలపైన పడుకొని బలవన్మరణానికి పాల్పపడినట్లు తెలిసింది. కరుణాకర్‌రెడ్డి క్షణిక ఆవేశంలో బంగారం లాంటి భవిష్యత్‌ పాడుచేసుకున్నాడంటు, గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.  కరుణాకర్‌రెడ్డి మృత దేహానికి శుక్రవారం గ్రామంలో దహన సంస్కారాలు నిర్వహించారు.


  మత్తులో యువకుడి హల్‌చల్‌ 

వలిగొండ, జనవరి 15: మత్తులో ఒక యువకుడు పండుగ పూట నడి రోడ్డుపై హల్‌ చల్‌ చేశారు. వలిగొండ పట్టణానికి చెందిన ఒక యువకుడు ఈనెల 15న సాయంత్రం మండల కేంద్రంలో చిట్యాల భువనగిరి ప్రధాన రహదారి పక్కన మద్యం మత్తులో నానా హంగామా సృష్టించాడు. విధులు నిర్వహిస్తున్న పోలీస్‌ సిబ్బందిని, అడ్డు వచ్చిన స్థానికులను పరుష పదజాలంతో దూషించాడు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించిన యువకుడి హల్‌చల్‌పై పలువురు విమర్శలు చేస్తున్నారు. యువకుడి తీరుపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. 


 వలిగొండ మండలంలో గంజాయి కలకలం

వలిగొండ, జనవరి 15: వలిగొండ మండలంలో గుట్టుగా గంజాయి విక్రయాలు సాగుతున్నాయని పలువురు చర్చించుంటున్నారు. ఈ విషయం సోషల్‌మీడియాలో చక్కర్లుకొడుతోంది. గంజాయి విక్రయాల్లో కొందరు అధికారులు, ఓ పత్రికా విలేకరి(ఆంధ్రజ్యోతి కాదు) హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.  


అదుపు తప్పి ట్రాక్టర్‌ బావిలోకి 

డ్రైవర్‌ కోసం గాలిస్తున్న స్థానికులు

మేళ్లచెర్వు, జనవరి 15 : పొలంలో దమ్ము చేస్తున్న ట్రాక్టర్‌ అదుపు తప్పి వ్యవసాయ బావిలోకి పడింది. ఈ ఘటన మండలంలోని కందిబండలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.  గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం బత్తుల గోవిందరెడ్డికి చెందిన పొలంలో మఠంపల్లి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన డ్రైవర్‌ గుండెబోయిన వీరస్వామి ట్రాక్టర్‌తో దమ్ము చేస్తున్నాడు. అదుపుతప్పి ట్రాక్టర్‌తో పాటు డ్రైవర్‌ వీరస్వామి బావిలో పడిపోయాడు. గమనించిన చుట్టుపక్కల వారు బావిలో గాలింపు చేపట్టారు. ఎస్‌ఐ నరేష్‌ సమాచారం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాత్రి 10 గంటల వరకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 


ఫెన్సింగ్‌ గోడ కూల్చిన వారిపై కేసు నమోదు 

కోదాడ రూరల్‌, జనవరి 15 : మండలంలోని గుడిబండ గ్రామంలో ఫెన్సింగ్‌ గోడ కూల్చిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఏఎ్‌సఐ లింగయ్య తెలిపారు. గ్రామంలోని చింతా రాధారెడ్డి తన ఇంటి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసుకున్నారు. అదే గ్రామానికి చెందిన మాదారపు ముత్తయ్యతో పాటు మరో 15మంది ఇంట్లో ఎవరూలేని సమయంలో కూల్చివేశారని రాధారెడ్డి పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. రాధారెడ్డి ఫిర్యాదు మేరకు ముత్తయ్యతో పాటు మరో 15 మందిపై కేసు నమోదు చేసినట్లు ఏఎ్‌సఐ పేర్కొన్నారు. కొంతకాలంగా రాధారెడ్డి, ముత్తయ్యకు ఖాళీ స్థలం విషయమై వివాదం జరుగుతోంది. అందులో భాగంగానే ముత్తయ్య ప్రహరీ గోడ కూల్చివేశారని పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-01-16T06:22:54+05:30 IST