చీకిలబైలు చెక్‌పోస్టు వద్ద ఆంధ్రకు వస్తున్న వారి అడ్డగింత

ABN , First Publish Date - 2020-03-30T11:13:02+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో బెంగళూరు నుంచి ఆంధ్రాకు వస్తున్న దాదాపు 500 మందిని చిత్తూరు జిల్లా మదనపల్లె పోలీసులు ఆంధ్ర-కర్ణాటక సరిహద్దు చీకిలబైలు చెక్‌పోస్టు వద్ద ఆదివారం అడ్డగించారు.

చీకిలబైలు చెక్‌పోస్టు వద్ద  ఆంధ్రకు వస్తున్న వారి అడ్డగింత

 400 మంది తిరిగి బెంగళూరుకు 

వంద మంది క్వారంటైన్‌కు తరలింపు


మదనపల్లె క్రైం, మార్చి 29: లాక్‌డౌన్‌ నేపథ్యంలో బెంగళూరు నుంచి ఆంధ్రాకు వస్తున్న దాదాపు 500 మందిని చిత్తూరు జిల్లా మదనపల్లె పోలీసులు ఆంధ్ర-కర్ణాటక సరిహద్దు చీకిలబైలు చెక్‌పోస్టు వద్ద ఆదివారం అడ్డగించారు. వీరంతా ప్రకాశం, కృష్ణ, కడప, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు చెందినవారు. బెంగళూరులో వివిధ రంగాల్లో పని చేస్తూ అక్కడే నివాసం ఉంటున్నవారు. వీరిలో ఎక్కువ మంది భవన నిర్మాణ కూలీలే. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉపాధి కరువై అక్కడ ఉండలేక స్వస్థలాలకు బయలుదేరారు. పలువురు వాహనాల్లో, కొందరు కాలినడకన రాగా చీకిలబైలు చెక్‌పోస్టు వద్ద పోలీసులు వారిని అడ్డుకుని వెనక్కి పంపేస్తున్నారు. చెక్‌పోస్టుకు శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు సుమారు 500 మంది చేరుకున్నారు.


డీఎస్పీ కె.రవి మనోహరాచారి, సీఐ శ్రీనివాసులు వారితో మాట్లాడుతూ 14 రోజుల పాటు క్వారంటైన్‌ ఉండి తీరాలని, కరోనా లక్షణాలు లేకపోతే స్వగ్రామాలకు పంపుతామని చెప్పారు. దీంతో దాదాపు 400 మంది తిరిగి బెంగళూరుకు వెళ్లిపోగా వంద మంది క్వారంటైన్‌ వార్డులో ఉండేందుకు ఒప్పుకున్నారు. దాంతో వంద మందిని ప్రైవేటు అంబులెన్సుల్లో నక్కలదిన్నె సమీపంలోని ప్రభుత్వ బాలుర వసతిగృహానికి తరలించారు. తహసీల్దార్‌ సురేష్‌బాబు, ఎంపీడీవో లీలామాధవి వసతిగృహానికి చేరుకుని వారికి భోజన వసతి కల్పించారు. అనంతరం జిల్లా వైద్యశాల వైద్యులు, సిబ్బంది వారికి వైద్యపరీక్షలు నిర్వహించారు. దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నవారిని జిల్లా వైద్యశాలలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. 

Updated Date - 2020-03-30T11:13:02+05:30 IST