Abn logo
Sep 29 2021 @ 00:00AM

వారి ‘ప్రేమ ఎంతో మధురం’

చేసింది ఇంటీరియర్‌ డిజైనింగ్‌. కాలేజీలో ఉండగా మోడలింగ్‌. అప్పుడు ఆలోచనే వేరు... ఫ్యాషన్‌ ప్రపంచం. మిత్రుల ప్రోత్సాహం... నమ్మకంలేని ఓ ప్రయత్నం... మొదటి ఆడిషన్‌లోనే సెలెక్షన్‌. అనుకోకుండా కెమెరా ముందుకొచ్చి... ‘అను’గా అభిమానగణాన్ని సంపాదించుకున్న బుల్లితెర నటి వర్షా హెచ్‌కేతో ‘నవ్య’ మాటామంతి... 


ఇదంతా మొదలైంది ఒక ఫ్యాషన్‌ షోతో! మూడేళ్ల కిందటి మాట. నాకు అప్పుడు పదిహేడేళ్లు. బెంగళూరులో పీయూసీ చదువుతున్న రోజులు. కాలేజీలో మోడలింగ్‌ చేసేదాన్ని. ఒక రోజు ప్రముఖ సంస్థ ఒకటి మెగా ఫ్యాషన్‌ షో నిర్వహించింది. నగరం లోని అన్ని కాలేజీల అమ్మాయిలూ అందులో పాల్గొన్నారు. నేను కూడా మా కాలేజీ టీమ్‌ను తీసుకుని వెళ్లాను. క్యాట్‌వాక్‌లతో వేదిక కలర్‌ఫుల్‌గా మారింది. అంతమంది పోటీపడిన ఆ ఈవెంట్‌లో మేం బాగా ఆకట్టుకున్నాం. ఎంతోమంది అభినందనలు అందుకున్నాం. స్థానిక దినపత్రికలో నా ఫొటోలతో ఆర్టికల్‌ ఒకటి రాశారు. పట్టరాని ఆనందం. అది చూసిన మా స్నేహితులు ‘నటిగా ప్రయత్నించవచ్చు కదా’ అన్నారు.  


తొలి ప్రయత్నంలోనే... 

అప్పటి వరకు నాకు నటి కావాలన్న ఆసక్తి కాదు కదా.. అసలు ఆ ఆలోచనే లేదు. అయితే స్నేహితుల ప్రోత్సాహం నాలో ఉత్సాహం నింపింది. ‘ప్రయత్నించి చూద్దాం’ అనుకున్నా! మరి ఎలా వెళ్లాలి? ఏమీ తెలియదు. గూగూల్‌లో వెతికాను. మిత్రుల ద్వారా ఆరా తీశాను. చివరకు సీరియల్‌ కోసం ఎక్కడో ఆడిషన్స్‌ జరుగుతున్నాయని తెలిసి వెళ్లాను. వాళ్లు చెప్పింది నాకు వచ్చినట్టు చేశాను. సెలెక్ట్‌ అయ్యాను. అసలు ఊహించలేదు. కట్‌ చేస్తే ‘రాజా రాణి’ కన్నడ సీరియల్‌తో నటిగా నా కెరీర్‌ మొదలైంది. అందులో చేసింది చిన్న పాత్రే. 


నటిస్తూ నేర్చుకున్నా... 

నటనలో నాకు అనుభవం లేదు. కనీసం సరదాకు కూడా ఎవరినీ అనుకరించింది లేదు. అలాంటిది ఒక్కసారిగా యాక్షన్‌... కట్‌ల మధ్య కెమెరా ముందు నిలబడి అభినయించడం కొత్తగా అనిపించింది. అయితే కెమెరా యాంగిల్స్‌, ఫోకస్‌, సెట్‌ ఎలా ఉంటుంది... ఇలా అన్నిటి గురించి అడిగి మరీ తెలుసుకున్నాను. ఒక పక్క నటిస్తూనే ఇంటీరియర్‌ డిజైనింగ్‌ కోర్సు పూర్తి చేశాను. ఆ తరువాత బిజీ అవ్వడంతో చదువు కొనసాగించలేకపోయాను. తెలుగు నుంచి పిలుపు... 

తొలి సీరియల్‌ తరువాత కన్నడలోనే ‘నాగమండల’లో అవకాశం వచ్చింది. అందులో నాది ప్రధాన పాత్ర. నటిగా నిలబడగలనన్న నమ్మకాన్ని ఇచ్చింది ఆ పాత్ర. అది అవగానే ‘కస్తూరి నివాస’ మొదలైంది. అందులో చేస్తుండగా ‘జీ తెలుగు’ వారి ‘ప్రేమ ఎంత మధురం’ కోసం పిలుపు వచ్చింది. విభిన్నమైన కథ. నాది కథానాయకి పాత్ర. వెంటనే ఓకే చెప్పేశాను. 


సెంచరీ దాటిన ఫ్యాన్‌ పేజీలు... 

గత ఏడాది ఫిబ్రవరిలో మొదలైన ‘ప్రేమ ఎంత మధురం’లో నాది ‘అను’ పాత్ర. స్వచ్ఛమైన ప్రేమకు కులం, మతం, ఆస్తులు, అంతస్తులే కాదు... ఆఖరికి వయసు కూడా పట్టింపు కాదనేది కాన్సెప్ట్‌. నలభై ఏళ్ల బిజినెస్‌మ్యాన్‌ ‘ఆర్యవర్ధన్‌’... పంథొమ్మిదేళ్ల చలాకీ పిల్ల ‘అను’ మధ్య ప్రేమ ఎలా చిగురించింది... ఆ తరువాత వారి జీవితం ఎలా సాగుతుందన్నది కథ. ఇప్పటికి 400 ఎపిసోడ్స్‌కు పైగా పూర్తయ్యాయి. కన్నడలో మూడు సీరియల్స్‌ చేసినా... వాటన్నిటి కంటే ఇక్కడ ‘అను’ పాత్రకు లభిస్తున్న ఆదరణ అద్భుతం. తెలుగు ప్రేక్షకులు నన్ను తమ ఇంటి బిడ్డలా చూస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో అయితే వందకు పైగా ఫ్యాన్‌ పేజీలు తెరిచారు. నేనే నమ్మలేకపోయాను.. ఇంత మంది అభిమానులున్నారా అని! 


ప్రశాంతంగా ఉన్నాను...  

మీ నవ్వు బాగుందనో... ఆ సన్నివేశంలో అదరగొట్టారనో ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది అభినందిస్తుంటారు. అయితే ప్రేమ ప్రతిపాదనలు లాంటివేవీ రాలేదు. నిజ జీవితంలో కూడా నాకు ప్రేమలూ గట్రా లేవు. అందుకే ప్రశాంతంగా ఉన్నాను. అభిమానులు ఎక్కడెక్కడి నుంచో నా ఫొటోలు, వీడియోలు సేకరించి పోస్ట్‌ చేస్తుంటారు. నేను కూడా సాధ్యమైనంత మందికి బదులు ఇస్తుంటాను. వారి ‘ప్రేమ ఎంతో మధురం’. ఈ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ అంతా ‘అను’ పాత్ర వల్ల లభించిందే.


లక్ష్యాలు... కలలు లేవు... 

చెబితే నమ్మరు గానీ నాకు పెద్ద పెద్ద లక్ష్యాలు, కలలు ఏమీ ఉండవు. పీయూసీ చదివేటప్పుడు ఫ్యాషన్‌ రంగంపై ఇష్టం కలిగింది. అటువైపు వెళదామనుకు న్నాను. ఆ సమయానికి ఏది చేయాలనిపిస్తే అది చేసుకొంటూ పోతానంతే! అనుకోకుండా నటినయ్యాను. అవకాశాలు వస్తున్నాయి కనుక నటననే కెరీర్‌గా మలుచుకున్నా. మంచి పాత్రలు పోషిస్తూ, బిజీగా ఉండాలన్నదే నా ఆకాంక్ష. ఇబ్బందులు అందరికీ ఉంటాయి. కానీ బయట ఎంతో మంది అవకాశాల కోసం కష్టాలు పడుతున్నారు. వారితో పోల్చుకున్నప్పుడు నేను ఇక్కడి వరకు రావడమే గొప్పగా, గర్వంగా అనిపిస్తుంది. ఆ సంతృప్తే నన్ను ఎప్పుడూ ఆనందంగా ఉంచుతుంది.

 కనెక్ట్‌ అవుతుంటా...

సీరియల్స్‌ అంటే మన చుట్టూ ఉండే కథలే కదా! వాటిల్లో కొన్ని పాత్రలు నిజ జీవితానికి దగ్గరగా అనిపిస్తాయి. నేను పోషించిన రోల్స్‌లో నన్ను ప్రతిబించేవి ఏవీ లేవు కానీ, కొన్ని సన్నివేశాలతో అప్పుడప్పుడూ కనెక్ట్‌ అవుతూ ఉంటాను. ఉదాహరణకు ఓ సీన్‌లో ‘నువ్వు కనిపించకపోతే నేను కంగారుపడ్డాను’ అని అమ్మ డైలాగ్‌ చెప్పిందనుకోండి... నాకు నిజంగా మా అమ్మ గుర్తుకువస్తుంది. హైదరాబాద్‌ వచ్చేవరకు నేను మా అమ్మా నాన్నలను వదిలి దూరంగా ఉన్నది లేదు. ఇంటి బెంగ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు కాస్త పర్లేదనుకోండి! సెట్‌లో అంతా ఒక కుటుంబంలా ఉంటారు. షాట్‌ గ్యాప్‌లో అల్లరి చేస్తూ... ఆనందిస్తూ... ఉల్లాసంగా గడిపేస్తాను. 

పర్సనల్‌ టచ్‌ 


కుటుంబంలో నటులెవరూ లేరు. నాన్న బిజినెస్‌ మ్యాన్‌... అమ్మ, అన్నయ్యలే లోకం. 

పుట్టింది, పెరిగింది బెంగళూరులో. కానీ ఇక్కడకు వచ్చి తెలుగు నేర్చుకుంది.  

ట్రావెలింగ్‌ చాలా ఇష్టం. ప్యారిస్‌, కంబోడియా లాంటివి చూడాలన్నది లక్ష్యం. 

నచ్చే స్టార్స్‌ ఎవరూ లేరు. బాగున్న సినిమాలు చూస్తుంది. 

ఇండస్ర్టీలో బెస్ట్‌ ఫ్రెండ్స్‌... అనుశ్రీ, కరణ్‌, శ్రీరామ్‌.