వారి స్థైర్యం... ధ్రువాల్ని దాటుతోంది!

ABN , First Publish Date - 2021-01-10T05:58:03+05:30 IST

ఉత్తర ధ్రువం మీదుగా విమానం నడపడం చాలా కష్టమైన పని. సాంకేతికంగా అత్యున్నత నైపుణ్యం, ప్రతిభ దీనికి అవసరం.

వారి స్థైర్యం... ధ్రువాల్ని దాటుతోంది!

రంగం ఏదైనా తమ ఉనికిని బలంగా చాటుతున్న భారతీయ మహిళలు ఇప్పుడు నింగిలోనూ సరికొత్త అధ్యాయాన్ని లిఖించడానికి సిద్ధమయ్యారు. 


ఉత్తర ధ్రువం మీదుగా విమానం నడపడం చాలా కష్టమైన పని. సాంకేతికంగా అత్యున్నత నైపుణ్యం, ప్రతిభ దీనికి అవసరం. వైమానిక సంస్థలు అత్యుత్తమైన, ఎంతో నైపుణ్యం ఉన్న పైలెట్లను ఈ మార్గంలో పైలెట్లుగా పంపిస్తూ ఉంటాయి. ఈసారి ప్రపంచంలోనే సుదీర్ఘమైన వైమానిక మార్గంలో, ధ్రువ ప్రాంతం మీదుగా అమెరికాలోని శాన్‌ ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరుకు విమానం నడిపే అవకాశాన్ని ఒక మహిళా బృందానికి ఎయిరిండియా అందించింది. అట్లాంటిక్‌ మార్గంలో ఉత్తర ధ్రువం మీదుగా సుమారు 16 వేల కిలోమీటర్లు ప్రయాణించే ఈ విమానంలో నలుగురు పైలెట్లు ఉంటారు. కమాండ్‌ అధికారిగా కెప్టెన్‌ జోయా అగర్వాల్‌ వ్యవహరిస్తున్నారు. 


కెప్టెన్‌ పాపగారి తన్మయి, కెప్టెన్‌ ఆకాంక్ష సోనావార్‌, కెప్టెన్‌ శివానీ మన్హాస్‌ మిగిలిన పైలెట్లు. వీరు నలుగురూ కాకుండా మరో పన్నెండు మంది క్యాబిన్‌ క్రూ ఉండే ఈ విమానంలో 238 మంది ప్రయాణించవచ్చు. శాన్‌ఫ్రాన్సిస్కో, బెంగళూరు మధ్య ఎయిరిండియా నడుపుతున్న తొలి నాన్‌స్టాప్‌ విమానం ఇది. ఈ విమానం శాన్‌ ఫ్రాన్సిస్కోలో శనివారం రాత్రి 8.30కి (స్థానిక సమయం) బయలుదేరిన ఈ విమానం సోమవారం తెల్లవారుజామున 3.45 నిమిషాలకు బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయానికి చేరుతుంది.


ఇంతకుముందు ఎయిరిండియా పైలెట్లు ధ్రువ ప్రాంత మార్గాల మీదుగా విమానాలు నడిపారు. అయితే పైలెట్లందరూ మహిళలే కావడం ఇదే తొలిసారి. ఈ టీమ్‌కు నాయకత్వం వహిస్తున్న  కెప్టెన్‌ జోయా అగర్వాల్‌కు 8 వేల గంటలకు పైగా విమానాలు నడిపిన అనుభవం ఉంది.


‘‘ప్రపంచంలో చాలామంది ఉత్తర ధ్రువాన్ని తమ జీవితకాలంలో చూడలేరు. కనీసం మ్యాప్‌లో సైతం చూసి ఉండరు. ఉత్తర ధ్రువం మీదుగా ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన విమానయానానికీ నాయకత్వం వహించడం నావరకూ ఒక సువర్ణావకాశం’’ అన్నారు కెప్టెన్‌ జోయా. ఆమెకు ఇలాంటి ఘనతలు కొత్త కాదు. బోయింగ్‌-777 విమానం నడిపిన అతి తక్కువ వయసున్న మహిళగా 2013లో ఆమె రికార్డుల్లోకి ఎక్కారు.




‘‘నాతో పాటు మా కెప్టెన్ల టీమ్‌లో ఉన్న తన్మయి, ఆకాంక్ష, శివానీ... అందరం అనుభవం ఉన్నవాళ్ళమే. ప్రపంచంలో బోయింగ్‌-777 నడుపుతున్న అతి తక్కువ వయసున్న మహిళను నేనే. అయితే ఉత్తర ధ్రువం మీదుగా అందరూ మహిళలే ఉన్న పైలెట్ల బృందం విమానాన్ని నడపడం ఇదే మొదటిసారి’’ అంటారామె.


‘‘సామాజికమైన ఇబ్బందులను మహిళలు ఎదుర్కొంటూ ఉండొచ్చు. కానీ తమ మీద తమకు నమ్మకం ఉంటే ఏ పనీ అనూహ్యం, అసాధ్యం కాదు’’ అంటున్న జోయా. ఆమె, ఆమె సహ కెప్టెన్లు మరిందరు మహిళలకు... వారి కలలు సుసాధ్యం చేసుకొనే స్ఫూర్తినిస్తారనడంలో సందేహం లేదు. 


Updated Date - 2021-01-10T05:58:03+05:30 IST