పనిచేసే చోటే కన్నం !

ABN , First Publish Date - 2022-01-05T14:15:32+05:30 IST

స్థానిక తిరువాన్మియూరు రైల్వేస్టేషన్‌ కౌంటర్‌లో రూ.1.32 లక్షలు కాజేసి, ఆనక చోరీ నాటకమాడిన కౌంటర్‌ ఉద్యోగి, అతడి భార్య కటకటాలపాలయ్యారు. వివరాలిలా... చెన్నై బీచ్‌ - వేళచ్చేరి మార్గంలో

పనిచేసే చోటే కన్నం !

- ఆన్‌లైన్‌ జూదం కోసం రైల్వే కౌంటర్‌ డబ్బే కాజేశాడు

- తరువాత చోరీ నాటకం 

-  సినీ ఫక్కీలో ఛేదించిన పోలీసులు

- భార్యాభర్తల అరెస్టు


ప్యారీస్‌(చెన్నై): స్థానిక తిరువాన్మియూరు రైల్వేస్టేషన్‌ కౌంటర్‌లో రూ.1.32 లక్షలు కాజేసి, ఆనక చోరీ నాటకమాడిన కౌంటర్‌ ఉద్యోగి, అతడి భార్య కటకటాలపాలయ్యారు. వివరాలిలా... చెన్నై బీచ్‌ - వేళచ్చేరి మార్గంలో వున్న తిరువాన్మియూరు రైల్వే స్టేషన్‌ కింది అంతస్తులో ఎంఆర్‌టీఎస్‌ టిక్కెట్‌ కౌంటర్‌ వుంది. కొంతమంది దుండగులు సోమవారం తెల్లవారు జామున 4 గంటలకు ఆ కౌటర్‌లో పనిచేస్తున్న టీకారాం మీనాను కట్టేసి, కౌంటర్‌లోని డబ్బులు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రైల్వే స్టేషన్‌ను పరిశీలించారు. అయితే ఆ స్టేషన్‌లో ఒక్క సీసీ కెమెరా కూడా లేక పోవడంతో రాజీవ్‌గాంధీ రోడ్డులో వున్న సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలను పరిశీలించారు. టీకారాంమీనా రైల్వేస్టేషన్‌ వద్దకు వచ్చిన కొద్ది సేపటికే ఆయన భార్య సరస్వతి (25) కూడా మరో ఆటోలో వచ్చినట్టుగా కనిపించింది. దీనిని ఆధారంగా చేసుకుని పోలీసులు మంగళవారం ఆ దంపతులను ఎగ్మూరు రైల్వే భద్రతా పోలీసు ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లి విచరాణ జరిపారు. అప్పుడు అసలు విషయం బయల్పడింది. ఆ చోరీ చేసింది తానేనని టీకారాం మీనా అంగీకరించాడు. ఆన్‌లైన్‌లో డబ్బు పోగొట్టుకున్నానని, ఆ అప్పుల్ని తీర్చేందుకు కౌంటర్‌ డబ్బు కాజేయాలని పథకం రూపొందించానని చెప్పాడు. తన పథకం మేరకు తన భార్య సరస్వతే తనను తాళ్లతో కట్టేసి, డబ్బు తీసుకెళ్లిందని అంగీకరించాడు. కౌంటర్‌లో కాజేసిన రూ.1.32 లక్షలతో అప్పులు తీర్చుకుని, ప్రశాంతమైన జీవితం గడుపుదామని భావించానని కన్నీటిపర్యంతమయ్యాడు. 

Updated Date - 2022-01-05T14:15:32+05:30 IST