వలస గోస

ABN , First Publish Date - 2020-05-06T10:41:18+05:30 IST

ఒక వైపు మండే ఎండలు, మరోవైపు కడుపులో ఆకలి మంటలు వలస కార్మికులను మాడ్చుకుతింటున్నాయి.

వలస గోస

ఓ వైపు ఆకలి మంటలు.. మరో వైపు మండే ఎండలు 

చపాతీల కోసం తపిస్తున్న ఉత్తరాది కార్మికులు

దినసరి కూలీలకు దినదిన గండం


(ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్‌): ఒక వైపు మండే ఎండలు, మరోవైపు కడుపులో ఆకలి మంటలు వలస కార్మికులను మాడ్చుకుతింటున్నాయి. కరోనా వారి బతుకులపై కాటు వేసింది. సర్కారు సాయం అందిస్తున్నా స్వచ్చంద సేవా సంస్థలు దయార్ధ హృదయం ఉన్న ప్రజలు రోజు వారిగా వంటలు వండి ఆహారం అందజేస్తున్నారు. దానిని వారు బతకడానికి తింటున్నారే తప్ప చిన్ననాటి నుంచి అలవాటైన చపాతీల కోసం ఉత్తరాది  కార్మికులు తపిస్తున్నారు. ఎలాగైనా సొంత గ్రామాలకు వెళ్లాలనుకుంటున్నారు. రైళ్లు, బస్సులు బంద్‌ కావడంతో కాలినడకన స్వస్థలాలకు పయనమవుతున్నారు.


జిల్లాలో 18,926 మంది వలస జీవులు

 జిల్లాలో 18,926 మంది వలస కార్మికులు ఉన్నారు. వీరిలో కాళేశ్వరం ప్రాజెక్టు పనుల కోసం, గ్రానైట్‌ పరిశ్రమలో పని చేసేందుకు  వచ్చిన వారి  పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. మిగతావారు నీడ కోసం, కూడు కోసం అల్లాడుతున్నారు. తాటాకు గుడిసెలు, రేకుల షెడ్లు, ప్లాస్టిక్‌ నీడలు, ఎండ తీవ్రతను ఆపలేక పోతుండడంతో మలమలా మాడుతున్నారు. పనులు లేక, తినేందుకు తిండి లేక ఇంటికి వెళ్తామన్నా పోయే వీలులేక సతమతమవుతున్నారు. 


ఒడిస్సాకు చెందిన వారే అత్యధికం

జిల్లాలో కరీంనగర్‌ రూరల్‌, కొత్తపల్లి, గంగాధర, తిమ్మాపూర్‌, రామడుగు, మానకొండూర్‌, జమ్మికుంట, హుజూరాబాద్‌, చొప్పదండి, చిగురుమామిడి, శంకరపట్నం, వీణవంక మండల్లాల్లో వలస కార్మికులు ఉన్నారు.  వీరిలో ఒడిస్సాకు చెందిన వారే  7,601 మంది ఉన్నారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన వారు 2,833 మంది, మధ్యప్రదేశ్‌కు చెందిన వారు 1,398 మంది, రాజస్థాన్‌కు చెందిన వారు 1,395 మంది, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారు 1,327 మంది, బిహార్‌కు చెందిన వారు 1,124 మంది, అసోంకు చెందిన వారు 694 మంది, మహారాష్ట్రకు చెందిన వారు 830 మంది, పశ్చిమబెంగాల్‌కు చెందిన వారు 413 మంది, తమిళనాడుకు చెందిన వారు 123 మంది జిల్లాలో వలస కార్మికులుగా పనిచేస్తున్నారు. మిగతా రాష్టాలకు చెందిన వారు పదుల సంఖ్యలో ఉన్నారు. 


రాష్ట్ర ప్రభుత్వం బియ్యం ఇచ్చినా..

రాష్ట్ర ప్రభుత్వం వలస కార్మికులందరికీ నెలకు 12 కిలోల బియ్యం, ఒక్కొక్కరికి ఖర్చుల నిమిత్తం 500 రూపాయలు ఇస్తున్నది. ఉత్తరాది ప్రాంత వలసదారులు చిన్ననాటి నుంచి చపాతి మాత్రమే తినే అలవాటు ఉన్నవారు కావడంతో బియ్యంతో వండిన అన్నం తినలేక పోతున్నారు. ప్రభుత్వం ఇచ్చే 500 రూపాయలు సరిపోకపోవడంతో అర్ధాకలితో అలమటిస్తున్నామని అంటున్నారు. ఇప్పటికే కొన్ని వేల మంది ఇంటి బాటపట్టారు. 


కలెక్టరేట్‌లో ప్రత్యేక సెల్‌

కలెక్టరేట్‌లో ఒక ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేసి ఇంటికి వెళ్ళాలనుకుంటున్న వలస కార్మికుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. బుధవారం నుంచి పోలీసులు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. రామగుండం నుంచి వలస కార్మికులను తరలించడానికి త్వరలో ప్రత్యేక రైళ్ళు బయలు దేరే అవకాశమున్నదని అధికారవర్గాలు చెబుతున్నాయి. జిల్లాలోని వలస కార్మికులకు ఏప్రిల్‌లలో 227.11 మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున 94.63 లక్షల నగదును అందజేశారు. మే మాసానికి సంబంధించిన రేషన్‌, నగడు పంపిణీ ఇంకా ప్రారంభంకాలేదు.

 

పని లేదు.. మా ఊరు వెళతాం..గత్తలాహారి రమేషిన్‌, ఛత్తీస్‌గఢ్‌ వలస కార్మికురాలు

పని చేద్దామంటే లేదు. చిన్న పూరిగుడిసెలో చిన్నపిల్లలతో నలుగురం ఉంటున్నాం. తినడానికి తిండి లేదు. పనులు ఎప్పుడు మొదలవుతాయో తెలియడం లేదు. మా ఊరికి పంపిస్తే అక్కడ కూలీనాలీ చేసుకొని బతుకుతాం.


చేతిలో చిల్లి గవ్వ లేదు:  దేవుడ ధర్మి, రాజస్థాన్‌ వలస కార్మికురాలు 

ప్లాస్టిక్‌ పువ్వులు, గాజు గ్లాసులు అమ్ముకొని జీవించేవాళ్లం. లాక్‌డౌన్‌తో అమ్మకాలు నిలిచిపోయాయి. చేతిలో చిల్లిగవ్వ లేదు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. దాతలు ఇస్తున్న ఆహార పొట్లాలతో కడుపునింపుకుంటున్నాం. మా రాష్ట్రానికి పంపిస్తే అక్కడే ఏదో పనిచేసుకొని బతుకుతాం.


Updated Date - 2020-05-06T10:41:18+05:30 IST