సాగర్‌ బరిలో 41 మంది అభ్యర్థులు

ABN , First Publish Date - 2021-04-04T08:40:23+05:30 IST

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో మరో కీలక ఘట్టం ముగిసింది. శనివారం అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ పూర్తయింది.

సాగర్‌ బరిలో 41 మంది అభ్యర్థులు

  • 16 మంది నామినేషన్ల ఉపసంహరణ
  • పట్టుకొచ్చి విత్‌డ్రా చేయించారు
  • కొనసాగుతున్న చపాతి రోలర్‌ గుర్తు
  • టీఆర్‌ఎస్‌కు ఇబ్బందిగా మారే చాన్స్‌
  • కాంగ్రెస్‌ వైపే లెఫ్ట్‌.. నేడు ప్రకటన?

నల్లగొండ, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో మరో కీలక ఘట్టం ముగిసింది. శనివారం అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ పూర్తయింది. మొత్తం 77 మంది నామినేషన్లు వేయగా 17 మంది అభ్యర్థుల నామినేషన్లు ముందే తిరస్కరణకు గురయ్యాయి. ఇంతకుముందు ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా.. చివరిరోజు మరో 16 మంది విత్‌డ్రా చేసుకున్నారు. దీంతో 41 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అభ్యర్థుల సంఖ్య భారీగా ఉంటే ప్రమాదమని భావించిన ఓ ప్రధాన పార్టీ.. నామినేషన్లు వేసిన వారిని గాలించి పట్టుకొని ఉపసంహరింప చేయించినట్లు సమాచారం. వీరిలో 15 మంది అభ్యర్థులు ఉపసంహరణ గడువు సమయం ముగిసే 15నిమిషాల ముందు ఒకేసారి రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి వచ్చారు. అయినా అభ్యర్థుల సంఖ్య భారీగా ఉండటంతో మూడు ఈవీఎంలు ఏర్పాటు చేయడం అనివార్యంగా మారింది. ఇదిలా ఉండగా.. కారు గుర్తుకు దగ్గరి పోలికలు ఉండే చపాతి రోలర్‌ గుర్తును కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఇంకా తొలగించకపోవడంతో టీఆర్‌ఎస్‌ నేతల్లో కొంత ఆందోళన నెలకొంది. దుబ్బాక ఉపఎన్నికలో చపాతి రోలర్‌ గుర్తు కలిగిన అభ్యర్థికి 3,507 ఓట్లు రావడం గమనార్హం.


కులాలపైనే పార్టీల గురి..

సాగర్‌ ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు కులం, డబ్బు పంపిణీ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. రెడ్డి సామాజికవర్గం అభ్యర్థికి టికెట్‌ ఇచ్చిన కాంగ్రెస్‌.. ఆ వర్గం ఓట్లు గంపగుత్తగా వేయించుకోవాలని భావిస్తోంది.  ఆ పార్టీ 17 మంది ఎన్నికల ఇన్‌చార్జులను నియమిస్తే అందులో ఏడుగురు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. మరోవైపు యాదవుల ఓట్లపై గురి పెట్టిన టీఆర్‌ఎస్‌.. మంత్రి తలసాని, ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌కు పూర్తి బాధ్యత అప్పగించింది. లంబాడ సామాజికవర్గానికి టికెట్‌ కేటాయించిన బీజేపీ.. ఆ వర్గం ఓట్లను ఆకర్షించేందుకు 110 మంది మాజీ ఐఏఎస్‌, ఐపీఎస్‌, గ్రూప్‌-1 లంబాడ సామాజికవర్గానికి చెందిన అధికారులను ప్రచారానికి దించుతోంది. 


టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జులకు సీఎం ఫోన్‌ భయం..

టీఆర్‌ఎస్‌ ప్రచార బాధ్యతలను మండలాల వారీగా ఎమ్మెల్యేలకు అప్పగించగా వారికి సీఎం కేసీఆర్‌ నుంచి ఫోన్‌ భయం పట్టుకుంది. బాధ్యతల్లో ఉన్న ఎమ్మెల్యేలు స్థానికంగా ఉన్నారా? లేదా? ఉంటే ప్రచారంలో ఉంటున్నారా? విశ్రాంతి తీసుకుంటున్నారా? అన్న వివరాలను సీఎం కేసీఆర్‌ తెలుసుకుంటున్నారు. నిఘా వర్గాలు, జీపీఎస్‌ ద్వారా ఎమ్మెల్యే సెల్‌ఫోన్‌ మూమెంట్‌ను తెలుసుకొని సీఎం లైన్‌లోకి వస్తున్నారు. పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకొనే అలవాటు ఉన్న నిజామాబాద్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే ఇటీవల చెప్పా పెట్టకుండా తన నియోజకవర్గానికి వెళ్లి రెండు రోజలు ఉన్నారు. ఓ రోజు అర్ధరాత్రి సీఎం నుంచి సదరు ఎమ్మెల్యేకు తీవ్ర చీవాట్లు పడ్డాయి. దీంతో వెంటనే బయల్దేరిన ఆ ఎమ్మెల్యే తనకు కేటాయించిన నిడమనూరు మండలానికి తెల్లవారుజామున 5గంటల కల్లా చేరుకున్నారు. ఇక ఆదిలాబాద్‌కు చెందిన ఓ ఎమ్మెల్యేకు ఎన్నికల డ్యూటీ వేసినా రావడానికి ఒకరోజు జాప్యం చేశారు.


ఆలస్యానికి కారణమేంటని ప్రశ్నించగా వంద మంది అనుచరులను సమీకరించుకుంటున్నానని ఆ ఎమ్మెల్యే చెప్పారు. మరో ఆరు గంటల వ్యవధిలో వందమందితో వెళ్లిపోవాలని ఆదేశించడంతో ఆయన హుటాహుటిన హాలియా మండలానికి చేరుకున్నారు. స్థానికంగా సౌకర్యాలు లేవని ఓ ఇన్‌చార్జి.. సమీపంలోని మిర్యాలగూడలో నిద్రించేందుకు వెళ్లగా అర్ధరాత్రి సీఎం కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చింది. దీంతో తెల్లారి 3 గంటల కల్లా ఆయన సాగర్‌లోని ఎన్‌ఎ్‌సపీ క్వార్టర్స్‌కు చేరుకున్నారు. 


జానాకి కామ్రేడ్‌ల మద్దతు?

సాగర్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డికి మద్దతు ఇచ్చే యోచనలోల వామపక్షాలు ఉన్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీపై నిత్యం పోరాడుతూ, విమర్శలు, ఆరోపణలు చేస్తూ.. ఆ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వలేమని భావిస్తున్నారు. జానారెడ్డి గెలిచేందుకు అవకాశం ఉండటం, రాష్ట్రంలో బీజేపీని నిలువరించాలన్న లక్ష్యంతో కాంగ్రె్‌సకు మద్దతు తెలిపే ఆలోచనలో వారు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రకటన నేడో, రేపో వెలువడవచ్చని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. 

Updated Date - 2021-04-04T08:40:23+05:30 IST