ఏదీ సూది?

ABN , First Publish Date - 2021-09-18T08:11:34+05:30 IST

కరోనా టీకా కోసం వినియోగించే ఆటోడిజేబుల్‌ సిరంజీ(ఏడీ) లభ్యత చాలా తక్కువగా ఉంది.

ఏదీ సూది?

  • వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌కు ఏడీ సిరంజీల కొరత
  • ఉన్నవి 16 లక్షలే.. సరిపోయేది 3 రోజులకే 
  • దేశవ్యాప్తంగా సిరంజీలకు తీవ్ర కొరత


హైదరాబాద్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి):  కరోనా టీకా కోసం వినియోగించే ఆటోడిజేబుల్‌ సిరంజీ(ఏడీ) లభ్యత చాలా తక్కువగా ఉంది. దీంతో కరోనా టీకా కార్యక్రమంపై దాని ప్రభావం పడనుంది. రాష్ట్రంలో రోజుకు ఐదు లక్షల మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆమేరకు 21.5 లక్షల వ్యాక్సిన్‌ నిల్వలు కూడా ఉన్నాయి. కానీ కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసేందుకు అవసరమైన సిరంజీలు 16లక్షలు మాత్రమే ఉన్నాయి. ఇవి మూడు రోజులకే సరిపోతాయని వైద్యవర్గాలు తెలిపాయి. ఇవన్నీ కూడా అన్ని జిల్లాల్లోని టీకా కేంద్రాల వద్ద ఉన్నాయి. ఎక్కడైనా ఎక్కువగా వ్యాక్సినేషన్‌ జరిగితే అక్కడ సిరంజీల కొరత ఏర్పడుతోంది. గురు, శుక్రవారాల్లో జరిగిన వ్యాక్సినేషన్‌లో కొన్నిచోట్ల సిరంజీలు లేక టీకా కార్యక్రమం నిలిచిపోయినట్లు సమాచారం. భారీఎత్తున వ్యాక్సిన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టడంతో ఇప్పుడు వ్యాక్సిన్‌ కంటే సిరంజీల సేకరణ కష్టంగా మారిందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. 


అయితే ఒకటి రెండు రోజుల్లో మరో 15-16 లక్షల సిరంజీలు అందుబాటులోకి వస్తాయని వైద్యవర్గాలు తెలిపాయి. ఉత్తర భారతదేశం నుంచి వాటిని కొనుగోలు చేస్తున్నారు. కేంద్రం ఇప్పటివరకు 2 కోట్లకుపైగా వ్యాక్సిన్‌ డోసులను రాష్ట్రానికి పంపినా  1.6 కోట్ల సిరంజీలనే పంపింది. వీటి కొరతను ముందుగానే ఊహించిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆమేరకు ఓ ఉత్పత్తి సంస్థతో కోటి సిరంజీల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. అందులో భాగంగా ఇప్పటిదాకా 40 లక్షల సిరంజీలను కొనుగోలు చేసింది.   


ప్రతీవారం 5 లక్షల సిరంజీలు పంపాలని సంస్థను కోరింది.. ఇప్పటివరకు ఆ సంస్థ అలాగే పంపింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం టీకా వ్యుహాన్ని మార్చేసి.. రోజుకు ఐదు లక్షల డోసులు వేయాలని నిర్ణయించడంతో సిరంజీలు సరిపోవడం లేదు. దేశవ్యాప్తంగా సిరంజీల ఉత్పత్తి చాలా తక్కువగా ఉండటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. తాజాగా ప్రతివారం పంపే ఐదు లక్షల సిరంజీలకు అదనంగా మరో 2-3 లక్షలు పంపాలని ఉత్పత్తి సంస్థను వైద్యశాఖ కోరింది.  ఇతర ప్రత్యామ్నాయ మార్గాల్లో వాటి సేకరణ చేస్తున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. 


కేరళ, ఒడిసా, మహారాష్ట్ర, తమిళనాడులో.. 

కొవిడ్‌ టీకా కార్యక్రమానికి తగినంతగా సిరంజీలు లేకపోవడంతో కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌కు ఆటంకం ఏర్పడిం ది. ఇటీవల అన్ని రాష్ట్రాలతో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్స్‌లో ఈ అంశాన్ని కేరళ, ఒడిసా, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు కేంద్రం దృష్టికి తీసుకువచ్చాయి. వీలైనంత త్వరగా సిరంజీలను పంపాలని కోరాయి.  

Updated Date - 2021-09-18T08:11:34+05:30 IST