అక్కడ–ఇక్కడ

ABN , First Publish Date - 2020-06-13T05:53:05+05:30 IST

మొన్నమే 25 నాడు అమెరికాలోని మినియపొలిస్‌లో జార్జి ఫ్లాయిడ్‌ అనే నల్లజాతి అమెరికన్‌ను పోలీసులు క్రూరంగా చంపిన సంఘటన ఆ దేశంలో ఇప్పటికీ చల్లారని మహోద్యమాన్ని సృష్టించింది...

అక్కడ–ఇక్కడ

మొన్నమే 25 నాడు అమెరికాలోని మినియపొలిస్‌లో జార్జి ఫ్లాయిడ్‌ అనే నల్లజాతి అమెరికన్‌ను పోలీసులు క్రూరంగా చంపిన సంఘటన ఆ దేశంలో ఇప్పటికీ చల్లారని మహోద్యమాన్ని సృష్టించింది. నల్లవారివీ ప్రాణాలే, వాటికీ విలువ ఇవ్వాలి– అన్న నినాదంతో సాగుతున్న పోరాటానికి ప్రపంచవ్యాప్తంగా సంఘీభావం, సహానుభూతి వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో వ్యవస్థీకృతమైన వర్ణ వివక్షను ప్రశ్నించడంతోపాటు, మైనారిటీల మీద, ముఖ్యంగా నల్లవారి మీద శ్వేతజాతిపోలీసుల దాష్టీకానికి వ్యతిరేకంగా పోరాటం ముందుకు వెడుతున్నది. రోడ్నీ కింగ్‌ ఘటన నుంచి, అంతకు ముందు నుంచి ఈ సంఘటనలు, ప్రతిఘటనలు ఉంటున్నా ఈ సంవత్సరారంభం నుంచి నల్లవారిపై జరిగిన అనేక దౌర్జన్యకర సంఘటనలు ప్రస్తుత నిరసనోద్యమానికి నేపథ్యంగా ఉన్నాయి. ప్రస్తుత ఉద్యమానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే–అనేక మంది ఇతర మైనారిటీ శ్రేణులతో పాటు, శ్వేతజాతి ఉదారవాదులు, వర్ణవివక్ష వ్యతిరేకులు కూడా క్రియాశీలంగా పాల్గొంటున్నారు. అదే సమయంలో, ఈ ఉద్యమంతో కరుడుగట్టిన తెల్లజాతి ఉన్మాదులు మరింతగా సంఘటితం అయ్యేట్టు కనిపిస్తున్నదని, వచ్చే ఎన్నికలలో శ్వేతజాతి దురహంకారులు, మితవాదులు, వలసదారుల వ్యతిరేకులు తిరిగి డొనాల్డ్‌ ట్రంప్‌కు గట్టి మద్దతు వర్గంగా తయారయ్యే అవకాశం ఉన్నదని పరిశీలకులు చెబుతున్నారు. 


మైనారిటీలకు, వారికి ఉన్న హక్కులకు వ్యతిరేకంగా బాహాటంగా మాట్లాడుతూ మెజారిటీ ప్రజలను ఆకట్టుకునే రాజకీయనేతలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువవుతున్నారు. తమ తమ దేశాల ఆర్థిక వ్యవస్థలకు, భద్రతకు మైనారిటీల నుంచి, అక్రమ వలస దారుల నుంచి పెను ప్రమాదం ఉన్నదని పదే పదే ప్రచారం చేస్తూ, అధికసంఖ్యాకులలో అభద్రతాభావంతో కూడిన తీవ్రజాతీయవాదాన్ని రగిలించడానికి ఈ నేతలు ప్రయత్నిస్తున్నారు. అమెరికా నల్లజాతి ఉద్యమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా గమనిస్తూ ఉండడానికి ఈ వాతావరణమే కారణం. నిరసన కారులు శ్వేతసౌధంలోకి చొచ్చుకుపోయారని, అధ్యక్షులవారే బంకర్‌లోకి దూరి దాక్కున్నారని వచ్చిన వార్తలు, అందరు ఉద్యమకారులకు ఉత్సాహాన్నిచ్చాయి. స్థానిక రాజకీయ నాయకులు సైతం తాము ప్రత్యర్థిగానో, నియంతగానో భావించే నేతను హెచ్చరించేటప్పుడు, ట్రంప్‌ బంకర్‌ ఉదంతాన్ని ప్రస్తావిస్తున్నారు. 


జార్జి ఫ్లాయిడ్‌ ఉదంతాన్ని భారతదేశంలోని మైనారిటీలు ఒకందుకు, దళితులు మరొకందుకు తమకు అన్వయించుకుంటున్నారు. ఇద్దరి అన్వయంలోనూ సబబు ఉన్నది. దళితుల పరిస్థితి సాంప్రదాయికంగా నల్లజాతివారి స్థితితో పోలికకు వచ్చేదే. అమెరికాలో నల్లజాతివారి చైతన్యస్ఫూర్తిని ఆవాహన చేసుకుంటూనే, దళిత ఉద్యమకారులు భారత్‌లో ఫ్లాయిడ్‌ ఉదంతానికి స్పందిస్తున్నవారి ద్వంద్వ ప్రవృత్తిని ప్రశ్నిస్తున్నారు. జార్జి ఫ్లాయిడ్‌తో బక్కి శ్రీను ను పోలుస్తున్నారు. అక్కడెక్కడో జరిగిన వర్ణ వివక్షను ప్రశ్నించడం సులువే కానీ, కళ్లెదుట ఉండే కులవివక్షను ప్రశ్నించే నిజాయితీ ఉందా అని ప్రశ్నిస్తున్నారు. సర్వ సమానత్వం కోరే ప్రగతిశీలురకు కూడా కులం అంటు మిగిలే ఉంటుందన్న విమర్శ దళిత, బహుజనవాదులకు ఉన్నది. అందుకు తగ్గట్టుగానే, ఆయా శిబిరాలలో స్పందనల్లో వ్యత్యాసాలు కనిపిస్తాయి. అయితే, అదే సమయంలో, అమెరికాలో కనిపిస్తున్నంత స్థాయి ఉద్యమం భారత్‌లో దళితుల నుంచి సాధ్యమా? దళితులలో తగినంత మంది లక్ష్యశుద్ధి, సంకల్పబలం ఉన్నవారు ఉన్నప్పటికీ, అధికార పార్టీల అనుయాయులుగా, అవకాశవాద సంస్థలుగా వ్యవహరిస్తున్న శక్తులను విమర్శించకుండా ఉండలేము. బహుశా, భారత్‌ వంటి దేశంలో చైతన్యం, సంసిద్ధత, సమీకరణలకు ఇంకా సమయం అవసరం కావచ్చు. 


ప్రపంచవ్యాప్త మితవాద ప్రభంజనానికి లోనయిన దేశాల్లో భారత్‌ కూడా ఒకటి. ఈ వెల్లువలో కొట్టుకుపోయినవారికి, పోతున్నవారికి అమెరికాలో ఉద్యమమైనా నచ్చదు. అమెరికా ఉద్యమం లాంటిది ఇక్కడా రావాలని ఆశిస్తేనూ నచ్చదు. మనదేశంలో కూడా ఇటువంటి ఉద్యమం రావాలి అన్నందుకు వినోద్‌ దువా అనే సీనియర్‌ పాత్రికేయుడి మీద కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక అమెరికాలో ఉన్న భారతీయ మితవాద భక్తులకు నల్లవారి పొడ కూడా గిట్టదు. భారతీయ ప్రవాసులు సంప్రదాయికంగా డెమొక్రటిక్‌ పార్టీవైపు మొగ్గు చూపేవారు. ఈ మధ్య రిపబ్లికన్‌ల సంఖ్య పెరుగుతోంది. జార్జి ఫ్లాయిడ్‌ పై సానుభూతి చూపేవారు, నల్లవారి దారి దోపిడీలకు దొంగతనాలకు, కాల్పులకు బాధితులైనవారికి నివాళులివ్వలేదేం– అని అమెరికన్‌ భారతీయులు కొందరు ప్రశ్నిస్తున్నారు. గోధుమరంగు వారిగా భారతీయులు కూడా అమెరికాలో వర్ణవివక్ష ఎదుర్కొంటున్నారు. అందుకే, వెనక్కి పంపుతారనే భయం ఉన్నప్పటికీ, భారతీయ విద్యార్థులు సైతం నల్లవారి ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. అయినప్పటికీ, తాము నల్లవారి కంటె కొంచెం తెల్లవారమని వారికి భ్రమ. తెల్లవారితో తమకు సమానత్వం సాధ్యమని నమ్ముతూ, నల్లవారిని, మెక్సికన్లను ద్వేషిస్తూ గడిపేవారి సంఖ్య అక్కడ తక్కువ లేదు. 


ఫ్లాయిడ్‌ సంఘటనతో అమెరికాకు ప్రపంచనాయకత్వాన్ని చెలాయించే నైతిక హక్కు పోయిందని కొందరు వ్యాఖ్యానించారు. భారత్‌ కూడా దళితుల పట్ల దారుణమైన అమానవీయమైన వివక్షను చూపడం మానినప్పుడే, మైనారిటీల విషయంలో క్రూరమైన అసహనాన్ని, దౌర్జన్యాన్ని విరమించినప్పుడే, నైతిక గౌరవాన్ని పొందగలుగుతుంది.

Updated Date - 2020-06-13T05:53:05+05:30 IST