తరలివెళ్తుంటే తల్లడిల్లుతున్నారు!?

ABN , First Publish Date - 2020-07-11T09:22:11+05:30 IST

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో దినదిన ప్రవర్దమానంగా వెలుగొందిన భద్రాచలం..

తరలివెళ్తుంటే తల్లడిల్లుతున్నారు!?

తాజాగామండలపరిషత్‌ కార్యాలయం తరలింపు

భద్రాద్రి భవితవ్యంపైనే సర్వత్రా చర్చ


భద్రాచలం, జూలై 10: గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో దినదిన ప్రవర్దమానంగా వెలుగొందిన భద్రాచలం.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం చోటు చేసుకుంటున్న పరిస్థితుల నేపథ్యం లో తన ఉనికిని కోల్పోతోందనే వ్యాఖ్యలు భద్రాద్రివాసులనుంచి వినిపిస్తున్నాయి. పోలవరం ముంపు మండలాలు ఏపీలో విలీనం చేయడం తో భద్రాచలం మండల ముఖచిత్రమే మారింది. భౌగోళికంగా ఎనిమిది మండలాలతో ఉన్న భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం నేడు ఐదు మండలాలకే పరిమితమైంది. అలాగే వాజేడు, వెంకటాపురం మండలాలు ములుగుజిల్లా పరిధిలోకి వెళ్లాయి. అంతేకాదు ప్రతిభ పాఠశాల, ఆర్‌అండ్‌బీ ఈఈ కార్యాలయం, మైనార్టీ గురుకుల పాఠశాల, పాలిటెక్నిక్‌ ఇలా ఒకదాని వెంట ఒకటి తరలిపోయాయి. నాడు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే తొలుత భద్రాచలమే జిల్లా కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని ఆనాటి తెలంగాణ ఉద్యమకారులు చేసిన బాసలు అడియాసలయ్యాయి.


తాజాగా భద్రాచలం మండలపరిషత్‌ను ఆళ్లపల్లికి తరలించడం.. భద్రాచలం మండలపరిషత్‌ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందిని వివిధ ప్రాంతాలకు బదలాయించడంతో మళ్లీ ఈ విష యంపై సర్వత్రా చర్చ నెలకొంది. భద్రాద్రిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకిలా వ్యవహరి స్తున్నాయి? ఇంత జరుగుతున్నా.. ప్రజా ప్రతినిధులు, ప్రధాన రాజకీయపక్షాలు ఎందుకు నోరు మెదపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.


ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే నాయకులు అరచేతిలో స్వర్గాన్ని చూపుతూ అనంతరం భద్రాద్రి అభివృద్ధి, విస్తరణ తదితర అంశాలపై దృష్టిసారించకపోవడం వారికి భద్రాద్రిపై ఉన్న చిత్తశుద్ధిని చెప్పకనే చెబుతోందని స్థానికులు వాపోతున్నారు. తాజాగా ఎంపీవో (ఈవోఆర్డీ)గా, భద్రాచలం పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన సీహెచ్‌.శ్రీనివాసరావు ఆళ్లపల్లిలో శుక్రవారం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. దీంతో భద్రాచలం ఎంపీడీవో కార్యాలయంలో పోస్టులన్నీ ఆళ్లపల్లితోపాటు వివిధ ప్రాంతాలకు తరలివెళ్లిపోయాయి. ఇకనుంచి ఎంపీడీవో కార్యాలయం కార్యకలాపాలు స్తంభించనున్నాయి. 

Updated Date - 2020-07-11T09:22:11+05:30 IST