సొంత యాప్‌.. సవాళ్లు ఎన్నో!

ABN , First Publish Date - 2020-07-11T06:26:50+05:30 IST

నిర్భర్‌ యాప్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌’ ఆహ్వానించదగ్గ పరిణామం. కనీసం ఇప్పటికైనా వివిధ అవసరాల కోసం మనకంటూ కొన్ని సొంత యాప్స్‌ తయారు చేసుకోవడానికి ప్రభుత్వం తన వంతు సహకారం అందించడం ప్రశంసించదగ్గ విషయం

సొంత యాప్‌.. సవాళ్లు ఎన్నో!

ఇతర దేశాల యాప్స్‌పై ఆధారపడడం  ఎందుకు? మనమే సొంతంగా యాప్స్‌ తయారుచేద్దాం! మీకు కావాల్సిన సహాయ సహకారాలు మేం అందిస్తాం అంటూ భారత ప్రభుత్వం ‘ఆత్మనిర్భర్‌ యాప్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌’ను తీసుకొచ్చింది. మరి యాప్‌ రూపొందించడం అంత సులువేనా? అందులో ఎదురయ్యే సవాళ్లు ఏంటి? ఆ విశేషాలు ఇవి...


కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘ఆత్మ

నిర్భర్‌ యాప్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌’ ఆహ్వానించదగ్గ పరిణామం. కనీసం ఇప్పటికైనా వివిధ అవసరాల కోసం మనకంటూ కొన్ని సొంత యాప్స్‌ తయారు చేసుకోవడానికి ప్రభుత్వం తన వంతు సహకారం అందించడం ప్రశంసించదగ్గ విషయం. ఆఫీస్‌ మరియు వర్క్‌, హోమ్‌ టూల్స్‌, సోషల్‌ నెట్‌వర్కింగ్‌, ఇ-లెర్నింగ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, హెల్త్‌ వార్తలు, గేమ్స్‌ వంటి మొత్తం ఎనిమిది విభాగాల్లో యాప్స్‌ని అభివృద్ధి చేసే సంస్థలకు వెన్నుదన్నుగా నిలవడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే భారతీయ యాప్స్‌ సుదీర్ఘకాలం పాటు విదేశీ యాప్స్‌కి ప్రత్యామ్నాయాలుగా కొనసాగాలంటే వివిధ సవాళ్లు ఉన్నాయి. వాటిని సమర్థంగా ఎదుర్కోగలిగితే భారతీయ యాప్స్‌కి తిరుగే లేదు.


లెక్కలివి...

2020 మొదటి త్రైమాసిక గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మొబైల్‌ అప్లికేషన్లని డౌన్‌లోడ్‌ చేసుకునే వారిలో మొట్టమొదటి స్థానంలో ఉండేది భారతీయులే. కేవలం మూడు నెలల్లో 33.6 బిలియన్ల యాప్స్‌ ఇండియాలో డౌన్‌లోడ్‌ చేసుకున్నారు అంటే మన వాళ్లు ఎంత యాప్‌ ప్రియులో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో భారతీయ అవసరాల కోసమే కాకుండా విదేశీయులకి ఉపయోగపడే విధంగా సమర్థమైన, సురక్షితమైన యాప్స్‌ని ఇండియాలో తయారు చేయాలనుకోవడం సమయానుకూల నిర్ణయం. కేంద్ర ప్రభుత్వ ఎలకా్ట్రనిక్స్‌ మరియు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ గత నెలలో ప్రకటించిన ‘వీడియో కాన్ఫరెన్సింగ్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌’కి డెవలపర్ల నుండి రెండు వేల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో పన్నెండు దరఖాస్తులను షార్ట్‌లిస్టు చేసి, తదుపరి వడపోతలో ఐదు యాప్స్‌ని పూర్తి స్థాయి యాప్స్‌గా తీర్చిదిద్దమని ప్రభుత్వం కోరింది. వీటిలో మిగతా నగరాలతో పాటు హైదరాబాద్‌కి చెందిన ఓ సంస్థ కూడా నిమగ్నమై ఉండడం గమనార్హం.


సెక్యూరిటీ విషయంలో...

అప్లికేషన్లని రూపొందించడం ఒక ఎత్తయితే వాటిలో సెక్యూరిటీ లోపాలు లేకుండా జాగ్రత్త వహించడం అతి కీలకమైనది. గతంలో ఆధార్‌ యాప్‌, ఆరోగ్యసేతు వంటి ప్రతిష్ఠాత్మకంగా ప్రభుత్వం రూపొందించిన యాప్స్‌లోనే భద్రతాపరమైన లోపాల గురించి వివాదాలు నెలకొన్న విషయం గుర్తుంచుకోవాలి. అనేక సందర్భాల్లో చిన్నస్థాయి స్టార్ట్‌పలు, అప్లికేషన్‌ డెవలపర్లు యాప్‌ డెవల్‌పమెంట్‌ మీద మాత్రమే దృష్టి పెట్టగలుగుతారు. మెరుగైన సదుపాయాలతో కూడిన, ఆకర్షణీయమైన స్వరూపంతో కూడిన యాప్‌ రూపొందించడం వరకూ వారు విజయవంతం అవుతుంటారు గానీ సైబర్‌ భద్రత మీద వారికి కనీస అవగాహన ఉండదు. ఈ నేపథ్యంలో ఈ ఛాలెంజ్‌ల ద్వారా ప్రభుత్వం ఎంపిక చేసే అప్లికేషన్లు లోపభూయిష్ఠంగా ఉంటే కోట్లాది మంది భారతీయుల డేటా మళ్లీ ప్రమాదంలో పడే అవకాశముంది. అందుకే భద్రతాపరమైన అంశాల గురించి కూడా లోతుగా అధ్యయనం చేశాకే వాటిని ఎంపిక చేయాలి.


ప్రభుత్వ అజమాయిషీ

ప్రభుత్వం ఎంపిక చేసిన ఏ అప్లికేషన్‌పై కూడా కేంద్ర ప్రభుత్వ పెత్తనం ఉండకూడదు. ముఖ్యంగా చైనాలో వివిధ టెక్నాలజీ సంస్థలు అక్కడి ప్రభుత్వానికి ఎలా సమాచారాన్ని చేరవేస్తాయో అదే తరహా బానిస ధోరణి ఇక్కడ కొనసాగకూడదు. ఒకవేళ ఈరోజు అధికారంలో ఉన్న ప్రభుత్వమైనా, భవిష్యత్‌లో కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వమైనా వివిధ యాప్‌ల నుండి వినియోగదారుల సమాచారాన్ని సేకరించి దాన్ని తమ ఎన్నికల వ్యూహాలకు, ఇతర అవసరాలకు 

వాడుకోవడం మొదలుపెడితే ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడుతుంది. ఇప్పటికే ఫేస్‌బుక్‌-కేంబ్రిడ్జ్‌ ఎనలటికా కుంభకోణాన్ని మనం చూశాం. అలాంటి పరిస్థితులు ఇక్కడ రాకుండా జాగ్రత్త వహించాలి.


మౌలిక వసతులు

తాజాగా ‘ఎలిమెంట్స్‌’ అని ఓ సోషల్‌ యాప్‌ అందుబాటులోకి వచ్చింది. కొద్ది గంటల్లోనే రిజిస్ట్రేషన్‌ సమయంలో వినియోగదారులకి ఓటీపి రావడం నిలిచిపోయింది. ఆ సంస్థకు చెందిన ట్విట్టర్‌ ఖాతాలో ‘తాము సర్వర్లని అప్‌గ్రేడ్‌ చేస్తున్నామని, వేచి ఉండాలని’ పేర్కొన్నారు. చాలా ఏళ్లుగా మన దేశంలో తయారవుతున్న యాప్స్‌ పరిస్థితి ఇలాగే ఉంటోంది. దేశ జనాభా డిమాండ్‌కి తగ్గట్లు మౌలిక వసతులు ఉండడం లేదు. ఓటీపిలు పంపించడంతో మొదలయ్యే సమస్యలు యాప్‌ వినియోగంలో వివిధ దశల్లో కొనసాగుతూ ఉంటాయి. దీన్ని సాంకేతిక పరిభాషలో నాసిరకమైన యూజర్‌ ఎక్స్‌పీరియెన్స్‌ అంటారు! ఒకటి రెండుసార్లు ఇలాంటి సమస్యలు చూశాక ఒక సగటు వినియోగ దారుడు మళ్లీ ఆ యాప్‌ వైపు కన్నెత్తి చూడడు. ఫేస్‌బుక్‌, గూగుల్‌ వంటి సంస్థలు అందుకే కొన్ని యాప్స్‌ని మొదట యుఎ్‌సలో విడుదల చేసి, ఆ తర్వాత ఆ యాప్‌కి తగ్గ మౌలిక సదుపాయాలన్నీ అమర్చుకున్నాక ప్రపంచవ్యాప్తంగా వాటిని విస్తరిస్తుంటాయి. ఒక యాప్‌ ఒకేసారి ఎన్ని కనెక్షన్లకి సమర్థంగా సేవలు అందించగలుగుతుంది, అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ వంటి వాటిలో అది డిమాండ్‌కి తగిన ప్లాన్‌ ఎంపిక చేసుకునే ఆర్థిక స్థోమత ఉందా?  తనకంటూ డెడికేటెడ్‌ సర్వర్‌ కలిగి ఉంటే దాని ప్రాసెసర్‌, ర్యామ్‌, స్టోరేజ్‌ కాన్ఫిగరేషన్స్‌ ఏంటి? ఎలాంటి వెబ్‌ సర్వర్‌, డేటాబేస్‌ అప్లికేషన్స్‌ వాడుతున్నారు? అవి ఏ మొత్తంలో వనరులు వినియోగించుకుంటాయి వంటి అనేక అంశాలను బట్టి ఆ యాప్‌ పనితీరు ఆధారపడి ఉంటుంది. కాబట్టి భారతీయ యాప్స్‌కి డిమాండ్‌కి తగ్గ మౌలిక వసతులు సమకూర్చుకునే ఆర్థిక వెసులుబాటు ఉండాలి. దీనికి ప్రభుత్వ సహాయంతో పాటు, వెంచర్‌ క్యాపిటలిస్టులు ముందుకు వస్తే సమర్థమైన యాప్‌ తయారు చేయడం సులభమవుతుంది. ఏదేమైనా ఇన్నాళ్లకు భారత్‌ విదేశీ యాప్‌ల స్థానంలో తనకంటూ శక్తిమంతమైన, సురక్షితమైన యాప్‌లను రూపొందించడానికి అవసరమైన సహాయం అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ విషయంలో ప్రభుత్వం చూపిస్తున్న చొరవనీ, డెవలపర్ల ఉత్సాహాన్నీ తప్పకుండా ప్రశంసించాలి.


గోప్యతకు భంగం లేకుండా!

మన దేశం చైనా యాప్స్‌ని నిషేధించడం వెనుక ఓ బలమైన కారణం, అవి భారతీయుల డేటాని చైనాకి తరలిస్తున్నాయి అనే ఓ ఆరోపణ. వినియోగదారుడి యొక్క వ్యక్తిగతమైన సమాచారం ఏ విధంగానూ తస్కరించబడకూడదు, అది దుర్వినియోగం చేయబడకూడదు. చైనా యాప్స్‌ అయినా, భారతీయ యాప్స్‌ అయినా ఈ విషయంలో ఒకటే నియమాలు అమలులో ఉండాలి. ఒక వినియోగదారుడి ఫోన్‌లోని వివిధ సెన్సార్లు, పర్మిషన్ల నుండి సేకరించిన సమాచారాన్ని ఏ అవసరాలకు వాడుతున్నదీ, ఆ సమాచారాన్ని తమ సర్వర్లలో భద్రపరుస్తున్నారా? భద్రపరిస్తే దానికి ఎలాంటి రక్షణ కల్పిస్తున్నారు? ఏదైనా థర్డ్‌ పార్టీ సంస్థలతో కీలకమైన సమాచారాన్ని పంచుకుంటున్నారా? ఆ విషయాన్ని వినియోగదారుడికి ‘నియమ నిబంధనల్లో’ స్పష్టంగా తెలియజేస్తున్నారా? వంటివీ చాలా కీలకమైన అంశాలు. ఇప్పటికైతే మన దేశంలో పటిష్ఠమైన ప్రైవసీ చట్టాలు లేవు గానీ, ఈ డేటా ప్రైవసీ విషయంలో జాగ్రత్తపడకపోతే భవిష్యత్‌లో చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

Updated Date - 2020-07-11T06:26:50+05:30 IST