ఇంకా ఉంది

ABN , First Publish Date - 2021-09-17T06:01:08+05:30 IST

ఎలాజరిగితేనేమి, జరగవలసింది జరిగిపోయింది. నిండు నూరేళ్లు పచ్చగా చల్లగా బతకవలసిన చిన్నారిని చిదిమేసిన నీచుడు శవమైపోయాడు. వారం రోజుల నుంచి ఆగ్రహావేశాలతో అట్టుడికిపోతున్న బాధితురాలి కుటుంబసభ్యులకు ఇది కొంత ఉపశమనం...

ఇంకా ఉంది

ఎలాజరిగితేనేమి, జరగవలసింది జరిగిపోయింది. నిండు నూరేళ్లు పచ్చగా చల్లగా బతకవలసిన చిన్నారిని చిదిమేసిన నీచుడు శవమైపోయాడు. వారం రోజుల నుంచి ఆగ్రహావేశాలతో అట్టుడికిపోతున్న బాధితురాలి కుటుంబసభ్యులకు ఇది కొంత ఉపశమనం. పోయిన ప్రాణం తిరిగి రాకున్నా, ఏదో రూపంలో న్యాయం జరిగిందన్న సంతృప్తి కలగవచ్చు. సమాజంలో నేరమూ ఘోరమూ అన్నవి మునుపెన్నడూ విననట్టు ఉన్మాదంతో ఊగిపోతూ, నేరస్థుడిని చంపితీరాలని కోరుకుంటున్న వారికి ఇంకా కొంత అసంతృప్తి మిగిలి ఉండవచ్చు. నేరస్థుడి మృతదేహాన్ని జనాగ్రహం నుంచి కాపాడవలసి వస్తున్నది. 


ఇదంతా ఇట్లా జరగకపోతే బాగుండేది. పిల్లల్ని వాత్సల్యంతో చూడడమే సంస్కారమని, ఇతరులకు హానిచేయడం ప్రాణం తీయడం పరస్పర బాధ్యతతో మెలగ వలసిన సంఘంలో అసాంఘికత అని ఆ యువకుడికి తెలిసి ఉంటే బాగుండేది. ఆ పాప బతికి ఉండేది. ఈ యువకుడూ జీవితం ఇట్లా అర్ధంతరంగా ముగిసిపోకుండా తన బతుకేదో బతికేవాడు. చుట్టుపక్కల మనుషులు, ఈ ఘోరం తెలిసిన దూరప్రదేశాల వారూ ఇంతగా అభద్రతకు, అదుపులేని ఆందోళనకు లోనయి ఉండేవారు కాదు. ఈ ఒక్క పాపే కాదు, ఏ పాపకూ ఇట్లా జరగకూడదు. లోకంలో ఇదొక్కటే జరగలేదు, ఇంతటితో ముగియలేదు. నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. సైదాబాద్ నేరస్థుడి కోసం ఒక పక్కన గాలింపు జరుగుతుండగా, బాధిత బాలిక కుటుంబాన్ని ఓదార్చడానికి రాజకీయబాష్పాలు వరదలు కడుతుండగా కూడా మీర్‌చౌక్‌లో ఒక బాలికపై అఘాయిత్యం బయటపడింది. రైలుపట్టాల మీద నేరస్థుడి మృతదేహం దొరికిన వార్త వింటుండగానే, హైదరాబాద్ మంగళహాట్‌లో మరొక చిన్నారిపై అత్యాచారం సంగతి తెలిసింది. ఇక స్త్రీలపై నేరాల సంగతి అయితే చెప్పనక్కరలేదు. సగటున రోజుకు 77 అత్యాచారాలు, 80 హత్యలతో అమృతభారత్ అలరారుతున్నది. దోషులను వ్యక్తులుగా చట్టబద్ధంగానో, చట్టాన్ని దాటవేసి శిక్షిస్తేనో, లేదా వాళ్లంతట వాళ్లే శిక్షించుకుంటేనో ఈ నేరాలు తగ్గవు. ఈ సమాజంలో కల్మషం పేరుకున్నది, దాని దుర్గంధమే నేరం. మూలం నుంచి ప్రక్షాళన జరగకపోతే, కీటకాలు పుడుతూనే ఉంటాయి. 


చేసిన పనులు మంచీ చెడూ ఏవయినా మనుషులు బాధ్యత పడవలసిందే. పేదాగొప్పా పెద్దాచిన్నా తారతమ్యం లేకుండా సంఘనీతిని ఉల్లంఘించిన వారందరూ పర్యవసానాలు ఎదుర్కొనాలి. ఒకరి స్వేచ్ఛ ఇతరుల స్వేచ్ఛతో ముడిపడి ఉంటుంది. పరస్పరత సహజీవనానికి అవసరం. సమాజానికి హాని చేసి శిక్ష పొందేవారి పట్ల ఎటువంటి సానుభూతి ఉండనక్కరలేదు. ఇతరుల బిడ్డను చంపి ఆ కుటుంబానికి అపకారం చేసిన మనిషి, తాను మరణించి తన కుటుంబాన్ని అనాథను చేశాడు. ఇదొక విషాదం. కానీ, సమాజానికి ఉండవలసిన పట్టింపు, ఆందోళన వ్యక్తుల, కుటుంబాల నష్టానికి మించినది. నేరము, శిక్షలకు సంబంధించిన ప్రక్రియ, నాగరికంగా పక్షపాతానికీ అన్యాయానికీ ఆస్కారం లేకుండా ఉండేట్టు కొన్ని వేల సంవత్సరాల నాగరకతా ప్రయాణంలో మానవసమాజాలు రూపొందించుకున్నది. ఒక నేరాన్ని నిరసించే క్రమంలో ఆ సంస్కారానికి దూరం కావడం మంచిది కాదు. విచారణలే అక్కరలేని తక్షణ న్యాయాన్ని అమలుచేయాలని, ఏ న్యాయస్థానాలూ జైళ్లూ అక్కరలేదు మేమే శిక్షిస్తామని, ఆవేశకావేశాల మధ్యనే కావచ్చు, వీరంగాలు వేయడం ప్రోత్సహించదగినది, అనుమతించవలసినది కాదు. ఇటువంటి మంచిమాటలు ఎవరైనా చెప్పినప్పుడు వారు నిందితులను సమర్థిస్తున్నారనో, నేరాన్ని తక్కువ చేస్తున్నారనో నిందించడం ఏ మాత్రం మంచిది కాదు. 


బాధ్యత కలిగిన రాష్ట్ర మంత్రి, ప్రతిపక్షనాయకుడిగా ప్రజల విషయంలో మరింత బాధ్యతగా ఉండవలసిన ప్రతిపక్ష నేత, చట్టాన్ని దాటవేసి నిందితులను కాల్చివేయమని పిలుపునిస్తున్నారంటే, మన సమాజం ఎంతగా నేరమయమవుతున్నదో అర్థమవుతుంది. బాధితుల బంధువులు సరే, ఏ సామాజిక కార్యక్రమాలలో చురుకుగా ఉండని యువకులు కూడా ఎన్‌కౌంటర్లను కోరుతూ ప్లకార్డుల ప్రదర్శనలు చేస్తున్నారంటే ఏమనుకోవాలి? ఈ వాతావరణం కొనసాగితే ప్రభుత్వాలకు ఇక పట్టపగ్గాలుండవు. న్యాయం మందకొడిగా ఉండడం, పలుకుబడి కలిగిన నేరస్థులు ప్రక్రియలను తమకు అనుకూలంగా మలచుకోవడం, చాలా సందర్భాలలో నేరం, రాజకీయం కలగలసి ఉండడం.. ఈ కారణాల వల్ల సామాన్య ప్రజలలో చట్టబద్ధ న్యాయం మీద నమ్మకం సడలిపోయి ఉండవచ్చు. సకల వ్యవస్థలు స్పందించేట్టు, పనిచేసేట్టు ఒత్తిడి తేవాలి తప్ప, బహిరంగ, తక్షణ న్యాయాలను ఆశ్రయిస్తే, తాలిబన్లనో మరొకరినో తప్పు పట్టవలసిన పనేముంది? 


ఒక నేరస్థుడు చనిపోవడంతో ఆ నేరం పరిష్కారం అయి నట్టు కాదు. ఇక్కడ చర్చలో ఉన్న నేరం సామాజిక కారణాలు, వ్యవస్థ వైఫల్యాలు కలగలసి ఉన్న నేరం. నేరస్థుడిని శిక్షిస్తే, నేరం సమసిపోదు. ప్రభుత్వాలు ఆలోచించాలి, ప్రజాస్వామ్యంలో చొరవగా పాల్గొనాలని ప్రయత్నించే పౌరసమాజం ఆలోచించాలి. మనుషులం సున్నితత్వాన్ని కోల్పోతున్నాము. ఒకవైపు యావత్ సమాజాన్నీ, పెద్ద సంఖ్యలో ప్రజలనీ నష్టపరిచే నేరాలను ప్రశ్నించలేని ఉదాసీనతలో కూరుకుపోయి ఉన్నాము. మరొకవైపు విడి విడి నేరాలపై మాత్రం తీవ్రస్పందనలు చూపుతున్నాము. పిల్లలపై, ఆడవారిపై, పేదలపై, బలహీనులపై, బాధితులపై సమభావం, సహానుభూతి, కరుణ, ఆర్తి వంటి మానవీయ విలువలను, సంవేదనలను పెంపొందించే ప్రయత్నాలు జరగాలి.

Updated Date - 2021-09-17T06:01:08+05:30 IST