Abn logo
Jul 22 2021 @ 02:21AM

తాగండి.. ఊగండి!

సర్కారుకు సొమ్ములు కావాలి

మద్యంపై నియంత్రణ లేదు..నిషేధమూ రాదు

ప్రభుత్వానికి మందే ప్రధాన ఆదాయం

రుణ సమీకరణకూ అదే ఆధారం

మద్యంపై అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ పన్ను

ఈ ఆదాయం అప్పిచ్చిన సంస్థ ఖాతాకే!

ప్రతి సీసా నుంచి రుణానికే రూ.50

ఇప్పుడు ఇంకా రాబట్టే ప్రయత్నాలు

పర్యాటకం పేరుతో మరో 300 దుకాణాలు

వీటిలో నెలకు రూ.200 కోట్ల విక్రయాలు

దశలవారీ నిషేధానికి సర్కారు తూట్లు


  • ‘‘మేం ట్యాక్స్‌ పేయర్స్‌. మావల్లే ప్రభుత్వాలు నడుస్తున్నాయి’’ అని మందుబాబులు సరదాగా అంటుంటారు. కానీ, జగన్‌ సర్కారు దీనిని నూటికి నూరు శాతం నిజం చేస్తోంది.
  • ఇప్పుడు కొని తాగుతున్న మద్యమే కాదు... భవిష్యత్తులో కొని తాగబోయే మద్యం ఆదాయాన్నీ సర్కారు అప్పుల కోసం ‘తాకట్టు’ పెట్టింది.
  • దశలవారీ మద్య నిషేధం ఉత్తుతిదే అని తేలిపోయింది. తొలి ఏడాది 2,934కు తగ్గించిన ప్రభుత్వం.. రెండో ఏడాది యథాతథంగా ఉంచింది. ఇప్పుడు పర్యాటకం ముసుగులో 
  • 300 కొత్త దుకాణాలు పెట్టబోతోంది. వీటిలో రోజుకు రూ.6 కోట్ల విలువైన మద్యం అమ్మాలన్నది లక్ష్యం.  దీంతోపాటు ఇటీవలే రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల్లో 21 బార్లకు సర్కారు అనుమతిచ్చింది.


మద్యనిషేధం హామీ గాలిలో కలిసిపోయింది. ఆదాయార్జనకు, రుణ సమీకరణ కోసం జగన్‌ ప్రభుత్వానికి మద్యమే ప్రధాన వనరుగా మారింది. దశలవారీగా నిషేధమంటూ మూడో వంతు షాపులు తగ్గించినా.. ఆదాయం ఎక్కడా తగ్గకుండా చూసుకుంటోంది. మద్యంపై వేసే ఒకానొక పన్నును చూపి ఏకంగా రూ.21,500 కోట్ల రుణం తెచ్చేసింది. ఇది చాలదన్నట్లు.. జనంతో మరింత తాగించి ఆదాయం పెంచుకోవడానికి ఇంకో 300 దుకాణాలు కొత్తగా ఏర్పాటు చేయబోతోంది. 


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మందుబాబులే ఆధారం! వారు ఇచ్చేదే ఆదాయం కావాలి. మందుపై మరింత బాది అప్పులూ తీర్చాలి. ఇదీ రాష్ట్రంలో పరిస్థితి. ఎడాపెడా చేస్తున్న అప్పులు తీర్చేందుకు ‘మందు బాట’ పట్టారు. కేవల అప్పులు తీర్చేందుకు... ప్రతి సీసాపై సగటున రూ.50 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు. ఏపీ అభివృద్ధి కార్పొరేషన్‌ (ఏపీఎ్‌సడీసీ) ద్వారా రూ.25 వేల కోట్ల అప్పు తెస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఇప్పటికే రూ.21,500 కోట్లు రాగా.. మరో రూ.3,500 కోట్లు తెచ్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మందుపై వేసే పన్నుల్లో ఒకటైన ‘అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ (ఏఆర్‌ఈటీ)’ ద్వారా ఆ రుణం తీరుస్తామని అప్పిచ్చిన సంస్థకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంటే ప్రతి నెలా మందుపై వచ్చే రాబడిలో ఏఆర్‌ఈటీ ద్వారా వచ్చే ఆదాయాన్ని నేరుగా ఆ సంస్థకు చెల్లించాలి. ఇప్పుడా పన్ను ను మరింత పెంచుకునేందుకు కొత్తగా 300 మద్యం షాపుల ఏర్పాటుకు ఎక్సై జ్‌ శాఖ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే షాపులు తగ్గిస్తామని చెప్పి పెంచుతున్నారేమిటన్న అనుమానాలు ప్రజల్లో రాకుండా.. వాటిని పర్యాటక ప్రాంతాల్లో పెడుతున్నామనే సాకు చూపుతూ రంగం సిద్ధంచేసింది.


ఈ అంశంపై మంగళవారం రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌భార్గవ ఎక్సైజ్‌ అధికారులతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో కొన్ని ఆదేశాలు జారీచేశారు. పర్యాటక ప్రాంతాలుగా భావించే అన్ని ప్రాంతాల్లో మద్యం షాపుల ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని.. పది రోజుల్లోనే గుర్తించాలని నిర్దేశించారు. అంతే.. బుధవారం ఉదయమే ఎక్సైజ్‌ అధికారులు రంగంలోకి దిగిపోయారు. తవ పరిధుల్లో బాగా ప్రసిద్ధి చెందిన.. లేదా ఓ మోస్తరు పర్యాటకులు వచ్చే అన్ని ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. ప్రాథమికంగా 40 చోట్ల షాపులు పెట్టుకునేందుకు అవకాశం ఉందని అధికారులు నివేదించగా.. ఎన్ని వీలైతే అన్ని పెట్టేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. కచ్చితంగా ఇన్నే పెట్టాలన్న నిబంధనేదీ లేదని.. ఎన్నైనా ఏర్పాటు చేయవచ్చని సంకేతాలు పంపింది. ఇప్పటికే రాష్ట్రంలో వాక్‌-ఇన్‌ స్టోర్ల పేరుతో 90 మద్యం షాపులకు అనుమతివ్వగా.. వాటిలో 24 ఏర్పాటుచేశారు. అవి కూడా కలిపి మొత్తం 300 దుకాణాలను కొత్తగా పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.


రోజుకు 6 కోట్ల అమ్మకాలు..!

రాష్ట్రంలో ప్రస్తుతం 2,934 మద్యం షాపులున్నాయి. దుకాణాలు, బార్లలో కలిపి మొత్తం సగటున నెలకు రూ.2 వేల కోట్ల మద్యం విక్రయిస్తున్నారు. ఒక్కో షాపులో రోజుకు సరాసరి రూ.లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకూ అమ్ముతారు. పర్యాటక ప్రాంతాల్లో 300 కొత్త దుకాణాలు ఏర్పడితే ఎంతలేదన్నా వాటి వల్ల నెలకు రూ.180-200 కోట్ల వరకు అమ్మకాలు పెరగొచ్చని అంటున్నారు. అంటే రోజుకు రూ.6 కోట్ల న్న మాట. అందులో 80 శాతం.. అంటే సుమారు రూ.160 కోట్లు ప్రభుత్వానికి ఆదాయంగా మిగులుతుంది. ఒక్కో సీసాపై ఏఆర్‌ఈటీ కింద ప్ర భుత్వం రూ.40 నుంచి రూ.480 వరకు వసూలు చేస్తోంది(వాటి విలువ, పరిమాణాన్ని బట్టి పన్నును నిర్ణయించిం ది). సీసాపై సగటున పడే రూ.50 భారం అప్పు ఇచ్చిన సంస్థకుపోతుంది.


తగ్గించకపోగా.. పెంచుతారా?

వైసీపీ అధికారంలోకి రావడానికి ఇచ్చిన కీలక హామీల్లో మద్య నిషేధం ఒకటి. దశలవారీగా మద్య నిషేధం చేస్తామని, స్టార్‌ హోటళ్లలో తప్ప మందు ఎక్కడా అందుబాటులో ఉండదని సీఎ జగన్‌ పదే పదే చెప్పారు. అందులో భాగంగా తొలి విడతలో 880 షాపులు తగ్గించారు. దీంతో షాపుల సంఖ్య 4,380 నుంచి 3,500కు చేరింది. తర్వాత పలు కారణాలతో ఆ సంఖ్యను 2,934కు కుదించారు. దీనికి కారణం కరోనా అయినప్పటికీ అది కూడా దశలవారీగా మద్య నిషేధంలో భాగమని ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు ఇంకొన్ని మద్యం షాపులు తగ్గించాల్సిన సమయం వచ్చింది. కానీ ఆ ఊసే ఎత్తడం లేదు. ఇప్పుడున్న అదనంగా మరో 300 దుకాణాల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించడం పలు అనుమానాలకు దారితీస్తోంది. దశలవారీ మద్యనిషేధం అంటే క్రమంగా షాపుల సంఖ్య తగ్గించాలి కానీ.. పెంచడం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి.  


మన మందే తాగాలి!

పక్క రాష్ర్టాల నుంచి వచ్చే ఎన్‌డీపీఎల్‌ మద్యంపై గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ నిఘా పె ట్టారు. నాటుసారా తయారీపైనా దాడులు చేస్తున్నారు. ఇదంతా చూసి అక్రమ మద్యంపై ప్రభు త్వం కఠిన చర్యలు చేపడుతోందని భావిస్తే తప్పులో కాలేసినట్లే. అక్రమ మద్యం లేకపోతే కచ్చితంగా వారంతా తాము అమ్మే చిత్రవిచిత్ర బ్రాండ్ల మందునే కొంటారని, దానివల్ల తమతోపాటు ప్రభుత్వానికీ భారీగా ఆదాయం వస్తుందనేది పెద్దల ఆలోచన. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పుంజుకోవాలని తాజా వీడియో కాన్ఫరెన్స్‌లో రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌ అధికారులను మరీ మరీ అప్రమత్తం చేశారు.