ధరణిలో నమోదుకు..గడువేమీ లేదు

ABN , First Publish Date - 2020-10-22T07:47:51+05:30 IST

ధరణి పోర్టల్‌లో ఆస్తుల నమోదు నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి తుది గడువేమీ లేదని తెలిపింది. ధరణి వెబ్‌ పోర్టల్‌లో ఆస్తుల గుర్తింపు కోసం వ్యక్తిగత

ధరణిలో నమోదుకు..గడువేమీ లేదు

ఆస్తుల నమోదు నిరంతర ప్రక్రియ.. హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం

ధరణి వెబ్‌ పోర్టల్‌లో వ్యక్తిగత వివరాల 

సేకరణపై స్టేకు నిరాకరించిన హైకోర్టు

కౌంటర్‌ వేయాలని సర్కారుకు ఆదేశం

తదుపరి విచారణ 3కు వాయిదా


హైదరాబాద్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ధరణి పోర్టల్‌లో ఆస్తుల నమోదు నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి తుది గడువేమీ లేదని తెలిపింది. ధరణి వెబ్‌ పోర్టల్‌లో ఆస్తుల గుర్తింపు కోసం వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారని, దీన్ని నిలిపివేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం విచారణ సందర్భంగా.. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు హైకోర్టుకు తెలియజేసింది. 15 రోజుల్లోగా ధరణిలో ఆస్తులు నమోదు చేసుకోకపోతే ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్న ప్రజలకు సర్కారు ప్రకటనతో ఊరట లభించినట్లయింది.


మరోవైపు ధరణి వెబ్‌ పోర్టల్‌లో ఆస్తుల గుర్తింపు కోసం ఇస్తున్న దరఖాస్తులో ఆధార్‌ సంఖ్య, కులం తదితర వివరాల సేకరణపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అయితే దీనిపై పూర్తి వివరాలతో నవంబరు 2లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని, ఆ ప్రతిని రెండు రోజుల ముందే పిటిషనర్‌ తరఫు న్యాయవాదికి ఇవ్వాలని స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిల ధర్మాసనం బుధవారం ఈ ఆదేశాలు జారీచేసింది.


ధరణి పోర్టల్‌లో ఆస్తుల నమోదు కోసం ఇస్తున్న దరఖాస్తులో ఆధార్‌ సంఖ్య, కులం తదితర వ్యక్తిగత వివరాలు కోరడం ప్రజల వ్యక్తిగత సమాచార గోప్యతకు భంగం కలిగించడమే అవుతుందని.. దీన్ని రద్దు చేయాలని కోరుతూ రాంగోపాల్‌ శర్మ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి1 వాదించారు. ధరణి పోర్టల్‌కు ఎలాంటి చట్టబద్ధత లేదన్నారు. ప్రజల ఆస్తులు, వ్యక్తిగత వివరాలు 15 రోజుల్లో ఆధార్‌ వెబ్‌ పోర్టల్‌లో పెట్టి ప్రజలందరికీ అందుబాటులో ఉంచనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు.


ఇటువంటి చర్యల వల్ల ప్రజల వ్యక్తిగత సమాచారానికి రక్షణ లేకుండా పోతుందన్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల నుంచి మాత్రమే ఆధార్‌, కులం వివరాలు సేకరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని గుర్తుచేశారు. చాలా మంది ప్రజలు తమ కులాన్ని బయటకు చెప్పుకోవడానికి అంగీకరించరన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎ్‌స.ప్రసాద్‌ వాదిస్తూ.. ధరణి వెబ్‌ పోర్టల్లో ఆస్తులు నమోదు ప్రక్రియకు తుది గడువు నిర్ణయించలేదన్నారు.




ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ఽకులం వివరాలు కోరితే తప్పేంటని పిటిషనర్‌ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. పాఠశాలలో చేరిన మొదటి రోజే కులం వివరాలు నమోదు చేయడం పరిపాటిగా వస్తోందని గుర్తు చేసింది. ప్రభుత్వం వ్యక్తిగత వివరాలకు రక్షణ కల్పిస్తామని చెబుతోందని తెలిపింది. ధరణి వెబ్‌పోర్టల్‌లో ఆస్తుల నమోదుకు 15 రోజులే గడువు విధించారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది చెబుతున్నందున దానిపై ప్రభుత్వ వివరణ తీసుకుని మధ్యాహ్నం 1.30 గంటలకు చెప్పాలని ఏజీకి సూచించింది.


ప్రభుత్వ వివరణ తీసుకున్న తర్వాత ఏజీ కోర్టు ముందు హాజరై ‘ధరణి వెబ్‌ పోర్టల్‌లో ఆస్తుల వివరాలు నమోదు చేయడానికి ఎలాంటి తుది గడువు లేదు. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది’ అని తెలిపారు. వెబ్‌పోర్టల్‌లోని ప్రజల వ్యక్తిగత సమాచారానికి పూర్తి భద్రత ఉంటుందన్నారు. ఈ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న ధర్మాసనం.. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, పురపాలక, పంచాయతీరాజ్‌ -గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శులకు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ తదితరులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబరు 3కు వాయిదా వేసింది.


రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయేతర భూముల్లో ప్రస్తుతం ప్రధానంగా ఇళ్ల వివరాల సేకరణ జరుగుతోంది. గ్రామాల్లో కూడా ఇళ్ల సర్వే రాత్రింబవళ్లు జరుగుతోంది. క్షేత్రస్థాయి సిబ్బందికి సెలవులు కూడా లేవు. ఆస్తుల సమాచార సేకరణను ధరణి ప్రారంభం లోపే పూర్తి చేయాలన్న పట్టుదలతో వారు పని చేస్తున్నారు. అయితే ఆలోగా ఆస్తుల నమోదు నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపిన నేపథ్యంలో సిబ్బందికి కాస్త ఊరట లభించనుంది.


Updated Date - 2020-10-22T07:47:51+05:30 IST